‘మళ్లొస్తున్నారురో.. మాయదారి మోసగాళ్లు’ అనే పాత పాట ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను గమనిస్తున్న వారందరికీ గుర్తుకురాక మానదు. ఖమ్మం సభలో కలహాల కాంగ్రెస్ కలల బేహారీ చేష్టలు, బీజేపీలో జరుగుతున్న కుర్చీ కొట్లాటలు ‘ఏం లేని ఇత్తారి.. ఎగిరెగిరి దుంకులాడినట్టుగా’ ఉన్నాయి.
రెమ్మలు లేని కమలం, వేళ్లు లేని హస్తం రెండూ రాష్ట్రంలో దిష్టిబొమ్మల దుకాణాలు తెరుచుకున్నాయి.మెరుపులతోనో, ఊరేగింపులతోనో జనం ఆమోదాన్ని ఏ రాజకీయ పార్టీ పొందలేదు. జిమ్మిక్కులతో బ్యాలెట్ బాక్సులు నింపుకోవడానికి పాత భారతంలోనే సమాజం ఆగిపోలేదు. విశ్లేషించుకొని, విస్పష్టమైన తీర్పునిచ్చే ఆలోచనాపరులుగా ప్రజలు ఏనాడో ఎదిగారు. కానీ దురదృష్టవశాత్తు దేశాన్ని ఏలిన జాతీయ పార్టీలే మరుగుజ్జు వలె మారిపోయాయి. అందుకే జీవితాన్ని గెలుచుకున్న తెలంగాణతో గోక్కుంటున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏనాడో దూరమైన కాంగ్రెస్, ఎన్నడూ జనం నమ్మనే నమ్మని బీజేపీలు నింగికి నిచ్చెన వేస్తున్నాయి. విచిత్రాతి, విచిత్రమైన, వింత ధోరణులతో, రోదనలతో రాజకీయ కాలుష్యాన్ని రాజేస్తున్నాయి. నమ్మితే నట్టేట ముంచింది చాలదన్నట్టుగా, మళ్లీ ఆశల పల్లకిలో ఊరేగుతున్న ఈ రెండు జాతీయపార్టీల తీరు నిజంగా ‘నవ్విపోదురు గాని నాకేంటి సిగ్గు’ అన్నట్టుగానే ఉన్నది.
ప్రజల విశ్వాసాన్ని పొందడానికి శిశువుకు జన్మనిచ్చేందుకు, నవ మాసాలు తల్లి పడే కష్టాన్ని, జాగ్రత్తలను రాజకీయపార్టీలు పాటించాలి. కారల్ మార్క్స్ అన్నట్టు రాజకీయ పార్టీలది మంత్రసాని పాత్ర. నెలలు నిండి, నొప్పులు వచ్చిన తర్వాతనే మంత్రసాని అవసరమేర్పడుతుంది. కానీ కాంగ్రెస్, బీజేపీలు మాత్రం బలవంతపు ప్రసవానికి ఒత్తిడి చేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇది తల్లీ, బిడ్డలను చంపేసే మాయదారి మంత్రసానుల వికృత వ్యవహార శైలి. రెండు, మూడు సభల ద్వారానో, హామీల ప్రకటనల ద్వారానో ప్రజలు వెంటవస్తారా? నాయకత్వాలను మార్చినంత మాత్రాన నమ్మి ప్రజలు ఓట్లు వేసేస్తారా? ఇంతకు ఏమైంది ఈ రెండు రాజకీయ పార్టీలకు! ‘రాజకీయాల్లో లీడర్లు అందరూ రీడర్లు కావొచ్చు కానీ, రీడర్లందరూ లీడర్లు కాలేరు’. రాహుల్‌గాంధీ మంచి రీడర్ కావొచ్చు, రాసిచ్చిన ప్రసంగాలను చదివే నేర్పును పొంది ఉండవచ్చు. కానీ, లీడర్‌గా ఎందుకు ఎదుగలేకపోతున్నాడో మొన్నటి ఖమ్మం సభతో తెలంగాణకు అర్థమైంది. చేయూత పథకం ద్వారా 4 వేలు పింఛన్ ఇస్తామంటే నమ్మి, ‘చేవచచ్చిన చేతులకు’ అధికారం అప్పగిస్తారని దేశానికి నాయకత్వం వహించే స్థాయి నాయకుడు భ్రమించవచ్చునా?
