ముంబై: భారీ వర్షాల కారణంగా ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడటంతో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున 3.48 గంటల సమయంలో చిరాగ్ నగర్లోని అశోక్ నగర్ ప్రాంతంలో గల గౌషియా చాల్పై కొండచరియలు విరిగిపడ్డాయి.
ప్రమాదంలో మృతిచెందిన వారిని మహ్మద్ సమిద్ అన్సారీ(14) సాహిల్ హుస్సేన్ అబ్దుల్ కాజీ(19) ఇంకా గుర్తించని 45 ఏండ్ల వ్యక్తి, అబాస్ ఆరిఫ్ షేక్(2), మనాత్ ఆరిఫ్ షేక్(4) మార్టినా ఆరిఫ్ షేక్(27) వికెట్ రమేష్ యాదవ్(27)గా గుర్తించారు. వీరిని ఘట్కోపర్లోని రాజావాడి దవాఖానకు తరలించే సరికే అందరూ మృతి చెందారు. గాయపడిన ఏడుగురు కుర్లాలోని బాబా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. మేయర్ రుతు తావ్డే సంఘటనా స్థలాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడినవారికి ఒక్కొక్కరికి రూ. 50 వేలు చొప్పన ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.