ప్రతిపక్ష పార్టీలు లేని దేశమే బీజేపీ లక్ష్యం. అందుకే ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష పార్టీ నేతలను వేధింపులకు గురిచేస్తున్నది. బహుళ పార్టీ వ్యవస్థ అనేది రాజ్యాంగం ప్రాథమిక లక్షణం. కేంద్ర దర్యాప్తు సంస్థల సాయంతో దాన్ని నాశనం చేయవద్దు. ప్రస్తుతం దేశంలో అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
రాజ్యాంగంలో సవరణలు: బైబిల్, ఖురాన్, భగవద్గీతలాగే రాజ్యాంగం కూడా పవిత్రమైనదే. అలాం టి దానికి సవరణలు చేయడమేంటి? మత గ్రంథాల వలె రాజ్యాంగాన్ని కూడా మార్చకుండా ఉంచాలి. రాజకీయ నాయకులు రాజ్యాంగంలో సవరణలు చేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ఒకవేళ, రాజ్యాంగంలో సవరణలు చేయాల్సి వస్తే, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాతనే ఆ ప్రక్రియను చేపట్టాలి.
కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాలంటూ ప్రధాని మోదీ చెప్తున్నారు. విపక్షాలు లేని భారతే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తున్నది. ఇది తప్పు. బహుళ పార్టీ వ్యవస్థ అనేది రాజ్యాంగం ప్రాథమిక లక్షణం. అయితే, ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాన్ని ధ్వంసం చేస్తుండటం చూస్తున్నాం. ఇది సరైంది కాదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ శక్తిమంతంగా పనిచేయాలంటే బహుళపార్టీ వ్యవస్థ అనేది అత్యావశ్యకం. అయితే, ప్రస్తుతం దేశంలో విపక్ష పార్టీల గొంతుకను నొక్కేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఓ ఆయుధంగా వాడుతున్నారు. పార్లమెంట్లో చర్చ జరగకుండానే అనేక చట్టాలు అమల్లోకి తీసుకొస్తున్నారు.
తద్వారా సమాఖ్య స్ఫూర్తి ప్రమాదంలో పడిపోతున్నది. (మూడు సాగు చట్టాలను పరోక్షంగా ఉటంకిస్తూ..) విపక్షాల అభిప్రాయం తీసుకోకుండానే ఏకపక్షంగా చట్టాలు తీసుకొస్తారు. నిరసనలు ఎదురవ్వగానే వెనక్కి తీసుకుంటారు. అయితే, చట్టాలపై అఖిలపక్షంతో చర్చించాలన్న అసలు విషయాన్ని మాత్రం పక్కనబెడతారు. జీఎస్టీని తీసుకురావడంతో రాష్ర్టాల ఆదాయానికి గండి పడినట్టయ్యింది. నిజమే కదా. ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని రాజకీయపార్టీలు అధికారంలోకి రావడమే పరమావధిగా పెట్టుకొన్నాయి తప్ప, ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదు. భారత్ ఓ ప్రజాస్వామ్య దేశమనేది ఇప్పుడు కేవలం రాతల్లోనే కనిపిస్తున్నది. ఆత్మలో మాత్రం అది ఏ కోశానా కనిపించట్లేదు.
మూక దాడులు: ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతీ ఒక్కరిపై లక్షిత దాడులు జరుగుతున్నాయి. మైనారిటీల నుంచి స్టాండప్ కమీడియన్ల వరకూ ఎవర్నీ విడిచిపెట్టట్లేదు. పార్లమెంట్‌కు ఎన్నికైన ప్రజాప్రతినిధులు.. తమను ఎన్నుకున్న అదే పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాసేలా నిర్ణయాలు తీసుకుంటారని బహుశా అప్పట్లో అంబేద్కర్ వంటివాళ్లు కూడా ఊహించి ఉండరు. అయితే, అదే ఇప్పుడు జరుగుతున్నది. భారత రాజకీయాల్లో భక్తి అనేది ప్రబలంగా ఉన్నట్టు అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు.