అసలు ఖమ్మం సభావేదికపై నిలబడి, కాదు కాదు తోసుకుంటూ, తొక్కుకుంటూ, ప్లకార్డులు విసిరేసుకుంటూ ఆసీనులైన రేవంత్ రెడ్డి, జానా రెడ్డి, కోమటి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి తదితరులు తెలంగాణకు తెల్వనోళ్లా? వాళ్లంతా అధికార పల్లకీల్లో ఊరేగిననాడు ఒరగబెట్టిందేమిటో, వారి నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెల్సిందే కదా! ఈ నాయకుల ‘చేతి’కి తెలంగాణ చిక్కితే, ఎంత గోస పడాల్సి వస్తుందో బుద్ధిజీవులైన తెలంగాణ ప్రజలు పసిగట్టలేరా? అసలు సువిశాల భారతదేశానికి నాయకత్వం వహించే నాయకుడి నోటివెంట ఎలాంటి ప్రసంగాన్ని సమాజం ఆశిస్తుందో రాహుల్‌గాంధీకి ఇంకా అర్థం కాకపోవడం దురదృష్టకరం. ఒక హామీ ప్రకటించేముందు, తమలోనికి తొంగి చూసుకోవాలి కదా? హస్తం అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో ‘వెయ్యి’ కూడా ఇవ్వక, అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో 600 రూపాయలే అందిస్తూ, తెలంగాణలో 4 వేల పింఛన్ అందిస్తామనడం కాంగ్రెస్ నయవంచనకు నిదర్శనం. అయినా నిండా మునగడానికి అమాయకపు తెలంగాణ కాదిది, నైపుణ్యాల నేలగా మారిపోయింది. ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే ప్రజారాశుల నిలయంగా మారిపోయింది. ఎక్కడికొచ్చి, ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని ఢిల్లీ నేతలు అవివేకం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో, బీజేపీ అన్యాయ పాలనకు ఎదురొడ్డి పోరాడటంలో ఆదర్శంగా నిలిచిన బీఆర్ఎస్ విపక్షాల కూటమిలో ఉండాలని వివిధ పార్టీలు బలంగా కోరుకుంటే, తనే అడ్డుపడ్డానంటూ రాహుల్‌గాంధీ మాట్లాడటం, అపరిపక్వతకు, అజ్ఞానానికి నిదర్శనంగా తేటతెల్లమైంది.
వాస్తవానికి కుర్చీ కొట్లాటకే పరిమితమైన కూటమిలో చేరాలని బీఆర్ఎస్ అధినేత కోరుకోనే లేదు. ఫ్రంట్లు టెంట్లు అవసరం లేదని, రైతు రాజ్యం కోసం నిఖార్సయిన దేశ ప్రేమికుల జెండాగా నిలబడాలనేదే కేసీఆర్ ఆశయం. వారి అడుగులు ఆ దిశగానే పడుతున్నాయి. అయినా సరే నిజానికి బీజేపీని దించి, వెంటనే గద్దెనెక్కాలని ఆశపడుతున్న రాహుల్‌గాంధీ ఇలా ప్రసంగించవచ్చునా? బీజేపీ వ్యతిరేక పార్టీలతో పాటు, తటస్థంగా ఉన్నవాటిని కూడా ఐక్యం చేయాల్సిన చారిత్రక బాధ్యతను గుర్తించలేని రాహుల్, ఈ దేశాన్ని పాలించే సామర్థ్యం ఉందని ఎలా భావిస్తున్నాడో అర్థం కావడం లేదు. పగటి కలలతో హస్తం నాయకులు ఇలా సిగపట్లు పడుతుంటే, ‘మేము కూడా కుటిల కొట్లాటల్లో’ ఆరితేరిన నేర్పరులమేనంటూ కమలం పార్టీ పడరాని పాట్లు పడుతున్నది.
ఇటీవల బీజేపీలో చేరిన ఈటలకు ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టి, బండిని బంతిలా విసిరికొట్టి, కుర్చీలో కిషన్ రెడ్డిని కూర్చోబెట్టడం పెద్ద ఎత్తుగడనా? చేరికల కమిటీ చైర్మన్‌గా ఉంటూనే బయటకెళ్లి పోతానని బెదిరిస్తే, ఎన్నికల కమిటీ మీద ఎత్తి కూర్చోబెట్టడంతోనే కాషాయ పార్టీ ఎంత అభద్రతలో బందీగా మారిందో అర్థమవుతున్నది.
సుస్థిరాభివృద్ధి, సంక్షేమం, శాంతి వర్ధిల్లుతున్న రాష్ట్రంలో, రెండు పార్టీల రోదన హాస్యాస్పదం. కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే.. ఆలోచనల్లో, ఆచరణలో అంతలా సంఘర్షించే సామర్థ్యం ఉండాలి. అది సాధ్యపడేదేనా? ఎండమావుల వెంట ఎంత పరుగులు పెట్టినా, ప్రయాస తప్ప ఫలితాలు రావనే సత్యాన్ని కాంగ్రెస్, బీజేపీలు గుర్తించాలి. వాస్తవానికి రాష్ర్టాలకు, దేశానికీ… దేనికీ అక్కరకురాని బీజేపీ, కాంగ్రెస్‌లు రెంటికీ… కాదు కాదు, అన్నింటికీ చెడ్డవే.
(వ్యాసకర్త: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్)
-డాక్టర్ ఆంజనేయ గౌడ్ 98853 52242