తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న విద్యుత్ రంగానికి సంబంధించి జీవో 44 ద్వారా ఒక కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యుత్ వినియోగదారులకు సేవలందిస్తున్న రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను విభజించాలనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఉచిత విద్యుత్ ద్వారా వ్యవసాయం చేసుకుంటున్న రైతుల కనెక్షన్లు, సాగునీటి ఎత్తిపోతల పథకాల కనెక్షన్లు, తాగునీటి కనెక్షన్లు, మిషన్ భగీరథ కనెక్షన్లను విడదీసి మూడో డిస్కం ఏర్పాటుచేసే దిశగా ప్రభుత్వం జీవో 44 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కనెక్షన్లు 29,05,779, ఎత్తిపోతల కనెక్షన్లు 489, హైదరాబాద్ వాటర్ సైప్లె, సీవరేజీ బోర్డు కనెక్షన్లు 99, తాగునీటి కనెక్షన్లు 639.. మొత్తం కలిపి 29,08,138 కనెక్షన్లతో మూడో డిస్కం కొత్తగా ఏర్పాటు కానున్నది. 2026, ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న డిస్కం విధి విధానాలు రాష్ట్ర రైతాంగాన్ని, విద్యుత్ ఉద్యోగులను ఆందోళనకు, అయోమయానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడో డిస్కం ఏర్పాటు వల్ల కలిగే పరిణామాలు, ప్రభావం, ప్రతికూలతల గురించి ఒకసారి విశ్లేషించుకుందాం.
వ్యవసాయరంగంలో ఉన్న 5,22,479 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 2,61,240 కిలోమీటర్ల ఎల్టీ లైన్లు మూడో డిస్కం పరిధిలోకి రానున్నాయి. వీటి విలువ రూ.4,929 కోట్లుగా లెక్కగట్టారు. హైదరాబాద్ కేంద్రంగా ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న 2,92,061 వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను, ఎన్పీడీసీఎల్ పరిధిలోని 2,30,418 వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను బదలాయించడంతో పాటు వాటికి స్మార్ట్ మీటర్లను బిగించనున్నారు. ఒక్కో మీటర్‌కు రూ.25,000 చొప్పున మొత్తం మీటర్లు బిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,306 కోట్లు ఖర్చు చేయనున్నది. 660 మంది ఇంజినీర్లు, 1000 మంది క్షేత్రస్థాయి సిబ్బంది, అకౌంట్స్, ఇతర విభాగాల కోసం 340 మంది.. మొత్తం కలిపి 2000 మంది విద్యుత్ ఉద్యోగులను మూడో డిస్కంకు బదలాయిస్తారు. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్లు వీరికి అదనం.
రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేండ్ల విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని అంచనా వేసింది. ఇందులో భాగంగానే 42 శాతం విద్యుత్ వినియోగ అవసరాలను మూడో డిస్కంకు కేటాయించింది. 45 శాతం ఎస్పీడీసీఎల్కు కేటాయించగా, 13 శాతం ఎన్పీడీసీఎల్కు కేటాయించింది. దీన్నిబట్టి చూస్తే ఏడాదికి సుమారు 31,355 మిలియన్ యూనిట్లను మూడో డిస్కం వాడుకుంటుంది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి డిస్కంలకు రావాల్సిన బకాయిల్లో రూ.35,982 కోట్లు మూడో డిస్కంకు కేటాయిస్తే, రూ.6,291 కోట్లు ఎస్పీడీసీఎల్కు, రూ.3,125 కోట్లు ఎన్పీడీసీఎల్కు కేటాయించింది.
వివిధ ఉత్పత్తి సంస్థలకు డిస్కంలు చెల్లించాల్సిన అప్పుల నుంచి రూ.26,950 కోట్లు మూడో డిస్కం ఖాతాలో వేయగా, ప్రస్తుతం ఉన్న డిస్కంలకు రూ.4,747 కోట్ల అప్పులు మాత్రమే చూపెట్టింది. రాష్ట్ర జెన్కోలకు ఉన్న మొత్తం బకాయిలను ఒక్క మూడో డిస్కంకే కేటాయించడం విశేషం. అదే విధంగా రూ.9,032 కోట్ల రుణాలను కూడా మూడో డిస్కంకు కేటాయించారు. ప్రభుత్వ శాఖల నుంచి జెన్కోలకు రావాల్సిన బకాయిలు రూ.35,982 కోట్లు. స్థూలంగా చెప్పాలంటే మూడో డిస్కం ఆస్తులు రూ.4,929 కోట్లు. ఈ డిస్కంకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.35,982 కోట్లు. మూడో డిస్కం రుణాలు రూ.9,032 కోట్లు. జెన్కోకు చెల్లించాల్సిన అప్పులు రూ.26,950 కోట్లు.
