హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : పచ్చటి వనాలతోనే భవిష్యత్తు తరాలు సురక్షితంగా ఉంటాయన్న గొప్ప స్ఫూర్తితో కొనసాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ మరోసారి పర్యావరణ పరిరక్షణలో తన ప్రత్యేకతను చాటుకున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవుల (మ్యాంగ్రోవ్స్) సమూహమైన సుందర్బన్ డెల్టా ప్రాంతంలో పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ బృందం నడుంబిగించింది. మడ అడవుల దినోత్సవం సందర్భంగా సుందర్బన్స్లో మరో 10 వేల మడ మొకలను నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఆరు నెలల క్రితం పశ్చిమబెంగాల్లోని సుందర్బన్ డెల్టా ప్రాంతంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో సుమారు 20 వేల మొకలు నాటి వాటికి జియో ట్యాగింగ్ చేసి సంరక్షించారు. దీనికి కొనసాగింపుగా, మడ అడవుల దినోత్సవం సందర్భంగా తాజాగా మరో 10 వేల మొకలను నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్ మార్గదర్శకత్వంలో ఈ బృహత్తర ఉద్యమం కొనసాగుతున్నది.
సుందర్బన్ అడవులు గంగ, బ్రహ్మపుత్ర, మేఘ్నా నదుల డెల్టా ప్రాంతంలో పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ మధ్య విస్తరించి ఉన్నాయి. ఈ మడ అడవుల ప్రాముఖ్యత ఎంతో విశేషమైనది. సముద్ర తుఫాన్ల నుంచి తీర ప్రాంతాన్ని రక్షించడంలో, అలల తీవ్రతను అడ్డుకోవడంలో ప్రధాన భూమిక పోషిస్తాయి. సాధారణ అడవులతో పోలిస్తే మడ అడవులు నాలుగు రెట్లు అధికంగా కార్బన్‌ను గ్రహించి గ్లోబల్ వార్మింగ్‌ను నిరోధిస్తాయి. సముద్ర మత్స్య సంపదకు, ప్రపంచ ప్రఖ్యాత రాయల్ బెంగాల్ టైగర్స్‌కు సుందర్బన్స్ ప్రధాన నివాస కేంద్రంగా ఉన్నది. అందుకే యునెసో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
ఈ హరిత కార్యక్రమంలో అత్యంత స్ఫూర్తిదాయకమైన అంశం స్థానిక మహిళల భాగస్వామ్యం. రాయల్ బెంగాల్ టైగర్స్ దాడిలో భర్తలను కోల్పోయిన సుమారు 500 మంది మహిళలు (టైగర్ విడోస్) ఈ మడ అడవుల సంరక్షకులుగా ముందుకు రావడం విశేషం. ‘మ్యాంగ్రోవ్ మ్యాన్ ఆఫ్ సుందర్బన్స్’గా గుర్తింపు పొందిన ఉమాశంకర్ మండల్ నేతృత్వంలోని మ్యాంగ్రోవ్ ఆర్మీ, ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధి శ్రీకృష్ణాతేజారెడ్డి బృందం సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. ‘ఈ అడవిలో సర్వస్వం కోల్పోయిన మహిళలే నేడు దీని పునర్నిర్మాణంలో రక్షకులుగా మారడం అభినందనీయం. ఇది కేవలం సేవా కార్యక్రమం మాత్రమే కాదు, ప్రకృతికి మనం చేస్తున్న న్యాయం. నేడు నాటిన ప్రతి మొక కూడా సుందర్బన్స్కు రక్షణ వలయంలా నిలుస్తుంది’ అని పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినమైన ఈ ఏడాది ఫిబ్రవరి 17న సుందర్బన్లో ఈ బృందం 20 వేల మొకలు నాటింది. ‘తెలంగాణకు హరితహారం’ స్ఫూర్తితో 2018లో ప్రారంభమైన గ్రీన్ ఇండియా చాలెంజ్.. ఇప్పటివరకు 44 మిలియన్ల మంది పౌరుల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా విస్తరించింది. మూడు మొకలు నాటడం- మూడేండ్లు కాపాడటం- మరో ముగ్గిరిని నామినేట్ చేయడం‘ అనే నినాదంతో కొనసాగుతున్న ఈ ఉద్యమం గోదావరి తీరం నుంచి బెంగాల్ తీర ప్రాంతాల వరకు విస్తరించింది. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం శతాబ్ది జయంతి అయిన 2031 అక్టోబర్ 15 నాటికి దేశవ్యాప్తంగా 100 కోట్ల మొకలు నాటాలనే లక్ష్యంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ అడుగులు వేస్తున్నది.