బూర్గంపహాడ్, జూలై 27: వర్షాలకు తోడు గుంతలమయంగా మారిన రోడ్డుపై ఓ నిండు గర్భిణి 108 వాహనంలోనే నానాపాట్లు పడుతూ ప్రసవించిన ఘటన భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలం చింతకుంట అటవీ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకున్నది. మోతేపట్టీనగర్ పంచాయతీ పరిధి చింతకుంటకు చెందిన సోడి మార్త నిండు గర్భిణి. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.
108 పైలెట్ విజయభాస్కర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ రాధ గర్భిణిని వాహనంలో ఎక్కించుకొని దవాఖానకు వస్తుండగా.. గుంతల ప్రభావంవల్ల ఆమెకు నొప్పులు తీవ్రమయ్యా యి. వాహనాన్ని అటవీ ప్రాంతం మధ్యలోనే నిలిపివేయడంతో ఈఎంటీ రాధ వైద్య సదుపాయాలు కల్పించి మార్తకు ప్రసవం చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం వారిని భద్రాచలం ఏరియా దవాఖానకు తరలించారు.