మూడో డిస్కం పరిధిలో ఎలాంటి సబ్స్టేషన్లు గానీ, హెచ్ టీ పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు గానీ లైన్లు గాని ఉండవు. ఆదాయ వనరులు దాదాపు సున్నా అనే చెప్పాలి. ప్రభుత్వ శాఖల సాగునీటి పథకాలు, రైతుల వ్యవసాయ కనెక్షన్లు, ఉద్యోగుల జీతభత్యాలకు కూడా పూర్తిగా ప్రభుత్వంపై ఆధారపడాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో క్రాస్ సబ్సిడీ చెల్లించే వినియోగదారులు ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంల
పరిధిలోనే ఉండిపోతారు.
ఏటా క్రాస్ సబ్సిడీల రూపంలో వస్తున్న సు మారు రూ.8 వేల కోట్ల నుంచి మూడో డిస్కంకు నయా పైసా రాదు. ప్రస్తుతం వ్యవసాయరంగ విద్యుత్‌కు ప్రభుత్వం చెల్లిస్తున్న సబ్సిడీలు సుమా రు రూ.11000 కోట్లు, అదనంగా రూ.8000 కోట్ల క్రాస్ సబ్సిడీకి సమానంగా నిధులు ప్రభు త్వం ఏటా మూడో డిస్కం కేటాయించవల్సి ఉం టుంది. ఇక్కడ మరో ఆందోళనకరమైన అంశం ఏమంటే… 33 కేవీ, 11కేవీ లైన్లు 33/11 కేవీ సబ్స్టేషన్లు తన ఆధీనంలో లేకపోవడంతో మూడో డిస్కం ప్రస్తుతం ఉన్న డిస్కంలకు వీలింగ్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఇప్పటికే నిర్ణయించిన వీలింగ్ చార్జీల టారిఫ్ ప్రకారం మూడో డిస్కం ఏటా మిగతా డిస్కంలకు రూ.6 వేల కోట్లు చెల్లించవలసి ఉంటుంది. యూనిట్ కొనుగోలు చార్జీలు, వీలింగ్ చార్జీలు, క్రాస్ సబ్సిడీ చార్జీలను పరిగణనలోకి తీసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్న యూనిట్ రేటుకు అదనంగా మరో రూ.2.50 పైసల వరకు ధర పెరుగుతుంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు కనెక్షన్లు ఇవ్వడానికి కావాల్సిన మౌలిక వసతులు, లైన్ల పునరుద్ధరణ, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు మార్చ డం, బ్రేక్డౌన్లు అయినప్పుడు కంపెనీల మధ్య సమన్వయ లోపం లాంటి మరెన్నో క్షేత్రస్థాయి స మస్యాత్మక అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి.
విద్యుత్ సవరణ బిల్లు-2025 తీసుకురావడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాబోయే ఐదేండ్లలో మెల్లమెల్లగా క్రాస్ సబ్సిడీలను పూర్తిగా తొలగించడానికి సన్నాహాలు చేస్తున్నది. క్రాస్ సబ్సిడీ ద్వారా రైతులకు, పేదలకే లాభం చేకూరుతుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మూడో డిస్కం ఏర్పాటు చేసినట్టయితే క్రాస్ సబ్సిడీల ఎత్తివేతకు ఎర్రతివాచీ పరిచినట్టవుతుంది. ఏరియా ఆఫ్ ఆపరేషన్ లేకుండా కేవలం క్యాటగిరీ ఆఫ్ సర్వీసెస్ ప్రాతిపదికన డిస్కం ఏర్పాటు అనేది బహుశా దేశ చరిత్రలోనే ఇదే ప్రథమం అని చెప్పవచ్చు. అధిక టారిఫ్‌లు చెల్లించే వినియోగదారుల నుంచి వసూలు చేసే క్రాస్ సబ్సిడీలను పేద, వ్యవసాయ వినియోగదారులకు మళ్లించి సామాజిక సమతుల్యతను సాధించడమనేది విద్యుత్ సంస్థల్లో అనాదిగా జరుగుతున్న ప్రక్రియ. బీజేపీ పాలిత రాష్ర్టాలతో సహా దేశంలోని అన్ని రాష్ర్టాల్లో ఇప్పటికీ క్రాస్ సబ్సిడీ విధానం కొనసాగుతున్నది. ప్రతిపాదిత మూడో డిస్కం ఆచరణలోకి వస్తే వ్యవసాయ కనెక్షన్లకు ఎలాంటి క్రాస్ సబ్సిడీ అందించే వీలుండదు. ఒక కంపెనీకి చెందిన క్రాస్ సబ్సిడీ మరో కంపెనీకి సర్దుబాటు చేసే అవకాశం ఉండదు కనుక. అప్పుడు భారతదేశ చరిత్రలోనే క్రాస్ సబ్సిడీ ఎత్తివేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణే అవుతుంది.
