Supreme Court : దేశంలో అత్యంత వాయు కాలుష్యం ఉన్న నగరాల్లో ఢిల్లీ ఒకటి. అలాంటి నగరంలో టపాసుల వాడకం విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టపాసుల్ని పూర్తిగా నిషేధించలేమని, అలాగే, 24 గంటలపాటు అనుమతివ్వలేమని కోర్టు వ్యాఖ్యానించింది. అందుకే, మధ్యంతరంగా ఒక పరిష్కారం కనుగొనాలని కోర్టు అభిప్రాయపడింది. ఢిల్లీలో టపాసుల వినియోగాన్ని నియంత్రించాలని కోరుతూ దాఖలైన ఒక పిటిషన్పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఢిల్లీలో టపాసుల వినియోగాన్ని పూర్తిగా నియంత్రించలేం. అలా చేస్తే కొందరి మనోభావాలు దెబ్బతింటాయి. అలాగని, టపాసులు కాల్చేందుకు 24 గంటలు అనుమతి ఇవ్వలేం. దీనివల్ల పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు చాలా ఇబ్బందులు పడుతారు. అందుకే, ఈ విషయంలో ఒక మధ్యంతర పరిష్కారం అవసరం. అలాగే, కాల్చే టపాసులు ఎలాంటివి ఉండాలి.. ఎంత కాలుష్యం విడుదల చేసేవి.. ఎంత శబ్ద కాలుష్యాన్నిఅనుమతించాలి వంటి విషయాల్లో కొన్ని నిబంధనలు రూపొందించాలి.
కొన్ని గంటలపాటే టపాసులు కాల్చేందుకు అనుమతివ్వాలి. అది ఎంత వరకు అనేది తేల్చాలి. ఈ అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. టపాసులు కాల్చే విషయంలో, అనుమతించే విషయంలో తాము సూచించిన నిబంధనల్ని పరిశీలించాలని.. ఈ విషయంలో స్పందన తెలియజేయాలని కోర్టు కేంద్రానికి సూచించింది. కేసు తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. ఢిల్లీలో మామూలుగానే భారీ వాయు కాలుష్యం నమోదవుతుంది.
ముఖ్యంగా శీతాకాలంలో కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు కొన్నేళ్లుగా అక్కడి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అలాంటిది. కొన్ని ఫెస్టివల్స్ సందర్భంగా టపాసులు కాల్చడంతో ఇంకా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే, ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.