ముంబై: టీ20 ప్రపంచకప్‌లో రెండు సార్లు చాంపియన్ వెస్టిండీస్ సూపర్-8 దశకు అర్హత సాధించింది. ఆదివారం ముంబైలోని వాంఖెడే వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి ఈ టోర్నీలో సూపర్-8కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా నిలిచింది. విండీస్ ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 రన్స్ చేసింది. దీపేంద్ర సింగ్ (47 బంతుల్లో 58, 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా మిగిలినవారంతా క్రీజులో నిలవడానికే తంటాలు పడ్డారు.
విండీస్ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ జేసన్ హోల్డర్ (4/27) నాలుగు వికెట్ల ప్రదర్శన చేయగా హోసెన్, ఫోర్డ్, జోసెఫ్, ఛేజ్ చెరో ఒక వికెట్ తీశారు. కరీబియన్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి నేపాల్‌పై ఒత్తిడి పెంచడంతో ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది.
అనంతరం ఛేదనకు వచ్చిన విండీస్.. కెప్టెన్ షై హోప్ (44 బంతుల్లో 61 నాటౌట్, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), షిమ్రన్ హిట్మైర్ (32 బంతుల్లో 46 నాటౌట్ , 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులతో 15.2 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తిచేసింది. గ్రూప్-సీలో భాగంగా లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన వెస్టిండీస్.. 6 పాయింట్లతో సూపర్-8 బెర్తును ఖాయం చేసుకుంది. నేపాల్ మూడింట్లో మూడూ ఓడి రేసు నుంచి నిష్క్రమించింది.