దేశ సంపద ప్రభుత్వరంగ సంస్థల ఆధీనంలో ఉన్నప్పుడే ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయి, కానీ ప్రధాని మోదీ ‘అచ్చేదిన్ ఆయేగీ’ అంటూనే దేశ వనరులు మొత్తాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా వారికి ధారాదత్తం చేస్తున్నారు.
తెలంగాణలోని 6 జిల్లాల్లో విస్తరించిఉన్న సింగరేణి దేశానికి వెలుగులు నింపుతున్నది. తమ అస్తిత్వమైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కూడా సింగరేణి కార్మికుల పాత్ర అనిర్వచనీయమైనది. స్వరాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగా నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థ లాభాల బాట పట్టింది. కార్మికులకు బాసటగా కేసీఆర్ నిలిచారని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తిలేదు. మరోవైపు రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చుకోవాలనే సంకల్పంతో, కేంద్రం దేశంలోని బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు పూనుకున్నది. సింగరేణి పరిధిలో ఉన్న సత్తుపల్లి బ్లాక్3,శ్రావణపల్లి, పెనగడప బొగ్గు బ్లాకులను వేలం పేరుతో అదానీకి అప్పజెప్పాలని చూస్తున్నది.
130 ఏండ్లకు పైగా ప్రభుత్వ నిర్వహణలో సమర్థవంతంగా నిర్వహించబడుతూ లాభాల బాటలో పయనిస్తున్న దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి. అలాంటి సంస్థకు బొగ్గు బ్లాకులను కేటాయించకుండా తెలంగాణకు గుండెకాయలాంటి సింగరేణిని నిర్వీర్యం చేసి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నది.
ఈ బొగ్గుబ్లాక్ల విషయంలో రాష్ర్టానికొక విధానాన్ని అవలంభిస్తూ కేంద్రం పక్షపాతంగా వ్యవహరించడమే కాకుండా, తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నది.గుజరాత్,రాజస్థాన్లలోని బొగ్గు బ్లాకులను ఆయా ప్రభుత్వాలకు అప్పగించిన కేంద్రం, తెలంగాణ విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. వేలం పేరుతో కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని ప్రయత్నిస్తున్నది. దీని ద్వారా రాబోయే ఎన్నికల్లో, సదరు కార్పొరేట్ తిమింగలాల నుంచి ధన సహాయం కోసం గోతికాడ నక్కలా ఎదురుచూస్తున్నది. ప్రస్తుతం తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర,కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల థర్మల్ పవర్ స్టేషన్ల బొగ్గు అవసరాలు తీర్చడంలో సింగరేణిదే కీలక పాత్ర. ఒక్కసారి బొగ్గుబ్లాక్ల నిర్వహణ కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళితే ఆయా రాష్ర్టాల థర్మల్ విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుంది.
తెలంగాణలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ జరిగితే భవిష్యత్తు అవసరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రధానంగా బొగ్గు నిల్వలపై కార్పొరేట్ శక్తుల గుత్తాధిపత్యం పెరిగి కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉన్నది. తద్వారా బొగ్గు, విద్యుత్ ధరలు పెరిగి సామాన్యులపై మోయలేని భారం పడుతుంది.ముఖ్యంగా విద్యుత్ మోటారు ఆధారిత వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ధరలు పెరగడం వల్ల నిర్వహణ వ్యయం పెరిగిపోయి చిన్న తరహా పరిశ్రమలు మూతపడే అవకాశాలుంటాయి, దీంతో యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కుంటుపడతాయి. ఆర్థిక భారం వల్ల రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలకు సబ్సిడీపై విద్యుత్ అందించే పరిస్థితి లేకుండా పోతుంది. లాభాపేక్షతో ముందుకు సాగే కార్పొరేట్ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించడం వల్ల పర్యావరణంతో పాటు మానవాళికి ఇబ్బందులు తలెత్తుతాయి.
బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ జరిగితే శ్రమ దోపిడీ కూడా తీవ్రమవుతుంది. కార్మికుల హక్కులు హరించబడుతాయి. తెలంగాణ బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేసి సింగరేణికి అప్పగించాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాసినా బేఖాతరు చేస్తూ మొండి వైఖరిని అవలంభిస్తున్నారు.
ఇటీవల మోదీ రామగుండం పర్యటనకు వచ్చినప్పుడు సింగరేణిని ప్రైవేటీకరించబోమని ప్రకటించినప్పటికీ తాజాగా మళ్ళీ బొగ్గు గనుల వేలానికి టెండర్లు పిలవడం ఆయన పట్ల విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తున్నది. దీంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి. బీఆర్ఎస్ పార్టీతో పాటు వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు కూడా వారి ఆందోళనలకు మద్ద తు ప్రకటించాయి, ఈ అంశంపై తెలంగాణ ప్రాంత బీజేపీ ఎంపీలు నోరు మెదపక పోగా తమ తప్పు ను రాష్ట్ర ప్రభుత్వంపై మోపేలా తప్పుడు ప్రచారం చేయడం శోచనీయం.ఈ విషయంలో మోదీ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే సింగరేణి కార్మికులతో పాటు తెలంగాణ సమాజం కేంద్రంపై పోరాటానికి సిద్ధమవ్వాలి.
(వ్యాసకర్త: బీఆర్ఎస్వీ నాయకులు, కాకతీయ వర్సిటీ)
-కొనుకటి ప్రశాంత్
80084 92700