కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన ప్రధాన హామీల్లో ఉద్యోగులకు ఇచ్చిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు
చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పడం కూడా ఒకటి. కానీ, అన్ని వర్గాలకు ఇచ్చిన హామీల ఎగవేతలో ఉద్యోగులకు చేసిన వాగ్దానం కూడా చేరిపోయింది. దీంతో దాదాపు 3 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై ఇప్పటికే రెండేండ్లు పూర్తయ్యాయి. అయినా ఉద్యోగుల సమస్యల్లో ఏ ఒక్కటీ పరిష్కారానికి నోచుకోలేదు. పైగా అనేక కొత్త సమస్యలను సృష్టించి దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను కాంగ్రెస్ సర్కార్ కాలరాస్తున్నది. అందులో భాగంగానే 2025 నవంబర్ 25న తీసుకొచ్చిన ఎనిమిదవ నంబర్ ఆర్డినెన్స్‌కు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే సర్కార్ చట్ట రూపం ఇవ్వబోతున్నది. ఇది ఒక చట్ట సవరణ మాత్రమే కాదు, రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలకు సంబంధించిన మరణశాసనం.
ప్రభుత్వ ఉద్యోగులు సర్కార్‌కు రథచక్రాల వంటి వారని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ గొప్పలు చెప్పింది. కానీ, ఇప్పుడు అదే రథచక్రాల కింద ఉద్యోగుల హక్కులు, వారి భవిష్యత్తును నిర్దాక్షిణ్యంగా తొక్కివేస్తున్నది. తాము అధికారంలోకి రాగానే పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరిస్తామని, సీపీఎస్‌ను రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టో పేజీ నంబర్ 3లో కాంగ్రెస్ పొందుపరిచింది. ఆ మేరకు ఊరూరా తిరిగి కాంగ్రెస్ నేతలు డబ్బా కొట్టిన్రు. ఓట్లు వేయించుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక దానికి పూర్తి విరుద్ధంగా ఇలాంటి నల్ల చట్టాన్ని తీసుకువచ్చారు. ఇది ముమ్మాటికీ ఉద్యోగులను నిలువునా వంచించడమే. కన్నీళ్లు తుడుస్తామని చెప్పిన చేతులే ఇప్పుడు వారి గొంతు నులిమేస్తున్నాయి. సీపీఎస్ రద్దు సంగతి దేవుడెరుగు.. సుదీర్ఘ కాలం పనిచేసి న్యాయబద్ధంగా పెన్షన్ హక్కును పొందే అవకాశమున్న కొందరికి కూడా ఇవ్వకుండా నల్ల చట్టాలు తీసుకురావడం దుర్మార్గం. ఉద్యోగుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం ఉరితాడులాగా మారడం విషాదకరం.
ఈ బిల్లులోని సెక్షన్లను చూస్తుంటే ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఎంత కక్ష ఉన్నదో అర్థమవుతున్నది. 1/9/2004 కంటే ముందు 10-20 ఏండ్లపాటు కాంట్రాక్ట్, పార్ట్ టైమ్, ఎన్ఎంఆర్ పద్ధతిలో పనిచేసి, ఆ తర్వాత రెగ్యులరైజ్ అయిన సుమారు 10 వేల మంది ఉద్యోగుల పాత సర్వీసును పెన్షన్ కోసం లెక్కించబోమని ఈ ప్రభుత్వం చెప్తున్నది. కేసీఆర్ హయాంలో రెగ్యులర్ అయిన 6,000 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు దీనివల్ల పెన్షన్‌ను కోల్పోతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రెగ్యులర్ అయిన వేలాది ఉద్యోగుల పరిస్థితి కూడా అంతే. రూ.20,000 కోట్ల ఆర్థిక భారమనే కుంటిసాకుతో కాంగ్రెస్ సర్కార్ వారి జీవితాలతో ఆడుకుంటున్నది. అంతేకాదు, ఈ బిల్లులోని సెక్షన్ 7ఎఫ్ అత్యంత ప్రమాదకరమైనది.
