న్యూఢిల్లీ, మార్చి 18 : దేశీయ విమాన ప్రయాణికులకు శుభవార్త. అదనపు చార్టీల భారం నుంచి విమాన ప్రయాణికులు ఉపశమనం పొందనున్నారు. సీటు ఎంపిక కోసం చెల్లిస్తున్న అదనపు చార్జీలను తొలగించాలని ప్రభుత్వం విమానయాన సంస్థలను ఆదేశించింది. ఈ చర్య వల్ల విమాన టికెట్ చార్జీ తగ్గడమే గాకుండా అన్ని దేశీయ విమానాల్లోని 60 శాతం సీట్లను ఉచితంగా ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తుంది. బుకింగ్ తర్వాత లేదా వెబ్ చెక్-ఇన్ సమయంలో ప్రాధాన్యతా సీట్ల కోసం అదనపు చార్జీలను చెల్లించే విధానం ఇక అంతం కానున్నది. అన్ని డొమెస్టిక్ విమానాల్లోని కనీసం 60 శాతం సీట్లకు అదనపు చార్జీలు వసూలు చేయవద్దని పౌర విమానయాన శాఖ బుధవారం ఎయిర్‌లైన్ సంస్థలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు కేవలం 20 శాతం సీట్లు మాత్రమే ఉచితంగా ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంది. అత్యధికంగా ప్రాధాన్యతా సీట్లకు ఎయిర్‌లైన్స్ అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఒకే పీఎన్ఆర్పై ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఒకే దగ్గర అవసరమైతే పక్కపక్కనే సీట్లు ఇవ్వాలని కూడా ఎయిర్‌లైన్స్‌ని మంత్రిత్వశాఖ ఆదేశించింది. పక్కపక్క సీట్ల కోసం అదనపు చార్జీలను చెల్లించే కుటుంబాలు, గ్రూపులకు ఈ చర్య ప్రయోజనం చేకూర్చనున్నది.
విమానయాన సంస్థలు ఇకపై అదనపు సేవల కోసం పారదర్శకమైన, ప్రయాణికులకు అనుకూలమైన విధానాలను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. భద్రత, కార్యాచరణ నిబంధనలకు లోబడి క్రీడా పరికరాలు, సంగీత వాయిద్యాల రవాణా సజావుగా జరిగేలా చూసే బాధ్యతను ప్రభుత్వం డీజీసీఏకు అప్పగించింది. ప్రయాణికుల్లో తరచుగా గందరగోళానికి దారితీసుకున్న పెంపుడు జంతువుల రవాణా విషయంలో ఎయిర్‌లైన్స్ నుంచి మార్గదర్శకాలు కూడా అవసరమని డీజీసీఏ ఆదేశించింది.
విమాన సర్వీసుల్లో ఆలస్యం, రద్దు, ప్రయాణానికి అనుమతి నిరాకరించిన సందర్భాల్లో ప్రయాణికుల హక్కులను మరింత పటిష్టంగా అమలు చేసేలా ప్రభుత్వం ఎయిర్‌లైన్స్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నది. మొబైల్ యాప్‌లు, బుకింగ్ ప్లాట్‌ఫారాలు, ఎయిర్‌పోర్టు కౌంటర్ల వద్ద ఈ హక్కులను బహిరంగంగా ప్రదర్శించాలని ఎయిర్‌లైన్స్‌ని డీజీసీఏ ఆదేశించింది. ప్రయాణికులకు అందుబాటును, అవగాహనను మెరుగుపరచడానికి వారి హక్కుల గురించి ప్రాంతీయ భాషల్లో కూడా తెలియచేయాలని డీజీసీఏ కోరింది.