నియంతృత్వానికి ఇదో మార్గమని కూడా అన్నారు. సరిగ్గా, ఇప్పుడదే జరుగుతున్నది. (మూక దాడులను ఉద్దేశిస్తూ..) మన చుట్టూరా ఉన్న భక్తులు ఏమేం చేస్తున్నారో రోజూ చూస్తూనే ఉన్నాం. భక్తి ముసుగులో వాళ్లు చేస్తున్న ఆగడాలకు మనసు పులకించిపోతున్నది (వ్యంగ్యంగా). దేశంలో సోదరభావం ఎక్కడున్నది? అగ్రవర్ణాలు, అట్టడుగువర్ణాల మధ్య సోదరభావం కనిపిస్తున్నదా? మతాల మధ్య సోదరభావం ఎక్కడున్నది? కేరళను చూసి ప్రతీ భారతీయుడు కొంతలో కొంతైనా గర్వపడాలి. అయితే, నేనొచ్చిన గుజరాత్లో మాత్రం దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.
విపక్ష ప్రభుత్వాల కూల్చివేతలు: దేశంలోని ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలను ఓ పార్టీ (బీజేపీని పరోక్షంగా ఉదహరిస్తూ) కూల్చిం ది. దీనికోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది. అనంతరం.. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొనగానే, బలపరీక్ష నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు తలుపు తడుతుం ది. దీంతో కోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. అప్పుడు, అసలైన గేమ్ మొదలవుతుంది. చార్టెడ్ విమానాల్లో ఎమ్మెల్యేలను తీసుకెళ్లి సెవన్ స్టార్ హోటల్స్‌లో పెడతారు. బలపరీక్ష నాడు వాళ్లొస్తారు. ఏ పార్టీ ఇచ్చిన టికెట్ తీసుకొని గెలిచారో.. అదే పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారు. ఇది న్యాయమా? ఇలాంటి బల పరీక్షలు మనకు అవసరమా? మెజారిటీ ఉన్నదన్న కారణంతో రాజకీయ పార్టీలు ఏం కావాలంటే, అది చేస్తానంటే కుదరదు. ఇష్టారీతిన రాజ్యాంగ సూత్రాలను మార్చాలనుకొంటే ఎవరూ ఊరుకోరు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం శుభపరిణామం.
పౌరుల హక్కులు: దేశంలోని చాలామంది పౌరులకు తమ ప్రాథమిక హక్కులపై సరైన అవగాహన లేదు. అందుకే ప్రభుత్వం, పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు ఈ విషయంలో ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరమున్నది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని కాపాడటంలో కొందరు న్యాయమూర్తులు విఫలమవుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులనే వారు పాటించడం లేదు. పదవీ విరమణ తర్వాత న్యాయమూర్తులు ఎలాంటి కార్యనిర్వాహక పదవులు చేపట్టకూడదు.
ఇలాంటి నియామకాలు ‘నీకిది-నాకది’ అన్న రీతిలో జరిగి ఉంటాయని ప్రజలు అనుమానిస్తున్నారు. ఇది మంచిది కాదు. ముస్లింలు, ప్రధాని మోదీకి వ్యతిరేకమైన కొన్ని కేసుల్లో న్యాయస్థానాలు రాజీపడినట్టు అర్థమవుతున్నది. రాజ్యాంగాన్ని రక్షించడంలో, దాని విలువలు, పవిత్రతను కాపాడటంలో కొందరు న్యాయమూర్తులు విఫలమవుతున్నారు. కొన్నిసార్లు న్యాయవ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేయట్లేదు. దీనికి కొందరు జడ్జీలే కారణం. అయితే, నా మాటలు మొత్తం న్యాయ వ్యవస్థకు వర్తించవు. ఇప్పటికీ ఎంతో మంది మంచి జడ్జీలు కూడా ఉన్నారు.
(ఎర్నాకులం ప్రభుత్వ న్యాయ కళాశాల సదస్సులో దవే చేసిన ప్రసంగ సారాంశం)
దుష్యంత్ దవే
(సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది)