రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో రచ్చబండ కాడ చర్చ జరగాలి. కాంగ్రెస్ పాలనపై, ఎన్నికల ముందు ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ఇప్పుడు చర్చ జరగాల్సిందే. ఒకసారి మోసపోయిన ప్రజలు మరోసారి మోసపోవద్దంటే మన ఇండ్లల్లో, మనమే చర్చించుకోవాలి. రైతుబంధు రెండుసార్లు ఎగ్గొట్టినందుకు, ఒక్క యూరియా బస్తా కోసం రైతు బాధపడుతున్నందుకు, కల్యాణలక్ష్మి చెక్కుల జాడ లేనందుకు, అయ్య, అవ్వ పింఛన్లు రూ.4 వేలకు పెంచనందుకు, నిరుద్యోగులకు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వనందుకు రచ్చబండ కాడ బరాబర్ చర్చ జరగాల్సిందే. ప్రజలకు బాకీపడ్డ హామీలపై చర్చ జరగాల్సిందే. నలుగురు గుమిగూడిన కాడ, ఎక్కడపడితే అక్కడ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు బాకీపడ్డ కాంగ్రెస్ హామీలపై చర్చ జరగాల్సిందే. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టాల్సిందే.
వట్టి మాటలు అప్పుడు, మూటల్లేవనే ఉత్త మాటలు ఇప్పుడు. అధికారం కోసం అలవిగాని హామీలు ఇవ్వడం, ప్రజలను మభ్యపెట్టడం, చివరికి చేతులెత్తేయడం కాంగ్రెస్ పార్టీ నైజంగా మారింది. తెలంగాణ అవసరాలు ఏమిటి? ఆర్థిక పరిస్థితులు ఏమిటి? అన్న విషయాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా హామీలిచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాటిని అమలు చేయాల్సిన సమయం వచ్చేసరికి నిధులు లేవని, ఖజానా ఖాళీ అయిందని అంటే సరిపోతుందా? హామీలు ఇచ్చేముందు అప్పటివరకున్న పథకాల అమలును పరిశీలించాలి. అంతకన్నా మెరుగ్గా ఇవ్వగలమో, లేదో ఆలోచించాలి. వాటిని కొనసాగించాలా, ఆపేయాలా అన్నది బేరీజు వేసుకోవాలి. అప్పుడే కొత్త పథకాలపై ప్రకటనలు ఇవ్వాలి. కొత్తవి అమలు చేస్తామంటే ఉన్నవి కొనసాగించి, నూతనమైనవి ఇస్తారని ప్రజలు సహజంగా అనుకుంటారు. నిజానికి చేయాల్సిన విధానం కూడా అదే.
కానీ, కేసీఆర్ సర్కార్ అమలుచేసిన పథకాలనే అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం చతికిల పడుతున్నది. అందుకే ఎక్కడచూసినా ‘ఇంతకుముందే బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే’ అన్న మాటలు ప్రజల్లో వినపడుతున్నాయి.
బీఆర్ఎస్ పార్టీది ఎప్పుడూ ప్రజల పక్షమే. అధికారపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడాన్నే కర్తవ్యంగా పెట్టుకుంటది. అందుకే, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు అమల్లోకి వచ్చాయో ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడుతూ, వారికి వాస్తవాలను తెలియజేస్తున్నది. అందులో భాగంగానే ప్రస్తుతం ‘బాకీ కార్డు’ ఉద్యమాన్ని చేపట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీలను గ్యారెంటీలుగా ప్రకటించింది. బాండ్ పేపర్లపై రాసిచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నాడు వాటిపై సంతకాలు చేశారు. కొన్నింటిపై స్వయంగా రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీలు కూడా సంతకాలు పెట్టారు. ఇంటింటికీ కార్డుల రూపంలో పంపిణీ చేశారు. అధికారం చేపట్టిన మొదటి వంద రోజుల్లోనే వీటిని అమలు చేస్తామని ఘనంగా ప్రకటించారు.
