ఈ నెల 27న భారత రాష్ట్ర సమితి భారీ బహిరంగ సభ జరుపుకోబోతున్న నిర్ణయం వెలువడిన నాటినుంచి కనులు మూసినా, తెరిచినా అదే విషయం కార్యకర్తల మనసులో తారట్లాడుతున్నది. మళ్లీ ఉద్యమం నాటి ఉద్వేగం పెల్లుబుకుతున్నది. నాలో దాదాపు రెండు నెలల కింద కేసీఆర్ తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశం అందించిన స్ఫూర్తి ఇంకా రగులుతూనే ఉన్నది.
ప్రజాస్వామ్యంలో బడ్జెట్ ఉంటుంది, అప్పులు, ఆస్తులు అన్నీ పారదర్శకంగా ఉంటాయి. అధికారంలో ఉన్నా లేకున్నా కేసీఆర్కు తెలంగాణ ఆర్థిక పరిస్థితి మీద అవగాహన సంపూర్ణంగా ఉన్నది. మొదటిసారి గెలిచినప్పుడు కూడా ఆంధ్ర పాలకులమీద తప్పు వేసి, తప్పించుకోవాలనుకోలేదు. ఉన్న వనరులతో నడిపారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారు. ప్రజలకు బతుకు మీద నమ్మకం కలిగించారు. బయటి ప్రపంచంలో తెలంగాణ ప్రతిష్ఠను ఆకాశానికి ఎత్తారు. ఆయనకు కాంగ్రెస్ నాయకులకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది.
ఫిబ్రవరి 19న కేసీఆర్ తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన సమావేశానికి వెళ్లే అవకాశం లభించడం నా అదృష్టం. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో కార్యకర్తలు దిగ్భ్రాంతి చెందారు. కాంగ్రెస్, మీడియా దుష్ప్రచారం మొదలుకొని ప్రతికూల ఫలితాలకు అనేక కారణాలు తోడ్పడ్డాయి. కానీ, అది అనూహ్యమైనది. నాక్కూడా ఇప్పటికీ జీర్ణించుకోలేని విషయమది. కేసీఆర్ను కలుసుకోవాలని పదే పదే గుండె తన్లాడేది. తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన సమావేశంతో ఆ కోరిక నెరవేరడమే కాదు, నాకు మరోసారి ‘దట్ ఈజ్ కేసీఆర్’ అనిపించింది.
నాయకుడనేవాడు ఎలా ఉండాలనేది తెలుసుకోవాలనుకుంటే, కేసీఆర్ను చూడాలి. అదే కేసీఆర్, అదే ధీమా, అదే చిత్తశుద్ధి, తెలంగాణ పట్ల అదే ఆర్తి. తాను చెప్పడం కాదు, వచ్చినవారు ఏం చెప్తారో వినడం కేసీఆర్కు అలవాటు అనేది ఉద్యమకాలం నుంచి గమనిస్తున్నాను.
ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర పెద్ద నాయకులు ఎవరూ మాట్లాడలేదు. జిల్లా, మండలస్థాయి నాయకులకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. దాదాపు 5 గంటల పాటు కార్యకర్తల మాటలను ఓపికగా విన్నారు. కొందరు కాంగ్రెస్ను విమర్శించబోతే వారించారు. కార్యకర్తలు చెప్పేవన్నీ ఓపికగా వింటూ ఆ అంశాలను రాసుకున్నారు. ఆలోచనలను రాసుకోవడంలో, అమలుచేయడంలో కేసీఆర్ ఎంతో పద్ధతి, క్రమశిక్షణ పాటిస్తారనేది తెలిసిందే. ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.
సమావేశానికి ముందు కేసీఆర్ మాట్లాడారు. బయట ప్రచారమైనట్టు కేసీఆర్ కాంగ్రెస్ను కానీ, మరే పార్టీని కానీ ఒక్క మాట కూడా అనలేదు. దాదాపు గంట సేపు సాగిన ఆయన ప్రసంగంలో పరోక్షంగా కూడా ఇతర పార్టీలను ప్రస్తావించలేదు. తాము తెలంగాణ కోసం 15 ఏండ్లు పోరాడామని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ పోరాటాన్ని చాలామంది టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి లెక్కకడతారు. కానీ, కేసీఆర్ తాను మేధావులతో చర్చలు జరిపినకాలం నుంచి లెక్కిస్తారు. అందుకే పదిహేనేండ్లు పోరాటం చేశామన్నారు. ఎన్నికల ప్రతికూల ఫలితాల నేపథ్యంలో కేసీఆర్ స్వల్పంగానైనా కుంగుబాటు కనిపించలేదు. మానసికం గా, శారీరకంగా బలహీనంగా కనిపించలేదు.
