ప్రజల మనసులను గెలుచుకోలేని తెలంగాణ బీజేపీ నాయకులు అధికారం కోసం అనేక పన్నాగాలు పన్నుతున్నారు.కేసీఆర్ కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. పస లేని విమర్శలు ఎన్ని చేసినా తెలంగాణ, దేశ హితం పట్ల టవరెస్ట్ పర్సనాలిటీలకు ప్రతీకైన కేసీఆర్, కేటీఆర్, కవితల ఉక్కు సంకల్పం, దృఢ చిత్తం మాత్రం చెక్కు చెదరదు. బీజేపీ నాయకుల కలలన్నీ కల్లలే. ప్రజల మనసులో స్థానం బీఆర్ఎస్దే.
తెలంగాణలో అధికారం అటుంచి, ఢిల్లీ పీఠానికే భవిష్యత్తు బీటలు రావచ్చని బీజేపీలో భయం జొచ్చింది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు ఆ పార్టీ రాష్ట్ర ‘బండి’ బృందం బడాయిలు, నర్కుడు, చెప్పుడు మాటలు పట్టించుకొని ఏవేవో పగటి కలలు కన్నారు పార్టీ అధినేతలు. తీరా గ్రౌండ్ రియాలిటీ చూడబోతే, వినబోతే ఆ కలలు కల్లలనే తత్వం ఎరుకలోకి వచ్చినట్లుంది.
పబ్లిక్ అంతా బీఆర్ఎస్, కేసీఆర్ వైపే ఉన్న వాస్తవం బీజేపీకి బోధ పడింది. వచ్చే ఎన్నికల్లోనూ గులాబీదే గెలుపని, తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టుడే కాదు, జాతీయ రాజకీయాల్లోనూ కారు ‘కేంద్ర’ బిందువు కాబోతున్నదనే సత్యం గ్రహించారు. కేంద్రంలో పరిపాలన చేస్తున్నా స్పెషల్‌గా పైసా మేలు చేయని తమను తెలంగాణ పబ్లిక్ ఎట్లాగూ నమ్మరు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ర్టానికి జరిగిన ఫాయిదాల గురించి ఎంత చెప్పినా అసలే నమ్మరు. కాబట్టి, ఇగ ఎట్లనన్న చేసి ప్రజల నుంచి బీఆర్ఎస్ను, కేసీఆర్‌ను విడదీయాలె.. జనంలో అపోహలు రాజేయాలె.. అనుమానాలు రగల్చాలె.. అగాధం సృష్టించాలె.. ద్వేషం పుట్టించాలె అని బీజేపీ ఆలోచిస్తున్నది.
బీఆర్ఎస్పై వ్యతిరేకతకు బీజం వేయాలె.. అసహ్యం కలుగజేయాలె.. అనుబంధాన్ని తుంచాలె.. మంచి వాళ్ళు కాదనే భ్రమలు నాటాలె.. నిజాలు గడప దాటేలోగా అబద్ధాలను వ్యాపింపజేయాలె..చెడును, వ్యతిరేక విషయాలను చెవులు రిక్కించి వినే స్థితిని వీలైనదాని కంటే మించి వాడుకోవాలె.. ఇట్లా అనైతికంగా ప్రవర్తించడం మినహా మంచి మార్గంలో జనం మద్దతు పొందే ధ్యాసే లేని దిక్కుమాలిన రాజకీయాలకు బీజేపీ నాయకులు పాల్పడుతున్నారు. విష పూరితమైన ఉపాయాల పన్నాగంతో కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఓట్ల కోసం ఒక్కొక్కరి మీద ఒక్కో రకమైన నిందలు మోపుతున్నారు. ఈ విధంగా మొత్తమ్మీద వ్యక్తిత్వానికి హాని తలపెట్టుడె అసలు పనిగా బీజేపీ వాళ్లు పెట్టుకున్నట్టు విదితం అవుతున్నది.
తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని, నియంత పాలన నెలకొందని బీజేపీ నాయకులు నోరు పారేసుకుంటున్నారు. జన రంజక పాలన సాగిస్తున్న ప్రభుత్వాధిపతిపైనే వాచాలత్వాన్ని వీడడం లేదు. రాత్రి, పగలు పెగ్గు, ఎంఎల్ అంటూ మతి లేని ప్రసంగాలు చేస్తున్నారు. ఇంకా ఏవేవో నిరాధారమైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. లోకమంతా మెచ్చే యువ నేతకు మాదక ద్రవ్యాల సేవనాన్ని అంటగడుతున్నారు. చూసీ చూసీ, విని వినీ విసుగెత్తి విసిరిన సవాల్‌కు మాత్రం బడాయి బండి బాపతులు తోక ముడిచారు. పైగా ఛాలెంజ్ ఇపుడా అంటూ బీరాలు పలుకుతున్నారు. షుగర్ ఆర్గాన్స్ అంటూ పైత్యంతో పొగరుగా నోరు పారేసుకుంటున్నారు. యావత్ మహిళా లోకం గర్వించే నాయకురాలికి ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసును ఆపాదించేందుకు తెగ ఆయాస పడుతున్నారు. ఆ వివాదాన్ని ఎలాగైనా ఆ యోధురాలి మెడకు చుట్టాలని కాచుక్కూర్చున్నారు. దర్యాప్తు సంస్థలు, చట్టం తమ పని తాము చేసుకుపోతాయంటూనే అవి తమ చుట్టాలని చెప్పకనే చెబుతున్నారు. పవిత్రమైన బతుకమ్మకు లోకల్ టూ గ్లోబల్ దునియా మొత్తం వన్నెలద్దిన ధీర వనిత పట్ల డిస్కో పదాన్ని ప్రయోగించడానికి వారికి నోరెలా వచ్చిందో?
తెలంగాణ సమాజం గురించి, దేశ ఉజ్వల భవిష్యత్తు గురించి నిరంతరం తపించే ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ఆయన తనయ కవిత, తనయుడు కేటీఆర్ వ్యక్తిత్వ హననమే స్థూలంగా బీజేపీ నాయకుల వ్యూహం. అంతకు మించి తాము ప్రజల మద్దతు పొందలేమని వారు తీర్మానించుకున్నారు. సీఎం, మంత్రి, ఎమ్మెల్సీలను పొద్దస్తమానం బద్నాం చేయకపోతే తమకు రాజకీయంగా బతుకే లేదనే భావనకు బండి బ్యాచ్ బానిసైంది. ఎంతో సాహసం, దమ్ము, ధైర్యాలతో ప్రజా జీవితంలో సక్సెస్‌కు చిరునామా అయినవారి వ్యక్తిగత జీవితాల్లోకి విపరీత మనస్తత్వంతో చొరబడుతుండడం పూర్తిగా అవాంఛనీయం. ఇటువంటి బుర్ర లేని చేష్టలను కట్టడి చేయాల్సిన ఢిల్లీ పెద్దలు చోద్యం చూస్తుండడం అంతులేని అన్యాయం.
అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్ర, దేశ ప్రయోజనాలే పరమావధిగా రాజకీయ పార్టీలు పని చేయాలి. దానికి అవసరమైన విధంగా అనుగుణమైన చర్చలు చేయాలి. వాస్తవానికి దగ్గరగా ఉండే సద్విమర్శలు, సహేతుకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలి. ప్రజా క్షేత్రంలోని నిజాలను ధ్వనించాలి. రాష్ట్ర ప్రభుత్వం చేసింది, చేస్తున్నది అంగీకరిస్తూ, చేయాల్సింది చెప్పాలి. లోటుపాట్లుంటే సర్కారు దృష్టికి తేవాలి. తాము ఇంతకంటే మెరుగ్గా ఏమి చేయగలరో చెప్పుకోవాలి. అదే సమయంలో తాము కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఏమి తేగలుగుతున్నామో చూపించాలి. మొత్తంగా తెలంగాణకు, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే మాటా, చేతా ఉండాలి. అవేవీ చేతగాక, ఎంతసేపూ ప్రభుత్వ సారథి కుటుంబాన్నే తిడుతూ, బద్నాం చేస్తూ, బండలు వేస్తూ ఇట్లాగే కాలక్షేపం చేస్తే మాత్రం బండి ఏనాటికీ ప్రజల మెప్పు అనే గమ్యాన్ని చేరుకోదు. అత్యంత జాగరూకులు, చైతన్యవంతులైన తెలంగాణ పౌరులకు ఎవరేమిటో, ఏది నిజమో, ఏది బొంకుడో, ఏది అబద్ధమో బాగా తెలుసు. ప్రజా జీవితంలో చౌబీస్ గంటా నిమగ్నులై ఉండే సర్కారు సారథి కుటుంబం హృదయాలను తాత్కాలికంగా గాయపరిచినా, మనసును కష్ట పెట్టి బాధ కలిగించినా… తెలంగాణ, దేశ హితం పట్ల టవరెస్ట్ పర్సనాలిటీలకు ప్రతీకైన వారి ఉక్కు సంకల్పం, దృఢ చిత్తం మాత్రం చెక్కు చెదరదు.
(వ్యాసకర్త:ఇండిపెండెంట్ జర్నలిస్ట్)
-ఇల్లెందుల దుర్గాప్రసాద్
94408 50384