దేశ అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా చేరాలని, అందరికీ సమాన అవకాశాలు లభించాలన్న లక్ష్యం బాబాసాహెబ్ది. ఈ లక్ష్యసాధనకు ప్రతీ భారతీయుడు కృషి చేయాలి. భారతదేశం అభివృద్ధిలో ముందుకు సాగాలంటే ఆర్థిక అసమానతలు, సామాజిక రుగ్మతలు పూర్తిగా తొలగిపోవాలన్న బలీయమైన ఆకాంక్ష భారత రాజ్యాంగం ద్వారా మనకు అవగతమవుతుంది. అటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చిన బాబాసాహెబ్ మన దేశానికే కాదు.. ప్రపంచానికే స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
తెలంగాణ ప్రజానీకం తరతరాల ఆకాంక్ష అయిన స్వరాష్ట్రం సిద్ధించటానికి, రాజ్యాంగంలో అంబేద్కర్ ఎంతో ముందుచూపుతో పొందుపర్చిన ఆర్టికల్ 3 కారణం. ఉమ్మడి ఏపీలో అణిచివేతకు గురైన తెలంగాణ సుదీర్ఘ పోరాటం ద్వారా దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పాటైంది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అచిరకాలంలోనే రాష్ట్రం పురోగమనం బాట పట్టింది. అంబేద్కర్ ఆశయాలను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేసి చూపిస్తున్నారు. ఆయన భావజాలాన్ని సజీవంగా ఉంచాలని, భవిష్యత్ తరాలకు అది అందుబాటులో ఉండాలని తపిస్తున్నారు. దీంట్లో భాగంగానే, నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ సచివాలయంగా నామకరణం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల ఎత్తులో హైదరాబాద్ నగరం నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంబేద్కర్ ఆశయ సాధన పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఇవన్నీ నిదర్శనాలు.
ఆర్థికంగా దళితులు ఎదగాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన చారిత్రాత్మక పథకం దళితబంధు. దీని ద్వారా దళితులు స్వయంగా తమ జీవనోపాధి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవటమే గాక, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగుతుండటం ఎంతో గర్వకారణం. దళితుల నుంచి పారిశ్రామికవేత్తలను తయారు చేయటానికి టీఎస్ ప్రైడ్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పే దళిత పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పావలా వడ్డీకే రుణాలను అందిస్తున్నది. మార్కెట్ కమిటీల్లో, కాంట్రాక్టు పనుల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించింది. స్వతంత్ర భారతంలో గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ పేరు మీద ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ప్రకటించవచ్చు గాక.. కానీ అంబేద్కరిజాన్ని నరనరాన నింపుకొని, దళిత జనోద్ధరణ కోసం కంకణబద్ధుడై ముందుకు సాగుతున్న వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమే.
అంబేద్కర్ వాదం భావోద్వేగాలకు సంబంధించినది కాదు, భావితరాలకు అందించవలసినది. పరిపాలన అంటే ఐదేండ్ల రాజకీయం కోసం కాదు.. నమ్మి గెలిపించిన ప్రజల వందేండ్ల భవిష్యత్తు కోసం అని విశ్వసించే నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరవేస్తున్నారు. మెజారిటీ వర్గాల చేతిలో మైనారిటీల ప్రయోజనాలు దెబ్బతినకూడదన్న అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ పాలిస్తున్నారు. అంతేకాదు.. రాష్ర్టాల హక్కులు, దేశంలో సమాఖ్య స్ఫూర్తి అంశాలలో అంబేద్కర్ ఆలోచనల వెలుగులోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిరంకుశ ధోరణుల మీద కేసీఆర్ పోరాడుతున్నారు. జాతి సంపదను కొందరు వ్యక్తులకు దోచిపెడుతున్న కేంద్రం నిర్ణయాలను ప్రతిఘటిస్తున్నారు. దేశ ప్రజలకు సామాజిక న్యాయం చేకూరాలంటే.. అది కేసీఆర్‌తోనే సాధ్యం. అంబేద్కర్ ఆశయ సాధనకు కేసీఆర్ నేతృత్వంలో ముందుకు సాగుదాం.
(వ్యాసకర్త: ఎమ్మెల్యే)
బాల్క సుమన్