రాజకీయ సంకల్పానికి, ప్రచార ఆర్భాటానికి మధ్య విచ్ఛిన్నమైన వంతెన బీజేపీ ‘డబుల్ గేమ్’ను భారత నారీలోకం ఎండగడుతున్నది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొన్ని తేదీలు విజయాలకు చిహ్నాలుగా నిలిస్తే, 2026 ఏప్రిల్ 17వ తేదీ మాత్రం ’వ్యవస్థీకృత వైఫల్యానికి’ నిదర్శనంగా మిగిలిపోయింది. మూడు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మోదీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నది. కానీ మహిళల పట్ల చిత్తశుద్ధి లేని బీజేపీ రాజకీయ కుట్రలను దేశం గమనిస్తున్నది. ఇది కేవలం సాంకేతిక ఓటమి కాదు, భారత నారీ శక్తిపై కేంద్ర ప్రభుత్వం చేసిన ముందస్తు ప్రణాళికాబద్ధమైన దాడి.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లులోనే తప్పిదం ఉన్నది. మహిళా రిజర్వేషన్లను, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలతో ముడిపెట్టడమే పెద్ద మోసం. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచాలని మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఇప్పుడు ఉన్న 543 సీట్లలోనే 33 శాతం కేటాయించే వెసులుబాటును ఎందుకు వదిలేశారు? భవిష్యత్తులో జరిగే నియోజకవర్గాల పెంపుతో ముడిపెట్టడం ఎందుకు? ప్రక్రియలతో ఈ బిల్లును ముడిపెట్టడం ద్వారా, మహిళలను కేవలం వివిధ రాష్ర్టాల ఎన్నికల వరకు మభ్యపెట్టాలని చూశారు. ఓటింగ్లో బిల్లు వీగిపోయినందుకు ఆ నెపాన్ని విపక్షాలపై నెడుతున్నది.
ప్రతిపక్షాలను నిందిస్తూ విక్టిమ్ కార్డ్ ప్రదర్శించుకోవడం బీజేపీకి అలవాటుగా మారింది. ఆ పార్టీ సోషల్ మీడియా వేదికగా మహిళా లోకానికి జరిగిన ద్రోహాన్ని విపక్షాల ఖాతాలో వేయాలని చూస్తున్నది. కానీ వాస్తవానికి, మహిళలు నిర్ణయాధికార స్థానాల్లోకి వస్తే తమ పీఠాలు కదులుతాయనే భయం బీజేపీలోని పురుష అహంకార నాయకత్వానికి ఉన్నది. పార్లమెంటు లోపల బిల్లు వీగిపోయేలా దొంగాట ఆడిన బీజేపీ నేతలు, బయటకు వచ్చి నారీ శక్తి గురించి ప్రసంగాలు చేయడం హాస్యాస్పదం. 30 ఏండ్లుగా బిల్లును అడ్డుకుంటున్న శక్తులే నేడు కొత్త రూపంలో బీజేపీ ముసుగులో ఈ చారిత్రక ద్రోహానికి ఒడిగట్టాయి.
రాజకీయ చిత్తశుద్ధి ఉంటే సంస్కరణలు ఎలా ఉంటాయో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరూపించింది. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, సామాన్య మహిళలను జిల్లా పరిషత్ చైర్పర్సన్లుగా, మేయర్లుగా, సర్పంచ్లను చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. క్షేత్రస్థాయిలో విజయవంతమైన ఈ ప్రయోగాన్ని జాతీయ స్థాయిలో అమలు చేయడానికి కేంద్రానికి అడ్డంకి ఏమిటి? తెలంగాణలో సాధ్యమైన సాధికారత, దేశ రాజధానిలో ఎందుకు అసాధ్యమవుతున్నది?
‘శక్తి స్వరూపిణి‘ అని నినాదాలు ఇవ్వడం, వేదికలపై మహిళల పాదాలకు నమస్కరించడం కాదు.. వారికి రాజ్యాంగబద్ధమైన రాజకీయ భాగస్వామ్యం కల్పించాలి. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఓటమి అనేది భారత మహిళా ఆత్మగౌరవానికి జరిగిన అవమానం. కుట్రలు, కపట నాటకాలతో మహిళలను మోసం చేస్తున్న బీజేపీకి రానున్న ఎన్నికల్లో మహిళా శక్తి అంటే ఏంటో తగిన రీతిలో బుద్ధి చెప్తాం. మా హక్కుల కోసం, మా భాగస్వామ్యం కోసం చేసే పోరాటం ఆపే ప్రసక్తే లేదు. పార్లమెంటు సాక్షిగా బీజేపీ పాలకులు చేసిన ఈ అన్యాయాన్ని దేశం క్షమించదు. జై మహిళా శక్తి!
– (వ్యాసకర్త: కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్పర్సన్)
తుల ఉమ