BJP | కొన్ని సందర్భాలు మనల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతాయి. కండ్ల ముందు కనబడేది నిజమా, కలా అన్న సందేహన్ని కలిగిస్తాయి. శనివారం వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ పనే చేశాయి. 224 స్థానాలున్న అసెంబ్లీలో 135 సీట్లలో కాంగ్రెస్ గెలుపొందింది. హైడెసిబుల్ ప్రచారంతో భూమ్యాకాశాలను ఏకం చేసిన బీజేపీ కేవలం 66 సీట్ల దగ్గర చతికిలపడింది. కింగ్‌మేకర్ అవుతుందనుకున్న జేడీ(ఎస్) ఎన్నడూ లేనివిధంగా 19 సీట్లకు పరిమితమైంది.
బీజేపీకి ఈ ఫలితాలు అతి పెద్ద షాక్. ఆ పార్టీకి చెందిన స్పీకర్, 12మంది మం త్రులు ఘోరంగా ఓడిపోయారు. ఒకటా రెండా ప్రధాని నరేంద్ర మోదీ 12 రోజులపాటు కర్ణాటకలో మకాం వేశారు. 20 బహిరంగ సభ లు, అరడజను రోడ్ షోలు జరిపారు. గతంలో ఏ ప్రధానీ ఇన్ని రోజులు ప్రచారం కోసం ఒక రాష్ట్రంలో ఉండలేదు. మోదీ ప్రదర్శించిన అతి విశ్వాసం గమనిస్తే, బీజేపీ ఘనవిజయం లాంఛనప్రాయమే అనుకున్నారంతా. అందుకేనేమో, ఫలితాల రోజు ఇంచుమించు ప్రతి ఛానెల్లో నూ యాంకర్లు బీజేపీ గెలవబోతున్నదన్న మైం డ్ సెట్‌తో కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.
అమిత్ షా అయితే రాష్ట్రంలోని 224 స్థానా ల్లో ప్రధాని మోదీయే పోటీలో ఉన్నారని ప్రజ ల్లో ఉద్వేగం నింపాలని చూశారు. బీజేపీ ప్రచా రం యావత్తూ మతం చుట్టే తిరిగింది. పేద ముస్లింలకు ఇస్తున్న 4శాతం రిజర్వేషన్‌ను ఎత్తేయడమే కాక హిజాబ్ రగడ, టిప్పుసుల్తాన్ను అవమానించడం మైనారిటీలను అభద్రతలోకి నెట్టింది. హిందువులంతా బీజేపీని బలపర్చక పోతే పెను ప్రమాదం ముంచుకొస్తుందన్న భయాందోళనల చిచ్చు పెట్టాలని చూశారు. తమకు అనుకూలంగా లేని హిందూ మఠాలను కూడా వదిలి పెట్టలేదు. అధికారం కోసం ఏం చేసినా తప్పుకాదనే భావనతో ఈడీ, సీబీఐ దాడులు కూడా జరిపించారు. బెంగాల్ ఎన్నికల్లో చేసినట్టు ఇక్కడ కూడా ఇస్లాం బూచి చూ పి ప్రజల్లో మతపరమైన విభజన కోసం పడరాని పాట్లు పడింది కమలం పార్టీ.
మరీ దారుణమేమిటంటే జననేతలుగా అభిమానం చూరగొన్న యడ్యూరప్ప లాంటి కన్నడ దిగ్గజాలను పక్కన పెట్టి ప్రధాని, అమిత్ షా, బీఎల్ సంతో ష్, ఉత్తరాది నుంచి వచ్చిన లీడర్లు ప్రచార యంత్రాంగాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తమ పార్టీ పాలనలో ఏం చేశారో చెప్పకుండా మతవిద్వేషాలను రెచ్చగొట్టడమే ధ్యేయంగా నిర్మించిన ‘కేరళ స్టోరీ’ సినిమాను మోదీ నెత్తికెత్తుకున్నారు. అధికారంలోకి వస్తే బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ మాటలను విమర్శించటంలో తప్పేమీలేదు. కానీ ఒకడుగు ముందుకేసి బజరంగ్‌బలి, బజరంగ్ దళ్ ఒకటే అనే అభిప్రాయం కలగజేసేందుకు శతవిధాలా ఆయన ప్రయత్నించారు. ప్రతి ఓటరూ ఈవీఎంలో మీట నొక్కేటపుడు ‘జై బజరంగ్‌బలి’ అనాలట! ఎంత విడ్డూరం!!
