తిప్పర్తి, జూలై 22 : కరెంట్ ఇష్టానుసారంగా కట్ చేస్తుండటంతో పొలాలు తడవక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటంతో మండలంలోని ఇండ్లూరు గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం ఇండ్లూరు సబ్ స్టేషన్ ఎదుట తిప్పర్తి- నకిరేకల్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కరెంట్ కోతలతో వరి నార్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ ఇంత అధ్వాన పరిస్థితి లేదన్నారు. సమయపాలన లేకుండా ఇష్టానుసారంగా కరెంట్ కట్ చేస్తుండటంతో పొలాలు తడవక నారు మడులు ఎండి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కరెంట్ ఏ సమయంలో ఇస్తారో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. రాత్రి సమయాల్లో అసలు కరెంటే ఉండటంలేదన్నారు. దీంతో తడిసిన పొలాలు కాస్తా ఆరిపోతున్నాయన్నారు.
కరెంట్ ఎప్పుడు వస్తుందని సిబ్బందిని అడిగితే పైనుంచే రావడం లేదని, పై అధికారులకు ఫొన్ చేసుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, పై అధికారుకు ఫోన్ చేస్తే ఎత్తడం లేదని వాపోయారు. వెంటనే మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసుకొని కరెంట్ కోతల్లేకుండా చూడాలన్నారు. ఈ విషయమై ఏఈని వివరణ కోరగా తాము రోజుకు మొత్తంగా 17 గంటల పాటు ఇస్తున్నామని రైతులకు ఏమైనా సమస్యలు ఉంటేనే మధ్యలో తీస్తున్నామన్నారు. పై నుంచి ఎలా వచ్చిందో అలాగే కరెంటు సరఫరా చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆవుల అంజయ్య, మార్త సోములు, జక్కలి మంగయ్య, వార్డు మెంబర్లు ఎలియ, మామిడి సైదులు, రైతులు కుమ్మరి వెంకన్న, పేరం జోగేందర్, కుమ్మరి జానకీరాములు, ఆవుల చంద్రయ్య, జెర్రిపోతుల సైదులు, శ్రీను, తుమ్మల లక్ష్మయ్య, నర్సింహ్మ, యాదయ్య తదితరులు ఉన్నారు.
గతంలో కరెంట్ మంచిగా వచ్చేది. ఈ యేడు మృగశిర కార్తె నుంచి ఇప్పటి వరకు సరిగా కరెంట్ రావడం లేదు. నాకు నాలుగెకరాల భూమి ఉంది. ఇప్పటి వరకు రెండెకరాలు మాత్రమే తడిసింది. అదికూడా కరెంట్ సరిగా రాక ఆరిపోతున్నది. అసలే కరువు వచ్చింది. దీనికి తోడు కరెంట్ సరిగా రావడం లేదు. ఎందుకు రావడం లేదని కరెంట్ సిబ్బందిని అడిగితే పై అధికారులను అడగమంటుండ్రు. మాకు సదువు సరిగా రాదు.. ఎలా పై అధికారులను అడగాలి. ఇప్పటికైనా అందరూ కలిసి కరెంట్ మంచిగా వచ్చేట్లు చూడాలి.
నాకు నాలుగెకరాల పోలం ఉంది. ఈ సారి కరెంట్ సరిగా రావడం లేదు. రాత్రి సమయాల్లో మూడు ఫేజ్‌ల్లో కరెంటు ఉండటం లేదు. ఉదయం ఇచ్చినట్లే ఇస్తుండ్రు.. కానీ ఊకనే పోతున్నది. తడిసిన పొలంలో నాట్లు వేద్దామని కూలోళ్లను తీసుకుని బావి దగ్గరకు పోతే కరెంట్ ఉండటం లేదు. మడుల్లో నీళ్లు లేవని వచ్చిన కూలోళ్లు పోతుండ్రు. సబ్ స్టేషన్ వద్ద ఎందుకు కరెంట్ రావడం లేదని అడిగితే పై అధికారులకు ఫోన్ చేయమంటుండ్రు. పై అధికారులకు చేస్తే ఫోన్లు ఎత్తడం లేదు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి.