మణిపూర్లో మూడు నెలలుగా పాలన గాడి తప్పింది. శాంతిభద్రతలు దిగజారాయి. కేంద్రంలో, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు మౌనం వహించి నీచరాజకీయాలు చేస్తున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియోలు అసాంఘికశక్తుల అరాచకాలను స్పష్టంగా చూపుతున్నాయి. ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించాల్సిన పోలీసులు, పారామిలటరీ దళాలు చేష్టలుడిగి చోద్యం చూస్తున్నారు.
మణిపూర్లో స్త్రీల మానాలకు, పురుషుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మానవత్వం మంటగలిసింది. పశు ప్రవర్తన హెచ్చు మీరింది. మైనారిటీలకు రక్షణ లేకుండాపోయింది. దురాగతాల వీడియోలు ప్రపంచానికి మణిపూర్ దీనస్థితిని ఎలుగెత్తి చాటుతున్నాయి. బీజేపీ పాలనలో తప్ప గతం లో ఎన్నడూ దేశ ప్రతిష్ఠ ఇంతగా దిగజారిపోలేదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలైన బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారే మణిపూర్లో ఉన్నది. వారి పాలనలో ప్రభుత్వ అనుకూల మూకలు రెచ్చిపోతున్నాయి. రాక్షస ప్రవర్తనతో ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ తెస్తున్నాయి. గత రెండు నెలలుగా హింసాత్మక సంఘటనలు చెలరేగుతూనే ఉన్నాయి. గృహ దహనాలు కొనసాగుతున్నాయి. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు హాహాకారాలు చేస్తున్నారు. స్త్రీలపై అత్యాచారాలు కొనసాగుతున్నాయి. తమను రక్షించమని, తమ ప్రాణాలను కాపాడమని దేవుడిని వేడుకుంటున్న వందలాది మంది క్రైస్తవులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. పోలీసుల కాల్పులలో 86 మందికిపైగా మరణించారు. ప్రార్థనా మందిరాలైన వందలాది చర్చిలను ధ్వంసం చేశారు.
మణిపూర్లో మతం మత్తులో హింస హద్దు లు దాటింది. మరో గుజరాత్ మారణకాండను తలపించేలా మైనారిటీ గిరిజనులపై హింసాకాం డ కొనసాగుతున్నది. అల్లరి మూకలు గిరిజనులను లక్ష్యం గా చేసుకుంటున్నాయి. కర్ర లు, కత్తులు, ఆయుధాలతో దాడులు చేస్తున్నాయి. చేతికి చిక్కిన మహిళల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. ఇద్ద రు మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. వారిని వివస్త్రలను చేసి, వీధులలో బహిరంగా ఊరేగించారు. ఆపై పొలాల్లోకి ఈడ్చుకెళ్లారు. స్త్రీలపై సామూహిక లైంగికదాడులు జరుగుతున్నాయి. కాలేజీలో చదువుతున్న 21 ఏండ్ల అమ్మాయి కూడా బాధితుల్లో ఉన్నది. 19 ఏండ్ల ఆమె సోదరుడిని దారుణంగా కొట్టి హింసించి చివరికి చంపేశారు. రాక్షసుల కంటే హీనంగా ప్రవర్తించారు. మే 4న జరిగిన ఈ అమానుష సంఘటన వీడియో దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
ఒకవైపు అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో మణిపూర్ మూడు నెలలుగా తగలబడుతుంటే, మరోవైపు బాధ్యత లేని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారాలకు, విదేశీ పర్యటనలకు వెళ్లారు. దేశ, విదేశాల్లో బీజేపీ అనుకూల వర్గాలు ఆయనకు జేజేలు పలకడం అమానుషత్వానికి పరాకాష్ఠ. కనీసం బాధితులను ప్రధాని ఓదార్చలేదు. వారికి ధైర్యమైనా ఇవ్వలేదు. శాంతిభద్రతలపై సమీక్ష కూడా చేయలేదు. ప్రాణ భయంతో మణిపూర్ను వదిలి ఇతర ప్రాంతాలకు వలసలుపోతున్న వారికి భరోసానైనా కల్పించలేదు. పోలీసులకు మార్గదర్శకత్వమైనా చేయలేదు. వెలుగులోకి వచ్చిన వీడియోల ఆధారంగా కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఘాటైన హెచ్చరికలు చేసింది. ఇకనైనా మోదీ ప్రభుత్వం కనీ సం స్పందిస్తుందా? ఈ దురాగతాలకు బాధ్యత వహిస్తుందా? లేదా ఎప్పటి మాదిరిగానే దున్నపోతు మీద వర్షం పడినట్లు స్తబ్ధుగా, మౌనంగా ఉండిపోతుందా? వేచిచూడాలి.
మణిపూర్లో జరిగిన, జరుగుతున్న అరాచకత్వంపై మానవతావాదులు, ప్రజాస్వామిక వాదులు స్పందించాలి. అసమర్థ బీజేపీ పాలన ను ఎండగట్టాలి. దేశ, విదేశీ మీడియా కండ్లు తెరువాలి. సోషల్ మీడియా ప్రజాపక్షం వహించి మణిపూర్ దురాగతాలను ఖండించాలి. సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలి. మణిపూర్ సంఘటనలపై ప్రత్యక్ష పర్యవేక్షణలో సత్వర విచారణ జరిపించాలి. కాలయాపన చేయకుండా దోషుల పట్ల కఠినంగా వ్యవహ రించాలి. న్యాయపరమైన శిక్ష విధించాలి.
-డాక్టర్ కోలాహలం రామ్కిశోర్
98493 28496