మనం తెలంగాణ కోసం ఏం చేయాలనేదే కేసీఆర్ ప్రసంగంలో ప్రధానాంశం. ఉద్యమకాలంలోనూ కేసీఆర్ తెలంగాణ ఏర్పాటు ఖాయమని బలంగా నమ్మేవారు, చెప్పేవారు. తెలంగాణ వనరులేమిటి, అవసరాలేమిటి, ఏ విధంగా వృద్ధి చెందాలనేది ఆలోచించేవారు. తెలంగాణ ఏర్పడినంక తొలి ఎన్నికల సందర్భంగా కూడా అదే ఆలోచన. పోలింగ్ ముగిసిన రోజే సాయంత్రం విద్యుత్తు రంగ నిపుణులతో సమావేశమయ్యారు. ఇంకా ఫలితాలు రానేలేదు. అయినా, మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏయే రంగానికి సంబంధించి ఏమేమి చేయాలనే కార్యక్రమాలు మొదలుపెట్టారు. అప్పటివరకు ఆంధ్రా పాలన సాగినా రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై ఆయనకు పూర్తి అంచనా ఉన్నది. అదే విధంగా ఈ సమావేశంలో కూడా ఈ సారి తాము అధికారానికి రావడం ఖాయమనే ధీమా ఆయనలో వ్యక్తమైంది. తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేయాలనే విషయమై ఆయన కసరత్తు చేస్తున్నారు. మళ్లీ దాపురించిన ఈ పరాయి పాలనలో తెలంగాణ ఆగమాగమవుతుందని ఆయనకు తెలుసు. అయినా, ఆ విషయం చెప్పకుండా తాము ఏమి చేయాలనేదే ఆయన ఆలోచించడం నాకే కాదు, ఇతర కార్యకర్తలకు కూడా ఆశ్చర్యం కలిగించింది. ఆయన దృష్టంతా అధికారం కాదు, ఆ తర్వాత తెలంగాణ అభివృద్ధిపైనే ఉన్నది. తెలంగాణ కోసం ప్రజలు ఎంతగా ఉద్యమించారో ఆయనకు తెలుసు. అందుకే ఉద్యమ చరిత్రను తగిన రీతిలో నమోదు చేయాలని కూడా ఆయన అన్నారు. మిగతా నాయకులకు, కేసీఆర్కు ఉండే తేడా ఏమిటో ఈ సమావేశం చూసిన వారికి మళ్లీ అర్థమవుతుంది. ఆయన సగటు రాజకీయ నాయకుడు కాదు. పాలనాదక్షుడు. అమెరికా మతవేత్త, రాజకీయ నాయకుడు జేఎఫ్ క్లార్క్ అన్నట్టు ‘నాయకులు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తారు. కానీ పరిపాలనా దక్షులు రాబోయే తరాల గురించి ఆలోచిస్తారు.
కేసీఆర్ కూడా పాలనా దక్షుడు. ఆయన ఆలోచనలు ఈ ఎన్నికలు, అధికారాల కన్నా, తెలంగాణ భవిష్యత్తు గురించి, రాబోయే తరాల గురించి ఉంటాయి. మళ్ళీ అధికారం వచ్చిన తరువాత సాధారణ మార్పులు కాదు. విప్లవాత్మక మార్పులు తేవాలని ఆయన ఆలోచిస్తున్నట్టు కేసీఆర్ ప్రసంగం ద్వారా అర్థమైంది. ఇతర పార్టీలు ఇక్కడ పుట్టినయి కాదు, మన ప్రయోజనాలు వాటి ఎజెండా కాదు. మన ప్రజల గురించి ఆలోచించవలసింది, చేయవలసింది మనమే
అనేది ఆయన భావన.