కర్ణాటకలో 19 నెలలక్రితం ఫిరాయింపులు ప్రోత్సహించి అధికారంలోకి వచ్చింది మొదలుకొని బీజేపీ ‘విభజించు పాలించు’ సిద్ధాంతాన్నే నమ్ముకున్నది. అసెంబ్లీ ఎన్నికలపై దృష్టితో అభివృద్ధిని పక్కన పెట్టి హిజాబ్ అంశాన్ని తెరపైకి తెచ్చి హిందువులను రెచ్చగొట్టింది. దీనికి పతా క సన్నివేశంగా ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీచేసింది. కానీ కన్నడిగులు స్వభావరీత్యా ఉదారవాదులు. హిజాబ్ వివాదానికి ఆద్యుడైన విద్యాశాఖామంత్రి బీసీ నగేష్ తుమకూర్ జిల్లా తిప్తూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కే సదాక్షరి చేతిలో ఓడిపోయారు.
తమ నేత యడ్యూరప్పను పక్కనబెట్టింది బ్రాహ్మణ సామాజికవర్గం నేతకు సీఎం పదవి కట్టబెట్టడానికేనని, దాన్నుంచి దృష్టి మళ్లించడానికే రిజర్వేషన్ ఆశ చూపించారని రాష్ట్రంలో 17 శాతం వున్న లింగాయత్‌లు తెలుసుకున్నారు. అందుకే ఎన్నికల ముందే సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించాలని లింగాయత్ మఠాలు కోరాయి. కానీ బీజేపీ ఆ పని చేయలేకపోయింది. దీంతో బీజేపీ నెగ్గి ఉంటే బ్రాహ్మణవర్గం నేత బీఎల్ సంతోష్ సీఎం రేసులో ఉండేవారన్న అనుమానం బలపడింది.
లింగాయత్‌లు 90 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగల స్థితిలో ఉ న్నారు. కాంగ్రెస్‌నుంచి రికార్డు స్థాయిలో ఈసా రి ఆవర్గం వారు 53మంది విజయం సాధించ గా, బీజేపీనుంచి 20మంది ఎన్నికయ్యారు. 1989 ఎన్నికల్లో వీరేంద్ర పాటిల్ సీఎం అయినప్పుడు కాంగ్రెస్‌కు ఏకంగా 178 స్థానాలు ల భించాయి. అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ఆ యనను అమర్యాదకరంగా తొలగించడంతో ఆగ్రహించిన లింగాయత్‌లు ఆ తర్వాత కాలంలో బీజేపీకి దగ్గరయ్యారు. చాన్నాళ్ల తర్వాత ఈసారి వారు కాంగ్రెస్‌వైపు మొగ్గారు. ఇక జేడీ(ఎస్)కు చేరువగా ఉండే వొక్కళిగలు కూడా కాంగ్రెస్‌కు చేరువయ్యారు. మొత్తం 46 నియోజకవర్గాల్లో ఆ సామాజిక వర్గం ప్రభావం ఉండగా ఈసారి జేడీ(ఎస్)కు అందులో 11 మాత్రమే దక్కా యి. కాంగ్రెస్ ఏకంగా 29 కైవసం చేసుకున్నది.
గత 38 ఏండ్లుగా కర్ణాటక ఓటర్లు ఎప్పుడూ పాలక పార్టీని గెలిపించలేదు. అక్కడి ఎన్నికలు స్థానిక సమస్యల చుట్టూ తిరగటం, స్థానిక నేతలే ప్రముఖంగా కనబడటం మొదటినుంచీ రివాజు. అధిష్ఠాన సంస్కృతి పాతుకుపోయిన కాంగ్రెస్ కూడా కర్ణాటక విషయం వచ్చేసరికి జాగ్రత్తపడుతుంది. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఓటర్లను నమ్మించడంలో కాంగ్రెస్ సఫలమైంది. ‘40శాతం సర్కార్’ అనే కాంగ్రెస్ విమర్శను తిప్పికొట్టడానికి మోదీ ప్రయత్నించలేదు.
