BJP | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభం అయిన మీడియాను నిర్దాక్షిణ్యంగా నరికింది, నరుకుతున్నది. మీడియా స్వేచ్ఛను హరించివేస్తున్నది. జర్నలిస్టులను తొక్కిపెట్టి అసలైన వార్తలు బయటికి రాకుండా చూస్తున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే అత్యధిక జర్నలిస్టులు హత్యలకు గురికావడం గమనించవలసిన విషయం. ఇది అత్యంత ఖండనీయం.
పద్నాలుగేండ్ల నుంచి జర్నలిస్టులు కోర్టులో తన్లాడుతుంటే, వారి బాధను చూడలేక కేసీఆర్ ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చింది. లేకపోతే బెంచి ముందుకు రావటానికే కొన్నేండ్లు పట్టేది. ఈ తీర్పు రాకముందే మధ్యంతర తీర్పు వచ్చిన సందర్భంలోనే ఈ 70 ఎకరాల్లో 32 ఎకరాలు జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీకి ప్రభుత్వం అప్పగించింది. ఏనుగు లాంటి తీర్పునే బయటపడేసిన కేసీఆర్.. తోక లాంటి 38 ఎకరాలు అప్పగించే పని సులువుగా చేస్తారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం జర్నలిస్టులను, మీడియాను అణచివేస్తూ కార్పొరేట్ల సహాయంతో మీడియా వ్యవస్థను తన కబంధ హస్తాల్లోకి లాక్కున్నది. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియాను పగబట్టి అణచివేస్తున్నది. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలతో దాడులు చేస్తూ మీడియాను భయపెడుతున్నది. మోదీ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లుగా మీడియాను కూకటివేళ్లతో నరికివేసే చర్యలకు పాల్పడ్డది. వందలాది జర్నలిస్టులపై దేశద్రోహం, ఉపా చట్టం కేసులు పెట్టింది. అత్యంత సర్క్యులేషన్ ఉన్న ‘దైనిక్ భాస్కర్’ లాంటి హిందీ పత్రికపై దాడులు, ‘భారత్ సమాచార్’ వంటి న్యూస్ ఛానల్‌పై దాడులు, ‘న్యూస్ క్లిక్ పోర్టల్’పై కేసులు నమోదు చేయించింది. అందులో పనిచేసే జర్నలిస్టులపై దేశద్రోహం కేసులు పెట్టించింది.
మీడియా వన్ మలయాళంకు చెందిన న్యూస్ ఛానల్ ప్రసారాలకు అనుమతి ఇవ్వకపోవడం లాంటి చర్యలు మోదీ హయాంలోనే జరిగాయి. ఆ తర్వాత ఆ ఛానల్ యాజమాన్యం కోర్టుకుపోవడంతో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. వెంటనే ఆ మీడియా వన్ మలయాళం ఛానల్‌కు అనుమతులు ఇవ్వాలని ఆదేశించింది. ఇదంతా గత నెలలోనే జరిగింది. ఇలా సుప్రీంకో ర్టు జోక్యంతోనే మీడియాకు స్వేచ్ఛ, అనుమతులు లభించే పరిస్థితి ఒక్క మన దేశంలోనే ఉన్నది.
పెగాసస్ స్పై పేరుతో 40 మంది జర్నలిస్టులపై కేంద్రం పెట్టిన నిఘా కూడా బయటపడింది. ఇండియన్ ప్రెస్ ఫ్రీడమ్-2020 ప్రకారం.. ఢిల్లీ మేధావులకు చెందిన రైట్ అండ్ రిసక్స్ ఎనాలసిస్ గ్రూప్ (ఆర్ఆర్జీ) 2020లో 226 మంది జర్నలిస్టులను, కొన్ని మీడియా సంస్థలను ప్రభు త్వ, ఇతర సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో 13 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. 37 మందిని నిర్బంధంలో ఉంచారు. 64 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరో 13 మంది జర్నలిస్టులకు షోకాజ్ నోటీసులిచ్చారు. 101 మంది జర్నలిస్టులపై భౌతికదాడు లు జరిగాయి. జర్నలిస్టుల కుటుంబసభ్యులపై దాడులు, వారి ఇండ్ల మీద దాడులు చేసినట్టు ఈ గణాంకాలు చెప్తున్నాయి. పీటీఐ లాంటి న్యూస్ ఏజెన్సీ సంస్థకు రూ.84 కోట్ల జరిమానా విధించాలని కేంద్రం నోటీసులు కూడా జారీ చేసింది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారతదేశం 2020లో 180 దేశాలలో 142వ స్థానంలో ఉంటే ప్రస్తుతం 2023లో అది 161వ స్థానానికి దిగజారింది. ఇదీ మన భారతదేశంలో మీడియాకు దక్కిన గౌరవం. ఏ రకంగా ప్రజాస్వామ్యానికి నాలుగవ స్థంభమైన మీడియాను నరుకుతున్నారో కేంద్ర ప్రభుత్వ వైఖరిని చూస్తేనే అర్థమవుతుంది.
తెలంగాణలోని జర్నలిస్టుల గౌరవంపై బీజేపీ నాయకుడు సన్నాయి నొక్కులు నొక్కుతూ.. రెచ్చగొట్టేవిధంగా రాసే రాతలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగానే ఉన్నది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నది. కరోనా సమయంలో కొవిడ్ బారిన పడిన జర్నలిస్టులకు రూ.20 వేల నగదు సాయాన్ని అందజేసింది. అలాగే క్వారంటైన్లో ఉన్న జర్నలిస్టులకు రూ.10 వేల సహాయాన్ని అందించింది. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసి, ఆ నిధితో వచ్చే వడ్డీతో జర్నలిస్టుల సంక్షేమానికి పింఛన్ల రూపంలో, ఫీజుల రూపంలో జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణలోనే ఉన్నది.
చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల సహాయం చేసింది తెలంగాణ ప్రభుత్వమే. బీజేపీ పాలిత రాష్ర్టాలలో ఇలాంటి సంక్షేమం లేదు. అక్రెడిటేషన్ కార్డుల సంఖ్య పెంచింది కూడా తెలంగాణ సర్కారే. ఉమ్మడి ఏపీ కంటే ఇప్పుడు తెలంగాణలో అక్రెడిటేషన్ కార్డుల సంఖ్య ఎక్కువ. కేసీఆర్ సర్కార్ ఈ రెండు, మూడేండ్లలోనే జర్నలిస్టుల సంక్షేమానికి ఆరేడు కోట్లు ఖర్చు చేసింది. మోదీ సర్కార్ జర్నలిస్టుల రైల్వే పాసులను తీసివేసింది. కేంద్రంలో జర్నలిస్టుల
సంక్షేమం లేనే లేదు.
జర్నలిస్టులు శ్రమశక్తి, మేధోశక్తిని ఎవరికోసం ఉపయోగిస్తున్నారు? మీడియా యజమానుల కోసం నైట్ డ్యూటీలు, రోడ్ల మీద పడిగాపులు, కంప్యూటర్ల మీద కూర్చొని జర్నలిస్టులు శ్రమ శక్తిని జీవితాంతం ధారపోస్తున్నారు. కానీ, యజమానులు జర్నలిస్టుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. అందుకే జర్నలిస్టులు ప్రభుత్వంపై ఆధారపడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలనిస్తున్నది. నియోజకవర్గ, మండల స్థాయిలో ఇస్తున్నది. జిల్లాస్థాయిలో ఇచ్చారు. కొన్నిచోట్ల ఇవ్వాల్సి ఉన్నది. హైదరాబాద్‌లో గతంలో ఇచ్చిన ప్రభుత్వాలు కూడా జర్నలిస్టులకు ఒక ప్రివిలేజ్‌గా ఒక గౌరవభావంతో ఇచ్చా యి. సమాజానికి జర్నలిస్టు లు చేస్తున్న సేవలో భాగం గా ఒక ప్రివిలేజ్లో ఈ సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తున్న ది. ఇంటి స్థలాల విషయం లో కూడా ప్రభుత్వం ఒక ప్రివిలేజ్గానే జర్నలిస్టులకు ఆనవాయితీగా హైదరాబాద్ లో స్థలాలు కేటాయిస్తూ వస్తున్నది.
హైదరాబాద్ జర్నలిస్టులకు ప్రస్తుతం జర్నలిస్టు సొసైటీకి 70 ఎకరాల స్థలం సుప్రీంకోర్టు తీర్పు రావడానికి కారణం ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చొరవే. కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇవ్వకపోతే ఈ తీర్పు వచ్చేది కాదు. ఈ తీర్పు రాకముందే మధ్యంతర తీర్పు వచ్చిన సందర్భంలోనే ఈ 70 ఎకరాల్లో 32 ఎకరాలు జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీకి ప్రభుత్వం అప్పగించింది. బంతి భోజనాలంటే తెలియదు, ఎన్నడూ బంతి భోజనాలు పెట్టే సంప్రదాయం, సంస్కృతి తెలియని బీజేపీ నాయకుడు జర్నలిస్టుల స్థలాల విషయంపై వెటకారంగా బంతి భోజనాలతో పోల్చటం శోచనీయం. నోటికాడి బుక్కను కొట్టే రకం ఈ బీజేపీ నాయకుడు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇంత కృషిచేసిన ఇప్పటి ప్రభుత్వం మిగతా 38 ఎకరాలు కూడా సొసైటీకి అప్పగిస్తుందని నమ్మకం ఉన్నది. తెలంగాణ జర్నలిస్టులు రెచ్చగొడితే రెచ్చిపోయేవారు కాదు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం జర్నలిస్టుల స్థలాల సమస్యను కూడా పరిష్కరిస్తుందనే ప్రగాఢ విశ్వాసం ఉన్నది.
బీజేపీ నాయకుడు వాస్తవ విరుద్ధంగా రాతలు రాస్తూ జర్నలిస్టులను రెచ్చగొట్టే పని మొదలుపెట్టారు. మొత్తం మీడియానే కబ్జా చేసిన బీజేపీ, నీతి సూత్రాలు వల్లిస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగానే ఉన్నది. ఇక్కడ జర్నలిస్టులపై రాజద్రోహం కేసుల్లేవు. మోదీని విమర్శించినందుకే 149 మందిపై రాజద్రోహం కేసులు పెట్టారు. యూపీ ముఖ్యమంత్రి యోగిని విమర్శించిన మరో 144 మందిపై రాజద్రోహం కేసులు పెట్టారు. ఇందులో జర్నలిస్టుల శాతమే ఎక్కువ. దేశంలోని మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇలాంటి పాలన కొనసాగిస్తున్నది. బీజేపీ నాయకుడు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకుంటే మంచిది.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
-నర్రా విజయ్‌కుమార్
90521 16316