న్యూఢిల్లీ, జూలై 22 : బంగారం ధరలు మళ్లీ రెక్కలు తొడుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా డిమాండ్ నెలకొనడం, దేశీయంగా కొనుగోళ్లు పెరుగడంతో బంగారం విలువ రూ.1.50 లక్షలకు చేరువైంది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,900 ఎగబాకి రెండు వారాల గరిష్ఠ స్థాయి రూ.1,49,600కి చేరుకున్నట్టు ట్రేడర్లు తెలిపారు. అంతకుముందు రూ.1, 47,700గా ఉన్నది. ఈ నెల 7న గోల్డ్ ధర రూ.1,49, 250 తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి.
గత ఆరు రోజులుగా తగ్గుతూ వచ్చిన కిలో వెండి ఏకంగా రూ.8,500 ఎగబాకి రూ.2.30 లక్షలకు చేరుకున్నది. గత సెషన్లో వెండి రూ.2,21,500గా ఉన్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో వెండి భారీగా పుంజుకున్నదని ట్రేడర్లు వెల్లడించారు. రూపాయి పతనం కావడం కూడా పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ మెరుగుపడిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 47.43 డాలర్లు లేదా 1.16 శాతం ఎగబాకి 4,125.24 డాలర్లకు చేరుకోగా, వెండి 59.42 డాలర్లు పలికింది. వచ్చే సమీక్షలో వడ్డీరేట్లను పెంచే అవకాశాలను పరిశీలించనున్నట్టు అమెరికా ఫెడరల్ రిజర్వు ప్రకటించడంతో మదుపర్లలో ఉత్సాహాన్ని నింపింది.