విద్యుత్ చట్టంలోని యూనివర్సల్ సైప్లె ఆబ్లిగేషన్ ప్రకారం.. ఎవరైనా, ఏ క్యాటగిరీలోనైనా కరెంట్ కావాలని దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించే అవకాశం ఏ కంపెనీకి ఉండదు. అలాంటప్పుడు మూడో డిస్కంకు వ్యవసాయేతర దరఖాస్తు లేదా ప్రస్తుతం ఉన్న రెండు డిస్కంల పరిధిలోని వినియోగదారుడు వ్యవసాయ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు తిరస్కరించే అధికారం కూడా ఆయా కంపెనీలకు ఉండదు! విద్యుత్ సంస్కరణలకు ఆద్యునిగా చెప్పబడే చంద్రబాబు కూడా ఏరియా లేకుండా క్యాటగిరీ ఆఫ్ సర్వీస్ కనెక్షన్ ఆధారంగా ఇప్పటి వరకు మూడో డిస్కంలాంటి కంపెనీని ఏర్పాటు చేయలేదనేది వాస్తవం.
ఉమ్మడి ఏపీ రాష్ట్ర విద్యుత్ బోర్డు విభజన సమయంలో, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం జరిగిన పరిణామాల్లో తెలంగాణ విద్యుత్ ఇంజినీర్లు పెద్ద ఎత్తున నష్టపోయారు. ట్రైపార్టీ అగ్రిమెంట్లు సరిగ్గా అమలు జరుగకపోవడం, జస్టిస్ ధర్మాధికారి ఆదేశాలు, అప్పటి యాజమాన్యాల అస్తవ్యస్త నిర్ణయాలతో సకాలంలో ప్రమోషన్లు అందుకోలేకపోయారు.
కోర్టు కేసుల మూలంగా తెలంగాణ ఉద్యోగులు ప్రత్యేకించి ఇంజినీర్లు ఏండ్ల తరబడి ప్రమోషన్ల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. 500కు పైగా ఆంధ్రా ఇంజినీర్లు తెలంగాణ విద్యుత్ సంస్థల్లో తిష్ట వేయడం ఇందుకు ప్రధాన కారణం. 800కు పైగా ఆంధ్ర రాష్ర్టానికి చెందిన పెన్షనర్లు తెలంగాణకు అన్యాయంగా వచ్చి పడ్డారు. రాష్ట్ర విభజన అనంతరం పెన్షన్, ఇతర ప్రయోజనాలకు సంబంధించి నిధులు, పెన్షన్ ఫండ్ ఏపీ విద్యుత్ సంస్థలతోనే ఉండిపోయాయి. ఇప్పుడు మూడో డిస్కం ఏర్పాటు వల్ల కూడా ఉద్యోగుల భవిష్యత్తు మరింత గందరగోళంగా తయారయ్యే అవకాశాలున్నాయి.
అయితే, సబ్సిడీలపైనే ఆధారపడి ఉన్న వ్యవసాయ, సాగు, తాగునీటి వినియోగదారులను మూడో డిస్కం ద్వారా విభజించడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశాలున్నాయి. ఉద్దేశపూర్వకంగా, ముందస్తు ప్రణాళికలో భాగంగానే విద్యుత్‌రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశలో వేగంగా అడుగులు వేస్తున్నట్టు ఇంజినీర్లు భావిస్తున్నారు. వాణిజ్యపరంగా లాభదాయకం కా నున్న మిగతా రెండు డిస్కంలను ప్రైవేటు సం స్థలకు లేదా వ్యక్తులకు అప్పగించనున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్ర భుత్వం తీసుకురానున్న ‘విద్యుత్ సవరణ బిల్లు-2025’లోని బహుళ లైసెన్సింగ్ అనుమ తి విధానం అందుకు బలాన్ని చేకూరుస్తున్నది.
(వ్యాసకర్త: విద్యుత్‌రంగ విశ్లేషకులు)
-తుల్జారాంసింగ్ ఠాకూర్