ఇక ‘డబుల్ ఇంజిన్ సర్కారు’ స్వీయ ప్రశంస బీజేపీకే బెడిసికొట్టింది. అభివృద్ధి అంశాలను గాలికొదిలి హనుమాన్ చాలీసా పారాయణంపై అతి నమ్మకం పెట్టుకుని పరువు తీసుకుంది. నరేంద్ర మోదీ ఏలుబడిలో 2014 నుంచి ఇం త వరకూ కర్ణాటకతో కలిపి 58 అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా 29 ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైం ది. అంటే అది ఓటమికి అతీతమేమీ కాదు. జా తీయస్థాయిలో విపక్షాలు ఏకమై, పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తే బీజేపీని ఓడించటం అ సాధ్యమేమీ కాదు. కన్నడ ఓటర్ల తీర్పు తో బీజేపీకి తిరస్కార పరాభవం మొదలైంది. ఈ ఫలితాలు ప్రతిపక్షాల నైతిక బలాన్ని పెంచాయి.
మోదీ, అమిత్ షాలు ఏదో మేజిక్ చేస్తారని, బ్రహ్మాండం బద్దలవుతుందని బీజేపీ శ్రేణులన్నీ పూర్తిగా నమ్మాయి. కర్ణాటక తర్వాత జయించేది తెలంగాణేనని కలలుగన్నాయి. కానీ కర్ణాటకలో సొంత ప్రభుత్వాన్ని కాపాడుకోలేదు. అలాంటిది తెలంగాణలో సంక్షేమ పథకాలతో సకలవర్గాల ఆదరాభిమానాలు పొందిన బీఆర్ఎస్ పార్టీని, వ్యూహరచనా చతురుడిగా పేరున్న కేసీఆర్‌నూ ఢీకొనడం ఎట్లా సాధ్యమన్న సంశయం బీజేపీ శ్రేణులను ఇప్పుడు వేధిస్తున్నది.
కన్నడ సీమలో ఫలితాలు ఆశించినట్టు వచ్చి ఉంటే రేపు తెలంగాణలో అదే సీన్ రిపీట్ చేయొచ్చని భావించి ఉండవచ్చు. ఎన్నో పోరాటాల తో, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ గడ్డ పై ఎప్పటికీ తమ పప్పులు ఉడకవని కమలం పార్టీ ఇప్పటికైనా అర్థం చేసుకుంటే చాలు. రేపు మ ళ్లీ బీఎల్ సంతోష్, తరుణ్ చుగ్లే అన్నీ శాసిస్తారు. తెలంగాణ కమలం నేతలు కాగితపు పు లులుగా మిగుల్తారు. శాసనసభ ఎన్నికలు సమీపించగానే జాతీయ నేతలు రాబందుల్లా వాలిపోతారు. వీళ్లను పక్కన పెట్టి పార్టీని తమ అదుపులోకి తీసుకుంటారు. మత విద్వేషాలతో ఇక్క డి సోషల్ ఫ్యాబ్రిక్‌ను ధ్వంసం చేయడం అసా ధ్యం. జనం నుంచి పుట్టుకొచ్చిన నేత కేసీఆర్ ను ఢీకొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఉత్తరాది తరహాలో మతం పేరుతో చేసే రాజకీయం ఇక్కడ పనిచేయదు. సంక్షేమ పథకాలు, మత సామరస్యాలు రెండూ బీఆర్ఎస్ ప్రభు త్వం సాధించిన అద్భుత విజయాలు. వాటిని తాకితే భస్మాసుర హస్తాన్ని తలపైన పెట్టుకున్నట్టే.
-ఆర్ . శైలేష్ రెడ్డి
(సీనియర్ జర్నలిస్ట్)