సిడ్నీ: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తర్వాత భారత మహిళల జట్టు ఆడిన తొలి మ్యాచ్‌లోనే సత్తాచాటింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. కంగారూలతో సిడ్నీలో వర్షం అంతరాయం కల్గించిన తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థిని 21 పరుగుల (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) తేడాతో ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి (4/22) కెరీర్ బెస్ట్ ప్రదర్శనకు తోడు రేణుకా సింగ్ ఠాకూర్ (2/14) పవర్ ప్లేలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 18 ఓవర్లలో 133 పరుగులకే కుప్పకూలింది.
జార్జియా వర్హెమ్ (19 బంతుల్లో 30, 4 ఫోర్లు) టాప్ స్కోరర్. తెలుగమ్మాయి శ్రీచరణి (2/14) రెండు వికెట్లు తీసింది. స్వల్ప ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చిన భారత్.. 5 ఓవర్లలోనే 50 రన్స్ దంచేసింది. షెఫాలీ వర్మ (11 బంతుల్లో 21, 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడింది. వర్షం వచ్చే సమయానికి లక్ష్యానికంటే 21 రన్స్ ఎక్కువగా ఉండటంతో భారత్ విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ఓడించడం (టీ20ల్లో) భారత్‌కు ఆరేండ్ల తర్వాత ఇదే ప్రథమం.