చేసిన పనిలో తప్పులు వెతకడం తేలిక. అందుకే ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల్లో తప్పులు వెతుకుతున్నాయి. తెలంగాణలో ప్రతిపక్షాలుగా చెప్పుకొంటున్న కాంగ్రెస్, బీజేపీలు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్క్ పథకాలు, తెలంగాణ ప్రగతిపై ఇష్టారీతిన మాట్లాడుతుండటం సిగ్గుచేటు. రాజకీయం కోసం పచ్చి అబద్ధాలాడుతున్నారని ప్రజలకు అర్థమవుతున్నది.
టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి 24 గంటల ఉచిత విద్యుత్తుపై అనుచిత వ్యాఖ్యలు చేసి నాలుక కరుచుకున్నాడు. తెలంగాణ రైతాంగం స్పందన చూసి జంకిన సదరు నేత, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంటు ఇస్తామన్నాడు. అమెరికాలో రేవంత్ చేసి న ఈ వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలు సైతం ఖండించారు.
రాష్ట్ర బీజేపీ నాయకులది మరో కథ. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి కొత్తగా బాధ్యతలు చేపట్టారు. ఆయన డబుల్ బెడ్రూం ఇండ్లపై రేవంత్ తరహాలోనే ఏదో అనబోయి.. ఇంకేదో అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇస్తలేదని, మోదీ ప్రభుత్వం దేశమంతా ఇండ్లు నిర్మించి ఇస్తున్నదని చెప్పుకొచ్చారు. ఏపీలో జగన్ సర్కారు ఏకంగా నాలుగేండ్లలోనే 20 లక్షల ఇండ్లు కట్టిందని రాసిచ్చింది కాకుండా, తోచింది మాట్లాడి తప్పులో కాలేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే తెలంగాణలో 50 లక్షల ఇండ్లు కట్టాలని సవాల్ విసిరారు. 50 లక్షల ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం వాటా తెచ్చే బాధ్యత తనదేనని కూడా సెలవిచ్చారు. అయితే, కిషన్‌రెడ్డి మాటల్లో నిజమెంతనో పరిశీలించాల్సిన అవసరం ఉన్నది.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇండ్లు ఇచ్చేందుకు ఇందిరమ్మ పథకం అమలుచేశారు. ఈ పథకంలో అంతులేని అవినీతి జరిగింది. లబ్ధిదారుల పేర్లతో నాయకులే బిల్లులు కాజేశారు. ఎక్కడైనా ఒకరిద్దరికి ఇండ్లు వచ్చినా.. ఇంటి నిర్మాణం కోసం కాంగ్రెస్ సర్కారు ఇచ్చింది రూ.70 వేలు మాత్రమే. ఎస్సీ, ఎస్టీలకు లక్షా ఐదు వేలు, ఇతరులకు గ్రామీణ ప్రాంతాల్లో రూ.70 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.80 వేలు ఇచ్చారు. ప్రభుత్వం పేదోడికి ఇల్లు కట్టిస్తే.. వారి కుటుంబానికి సరిపోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. అందులో భాగంగానే ఆయన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో రూ.8,65,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.5,04,000 ఖర్చు చేస్తూ పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తున్నది. ఇందిరమ్మ ఇండ్లతో పోలిస్తే కేసీఆర్ ఇచ్చే ఒక డబుల్ బెడ్రూం ఇల్లు ఇరువై ఇందిరమ్మ ఇండ్లతో సమానం.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.11,853 కోట్లు ఖర్చుచేసి 1,92,725 ఇండ్లు నిర్మించింది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లో నిర్మించే 1,59,372 ఇండ్లకు, ఇంటికి 1,50,000 చొప్పున రూ.2,390 కోట్ల ఆర్థికసాయం చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు కేవలం రూ.1,201 కోట్లు మాత్రమే విడుదల చేసింది. 50 లక్షల ఇండ్లకు కేంద్ర వాటా తెస్తానని బీరాలు పలుకుతున్న కిషన్‌రెడ్డి ముందు కేంద్రం ఇస్తానని బకాయిపడ్డ డబ్బులు తీసుకువస్తే బాగుంటుంది. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ అని పెద్ద పేరు పెట్టుకున్న కేంద్రం.. పేదల ఇండ్లకు తెలంగాణ సర్కారు చేస్తున్న ఖర్చులో 10 శాతం మాత్రమే డబ్బులు ఖర్చుచేసింది.
గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇండ్లకు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఒక్కో ఇంటికి కేంద్రం రూ.72 వేలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక ఏపీలో అక్కడి ప్రభుత్వం 20 లక్షల ఇండ్లు కట్టిందని కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం నిజం లేదు.
ఏపీ హౌజింగ్ సొసైటీ అధికారుల లెక్కల ప్రకారం… 2023 నాటికి 15 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తికావాల్సి ఉండగా, ప్రస్తుతానికి అందులో సగం మాత్రమే పునాది దశ దాటా యి. మరి 20 లక్షల ఇండ్లు ఏపీ సర్కార్ ఎక్కడ కట్టిందో, కిషన్ రెడ్డి ఎక్కడ చూశారో చెప్పాలి.
దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాలను విజయవంతంగా అమలుచేస్తున్నది. అవినీతికి ఆస్కారం లేకుండా, అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నది. రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రతిపక్ష నేతలు గుడ్డు మీద ఈకలు పీకుతున్నారు. రైతుబంధు భూస్వాములకు పోతున్నదని ఒకరంటారు. తెలంగాణలో 95 శాతం మంది రైతులు చిన్న, సన్నకారు రైతులే అని చెప్తే వారికి అర్థం కాదు. ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేస్తామని మరొకరు అంటారు. ధరణి రాకముందు భూ, రెవెన్యూ సమస్యలు ఎలా ఉండే.. ఇప్పుడెలా ఉన్నాయనేది వాళ్ల కంటికి కనిపించదు. ఒక అబద్ధాన్ని, అసత్యాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసే కుట్రలు ఈ రెండు జాతీయ పార్టీల నాయకులు చేస్తున్నారనేది వాస్తవం.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయినా.. అభివృద్ధికి దూరంగా వెలివాడల్లో ఉన్న దళితుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో తీసుకువచ్చిన ‘దళిత బంధు’ పథకంలోనూ తప్పులు వెతకడం సిగ్గుచేటు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఓ వ్యక్తి అంటాడు. ప్రాజెక్టుకు అయిన ఖర్చే లక్ష కోట్లు దాటలేదు. మరి లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందంటే పెదవి విప్పరు. ప్రగతిభవన్‌ను కూల్చివేస్తాం, సచివాలయం గుమ్మటాలను కూలగొడతామంటూ చిల్లర మాటలు మాట్లాడటం తప్పితే.. ‘ఈ సర్కారు, పలానా పని చేయలేదు, మేము అధికారంలోకి వస్తే ఆ పని చేసిచూపిస్తాం’ అని స్పష్టంగా ఒక్క హామీ ఇచ్చిన దాఖలాల్లేవు. అలాంటప్పుడు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటల్ని ఎలా నమ్ముతారు? ఎవరేమనుకున్నా… పదేండ్ల తెలంగాణను ప్రగతిపథంలో తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు. ఇది అక్షరాలా సత్యం.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జి)
-మన్నె గోవర్దన్ రెడ్డి
98660 87878