కేసీఆర్ ప్రసంగం విన్న తర్వాత వెయ్యేనుగుల బలం వచ్చినట్టనిపించింది. జీవితానికి సరిపడా ఆత్మవిశ్వాసాన్ని ఆయన కలిగించారు. నిరంతరం మన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలనుకున్నాను. ఇంత గొప్ప నాయకుడి స్థానంలో రేవంత్ రెడ్డి వంటి అల్పుడిని ఎందుకు ఎన్నుకున్నామా అనిపించింది. కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ ఆర్థిక పరిస్థితి తెలియదు. మన వనరులు ఏమిటో తెలియదు. మన అవసరాలు అంతకన్నా తెలియదు. ఎన్నికల్లో గెలవడానికి అడ్డమైన హామీలు చేశారు. తీరా గెలిచిన తరువాత ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటుందని తెలువదని బుకాయిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో బడ్జెట్ ఉంటుంది, అప్పులు, ఆస్తులు అన్నీ పారదర్శకంగా ఉంటాయి. అధికారంలో ఉన్నా లేకున్నా కేసీఆర్కు తెలంగాణ ఆర్థిక పరిస్థితి మీద అవగాహన సంపూర్ణంగా ఉన్నది. మొదటిసారి గెలిచినప్పుడు కూడా ఆంధ్ర పాలకులమీద తప్పు వేసి, తప్పించుకోవాలనుకోలేదు. ఉన్న వనరులతో నడిపారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారు. ప్రజలకు బతుకు మీద నమ్మకం కలిగించారు. బయటి ప్రపంచంలో తెలంగాణ ప్రతిష్ఠను ఆకాశానికి ఎత్తారు. ఆయనకు కాంగ్రెస్ నాయకులకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. కేసీఆర్ గెలుపు ఓటములు కొత్త కాదు. ఏటికి ఎదురీదడం ఆయనకు అలవాటే. బలమైన లాబీలు కేంద్రంలో అడ్డుపుల్లలు వేసినా సరే, పోరాడి తెలంగాణ సాధించారు. మృత్యువు నోటిలో తల పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు. ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించారు. ఇంకా కేసీఆర్ ఎన్ని పరీక్షలు ఎదుర్కోలేదు? ఆయన తెలంగాణ కోసం తపిస్తూనే ఉంటారు. పోరాడుతూనే ఉంటారు. ఆయన నుంచి కార్యకర్తలు స్ఫూర్తి పొందాలి.
ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ మళ్లీ ప్రజలను కదిలిస్తున్నారు. ఇందులో హన్మకొండ సమీపంలోని ఎల్కతుర్తి సభ మొదటిది. సభలు తెలంగాణ ఉద్యమవ్యూహంలో భాగం. ప్రజలతో కేసీఆర్ జరిపే సంభాషణ. ఆయన టీవీల ద్వారా, సభల ద్వారా ప్రజలకు సందేశం ఇస్తూ ఉంటారు. కేసీఆర్ ప్రసంగం అంటే చాలు, జాతీయస్థాయిలో కూడా ఏ నాయకుడికీ లేనంత వ్యూయర్షిప్ ఉంటుందని టీవీల వారు అంటారు. అందుకే ఎల్కతుర్తి సభ కోసం జనం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ మాటలు వినడానికి తరలిరావాలని సమాయత్తమవుతున్నారు.
అది 2001, ఏప్రిల్ 27న జలదృశ్యంలో జరిగిన కేసీఆర్ సభ ఆనాడు మా జీవితాలనే మలుపుతిప్పింది. మాలో నూతనోత్సాహాన్ని నింపింది. ఆనాటి నుంచి అనేక సభలు… ప్రతి సభ ఉద్యమాన్ని చరిత్రాత్మకమైన మలుపు తిప్పింది. ప్రతి సభలో పాల్గొన్న నాలాంటి వారు ఎందరో కేసీఆర్ మళ్లీ నిర్వహించే ఎల్కతుర్తి సభ కోసం ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ పిలుపునందుకొని మళ్లీ కదులుదాం. తెలంగాణ స్థితిగతులను మార్చుకుందాం.
‘చేతిల జెండా..
జబ్బకు గొంగడి..
జాతర బోదమా…
తెలంగాణ జాతర బోదమా?’
(వ్యాసకర్త: చైర్మన్ టీ-కేసీఆర్ సెంటర్,తెలంగాణ నాలెడ్జ్ క్రియేషన్ రీసెర్చ్ సెంటర్)
-గోసుల శ్రీనివాస్ యాదవ్
98498 16817