మొదటి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. వీటిని ఎగ్గొట్టడానికి అవకాశం లేనివిధంగా ఏకంగా చట్టమే తీసుకొస్తామన్నారు. ఇలా ఎన్నో చెప్పారు. కానీ, అన్నీ ఉత్తవే అయ్యాయి. ప్రధానంగా ఆరు గ్యారెంటీల అమలుపై విస్తృతంగా ప్రచారం చేశారు. కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామన్నారు. ప్రస్తుతం తులం బంగారం రూ.1.25 లక్షలకు చేరింది. రోజురోజుకు పరుగులు పెడుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో తులం బంగారం ఎలా ఇస్తారనే విషయమై ఇప్పటికీ కార్యాచరణ లేనే లేదు. అయినా, తెలంగాణ సమాజం కూర్చొని తినాలనుకోదు. తాము పడే కష్టానికి కొంతలో కొంతైనా ప్రభుత్వం చేయూతనందించాలన్నదే ప్రజల కోరిక. అందుకు తగ్గట్టుగానే హామీలు, పథకాలు ఉండాలి. అలా చేయాలంటే ప్రజలతో మమేకం కావాలి. కేసీఆర్ ప్రభుత్వం అలా చేసి చూపించింది.
తెలంగాణ ఉద్యమ ఫలితంగా రూపొందించిన ‘రైతుబంధు’ పథకాన్ని ఇప్పుడు కొనసాగించడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదు. ‘రైతుభరోసా’ పేరిట రైతులకు కాంగ్రెస్ పార్టీ రూ.15 వేలు ఇస్తామన్నది. ఈ పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేస్తామని ప్రగల్భాలు పలికింది. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కౌలు రైతులను విస్మరించడమే కాదు, ఈ పథకాన్నే నీరుగార్చింది. ఒక్క సీజన్ రైతుబంధును ఎగ్గొట్టడమే కాకుండా ఇస్తామన్న రూ.15 వేలు ఇవ్వకుండా రూ.12 వేలు వేసి మమ అనిపించింది. అలా చేయడం వల్ల రాష్ట్ర రైతాంగం ఎంతో నష్టపోయింది. ఇలాంటి విషయాలనే బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డులో ప్రస్తావించింది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అటకెక్కించింది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీలు జాబ్ క్యాలెండర్లు, ఉద్యోగాల భర్తీ. విద్యార్థులకు భరోసా కార్డు, మహాలక్ష్మీ పథకం. ఇలా చెప్పుకుంటూపోతే అమలుచేయని హామీల జాబితా చాంతాడంత అవుతుంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు రెండేండ్లు గడుస్తున్నా రైతులు, విద్యార్థుల సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించలేదు. రోజువారీ సమస్యలతో ముడిపడిన సంక్షేమ పథకాల పరిస్థితే ఇలా ఉంటే సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనుల మాటేమిటో?
ఆరు గ్యారెంటీల పేరిట 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్ నాయకులు డిక్లరేషన్ల మీద డిక్లరేషన్లు ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు వాటిలో ఏ ఒక్క డిక్లరేషన్‌ను కూడా అమలు చేయలేదు. అది యూత్ డిక్లరేషన్ కావచ్చు, నిరుద్యోగ డిక్లరేషన్ కావచ్చు, బీసీ డిక్లరేషన్ కావచ్చు, మైనారిటీ డిక్లరేషన్ కావచ్చు. తెలంగాణ సమాజం కాంగ్రెస్ మోసాలను నిశితంగా పరిశీలిస్తున్నది. ప్రజలు బాకీ కార్డు ఉద్యమంతో కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బజారుకీడుస్తారు. తెలంగాణ సమాజానికి బాకీ పడ్డ బాకీని తీర్చకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయం.
– (వ్యాసకర్త: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)
గోసుల శ్రీనివాస్ యాదవ్