తనదాకా వస్తేగానీ తత్వం బోధపడదన్నట్టు, చేతులు కాలినంక ఆకులు పట్టుకున్న చందంగా… ‘లెక్కా పద్దూ చూడకుండా గ్యారెంటీలు ప్రకటించకండ్రా బడుద్దాయిలు’ అని తాజాగా మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నాయకులకు ఉపదేశం చేశారు. ఈ విషయం చూసిన వారెవరికైనా తోటకూర దొంగతనం నాడే మందలించి ఉంటే… అన్న సామెత గుర్తుకొస్తుంది.
అధికారంలోకి రావడం కోసం కర్ణాటక, తెలంగాణలో ఇష్టారీతిన ఇచ్చిన గ్యారెంటీలు, హామీలు, ప్రకటించిన పథకాలు అమలు చేయలేక, చేయలేమని ప్రజలకు చెప్పలేక, తలబొప్పి కడుతున్న సందర్భంలో జ్ఞానోదయం అయినట్టు ఉన్నది కాంగ్రెస్ అధినాయకునికి. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలకు ముందు ఈ రకమైన హితోపదేశం చూసిన ఎవరికైనా ఒక విషయం అర్థమవుతుంది. ఎన్నికల సమయంలో అలవికాని హామీలిచ్చి ఏదోరకంగా ఆయా రాష్ర్టాల్లో అధికారానికొచ్చినా గ్యారెంటీల అమలులో ఫెయిలైతే 2029లో వచ్చే సాధారణ ఎన్నికల్లో మొదటికే మోసం వస్తుందనే ముందుచూపు ఖర్గే వారి అంతర్మథనానికి కారణమై ఉండవచ్చు.
ఇతర రాష్ర్టాల్లో పోటీచేసే పరిస్థితి లేదు కానీ, కాంగ్రెస్ గ్యారెంటీలకు కాస్త అటూ ఇటుగా సూపర్ సిక్స్ పేరుతో ‘నీకు 15 వేలు, నీకు 15 వేలు’ అని ఊదరగొట్టి వాటితో పాటు చాం తాడంత లిస్టుతో హామీలిచ్చి ఏపీలో అధికారంలోకి వచ్చి హామీలు అమలుచేయలేక చతికిలపడ్డ బాబూ అవకాశమొస్తే అదే ప్రవచించేవారేమో. ఇప్పటికే అనేక సందర్భాల్లో ఇచ్చిన హామీలు అమలుచేయలేని అసహాయతను ఆయన బయటపెడుతున్నారు కూడా.
ఏదేమైనా ముందుచూపో, భయమో పార్టీ తీరు మారుద్దామనుకున్న మల్లికార్జున ఖర్గే సొంత పార్టీ నేతల నుంచే తన వ్యాఖ్యలపై అభ్యంతరాలు రాగానే మాట మార్చి తనను పత్రికలు తప్పుగా కోట్ చేశాయంటున్నారు. తెలంగాణ, కర్ణాటకలలో మాత్రం ఇష్టారీతిన హామీలిచ్చి అధికారాన్ని అనుభవిస్తూ మమ్మల్ని వద్దంటే ఎలా? అని మహారాష్ట్ర, ఝార్ఖండ్ కాంగ్రెస్ నాయకులు ఖర్గేపై కారాలు, మిరియాలు నూరుతున్నారట. అయినా కాంగ్రెస్ సంస్కృతి తెలిసీ ఖర్గే తప్పుగా మాట్లాడారని సదరు నాయకులు అభిప్రాయపడ్డారట. ‘చెప్పినవన్నీ చేస్తామా ఏం? ఏదోరకంగా కుర్చీ సాధించాలి గానీ, ఇవేం మతిలేని ప్రేలాపనలు.
ప్రజలు, ప్రతిపక్షాలు తిట్టడం సాధారణమే. దున్నపోతు మీద వాన పడినట్టు మేం పట్టించుకోనట్టు నటించడమూ మామూలే. ఇంతమాత్రాన గ్యారెంటీలు ఇవ్వకపోతే పదవులెట్లా వస్తాయ’ని వారు తెగ హైరానా పడిపోతున్నారని వినికిడి. హామీ లు అమలుచేసినా ప్రతిపక్షాలు మనం బాగా చేశామంటాయా? వాళ్లు విమర్శించినంత మాత్రాన డంగైపో యి చాప చుట్టేయాలా అని గాభరా పడుతున్నారట.
తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారశైలి చూస్తే సాధారణ ప్రజలకు వారి విధానమేం టో అర్థమవుతున్నది. ‘తెలంగాణ విషయానికొస్తే హామీల అమలుకు 100 రోజుల సమయమే అడిగా రు కదా. సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే కూడా వచ్చి గ్యారెంటీలిచ్చారు, బాండ్ పేపర్లు రాసిచ్చారు కదా. వాటి సంగతేమిటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే మీరు చెప్పినవన్నీ చేశారా అని దబాయిస్తాం? మరీ గట్టిగా అడిగితే కేసులు పెడతాం. ఇంకా కాదంటే ఏదో ఒక డైవర్షన్ స్కీం పెడతాం. ఏదీ వర్కవుట్ కాకపోతే అంతర్గత సంభాషణలను, పార్టీ వ్యవహారాలను ప్రజల్లో పెట్టి చర్చకు దారితీస్తాం. అదేదీ కుదరకపోతే ప్రతిపక్ష నాయకుల ఇండ్లపై దాడులు చేస్తాం, అవసరమైతే కుటుంబాలను కూడా రోడ్డుకీడుస్తాం. అంతేకానీ మ్యానిఫెస్టోలో గ్యారెంటీలు ఇవ్వకుండా పార్టీ అవకాశాలను దెబ్బతీసుకుంటామా’ అని ఆరున్నొక్కరాగం అందుకున్నారట మరికొంత మంది.
ఖర్గే యథాలాపంగా మాట్లాడారో లేక సీరియస్‌గానే మాట్లాడారో తెల్వక ఆ రెండు రాష్ర్టాల కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీలు తికమకపడి, అధికారంలోకి వచ్చిన రాష్ర్టాల్లోని గ్యారెంటీలకు కొద్దిగా అటూఇటు గా కాపీ కొట్టి ఇక్కడ అధికారాన్ని కొట్టుకొద్దామంటే ఈయనేమిటి గ్యారెంటీలు లేని మాటలు మాట్లాడుతున్నాడని తెగ ఫీలై కొంతమంది బహిరంగంగానే ఖర్గేను సున్నితంగా విమర్శించారు.
బీజేపీ పరిస్థితి కూడా కాంగ్రెస్‌కు భిన్నంగా ఏమీ లేదు. ఉచితాల గురించి అభ్యంతరాలు వ్యక్తం చేసే మోదీ బృందం కూడా వాటి బాటే పట్టింది. ప్రతీ మహిళకు రూ.2,100 ఇస్తామని ఝార్ఖండ్‌లో చెప్పిన బీజేపీ, నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పింది. మహారాష్ట్రలోనూ ఇదే అంశంపై బీజేపీ ఆధారపడ్డట్టు కన్పించింది. ముఖ్యమంత్రి లడ్కీ బచావ్ పేరుతో మహిళలకు ప్రతీ నెల రూ.1500 హామీ ఇచ్చి, ఇప్పటికే పాక్షికంగా అమలుచేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీ హామీ మామూలే.
మహారాష్ట్రలో షిండే ప్రభుత్వం విద్యుత్తు విషయంలో 100 శాతం, కార్మికుల విషయంలో 86 శాతం, రవాణా విషయంలో 75 శాతం, నీటి విషయంలో 87.5 శాతం ఫెయిలైందనే విషయం పత్రికలు, విమర్శకులు కోడై కూస్తున్నా ప్రజలు పట్టించుకోరని ఉచితాలే గట్టెక్కిస్తాయని బీజేపీ భావనగా కనపడుతున్నది. ఉచితాలు, హామీల విషయంలో ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటములు కూడా తక్కు వేం తినలేదు. ఒకడుగు ముందుకేసి మహారాష్ట్రలో ప్రతి మహిళకు నెలకు రూ.2 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. హేమంత్ సోరెన్, కాంగ్రెస్ కూటమి ఝార్ఖండ్‌లో మహిళలకు ప్రతీ నెల రూ.2500 భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. రూ.6-12 వేల వరకు నిరుద్యోగ భృతి హామీ కూడా ఇచ్చారు. ఇవన్నీ చూస్తే ఖర్గే గాబరా పడ్డా కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీలు అవేమీ పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. తెలంగాణ, కర్ణాటక అనుభవాలతో కాంగ్రెస్ ఏం నేర్చుకున్న ట్టు గోచరిస్తలేదు.
గత హామీల అమలుకు దిక్కు లేకున్నా, కొత్త హా మీలు, పథకాలు ప్రకటిస్తే ప్రజలు సమాధాన పడి ఓట్లేస్తారులే అనేది కాంగ్రెస్, బీజేపీల ధీమాగా కనపడుతున్నది. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఏ విషయంలో విభేదాలున్నా ప్రజలకిచ్చే హామీల విషయంలో ఈ రెండు పార్టీల వ్యవహారశైలి దొందూ దొందే అన్నట్టుగా ఉన్నది. ప్రజల నిజమైన అవసరాలపై వాటికి పట్టింపులేదు. ఇచ్చిన హామీలు తప్పనిసరి గా నెరవేర్చాలనే తలంపు లేదు. అధికారమే పరమావధి అన్నట్టుగా ఉన్న వీరి మలినమైన కార్యాచరణను ప్రజలు కచ్చితంగా తిరస్కరిస్తారు.
(వ్యాసకర్త: రాష్ట్ర విద్య, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ )
– రావుల శ్రీధర్ రెడ్డి