భవిష్యత్తులో ఏ ఉద్యోగి కూడా తన పెన్షన్ హక్కు కోసం కోర్టు మెట్లు ఎక్కకూడదని, ఇప్పటికే ఉన్న కోర్టు తీర్పులన్నీ రద్దయిపోతాయని (Abatement) ఇందులో పొందుపరిచారు. న్యాయస్థానాల తలుపులు మూసివేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఎస్డీ జయప్రకాశ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2025) కేసులో ఇటీవల సాక్షాత్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఒక వ్యక్తి కాంట్రాక్ట్ పద్ధతి నుంచి రెగ్యులరైజ్ అయితే అతని పాత సర్వీసును కూడా పెన్షన్ కోసం లెక్కించాలని స్పష్టంగా చెప్పింది. కానీ, ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును కూడా తుంగలో తొక్కి, ఆ తీర్పు అమలు కాకుండా ఉండటానికే రాత్రికిరాత్రి ఈ ఆర్డినెన్స్ తెచ్చింది. దేశ అత్యున్నత న్యాయస్థానం పెన్షన్ ఇవ్వాలని చెప్తుంటే, ‘మేం ఇవ్వం’ అని చట్టం చేయడం అహంకారం కాదా? కాంగ్రెస్ తెచ్చిన ఈ బిల్లు వల్ల వివిధ వర్గాల ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
రాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. 2024లో రిటైర్ అయినవారికి ఇప్పటివరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడం లేదంటే ఈ ప్రభుత్వం వారి పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నదో అర్థమవుతున్నది. 35 ఏండ్లపాటు ప్రభుత్వానికి మచ్చలేని సేవలందించిన ఉద్యోగులకు రిటైర్ అయ్యాక ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా బెనిఫిట్స్ రాలేదు. హైకోర్టులో కేసు వేసినా ప్రభుత్వం కనికరించడం లేదు. ఇప్పటికే ప్రభుత్వ బెనిఫిట్స్ అందక మనోవేదనతో42 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు. వారి చావులకు బాధ్యులెవరు?
బీఆర్ఎస్ హయాంలో 17 వేల మంది రిటైర్ అయితే కేసీఆర్ ప్రభుత్వం అందరికీ సకాలంలో బెనిఫిట్స్ ఇచ్చింది. కానీ, ఇప్పుడు రిటైర్ అవుతున్నవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 2024 మార్చి నుంచి 31/12/2025 వరకు రిటైర్ అయిన 13,323 ఉద్యోగుల్లో 7,177 మందికి పెన్షన్‌తో పాటు హక్కుగా రావాల్సిన ప్రయోజనాలు, దాచుకున్న జీపీఎఫ్ డబ్బులను ఇవ్వకుండా వేధిస్తున్నది. రూ.4,500 కోట్లు విడుదల చేశామని ప్రభుత్వం చెప్తున్న అబద్ధాలను కొంతమంది ఉద్యోగ సంఘం నాయకులు ప్రచారం చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేస్తున్నారు. నెలకు కనీసం వంద కోట్లు కూడా పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించడం లేదు. రూ.4,500 కోట్లు ఎవరికి చెల్లించారో ప్రభుత్వం వివరాలు చెప్పాలి. పైగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాయిదా వేయడానికి రిటైర్మెంట్ వయస్సును మరో మూడేండ్లు పెంచాలనే ఆలోచన చేస్తున్నట్లు వస్తున్న వార్తలు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
నేడు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ తీవ్ర మనోవేదనతో ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ జనవరితో మరో డీఏ కూడా కలిపి మొత్తం ఆరు డీఏలను పెండింగ్‌లో పెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. 2023 జూలై నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ ఇంతవరకు అమలుకాలేదు. కనీసం పీఆర్సీ ఇవ్వాలనే ఆలోచన కూడా సర్కార్ చేయకపోవడం మరింత దారుణం. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 43 శాతం, 30 శాతం ఫిట్మెంట్తో రెండు సార్లు పీఆర్సీ ఇచ్చి ఉద్యోగుల వేతనాలు పెంచి, 5 శాతం మధ్యంతర భృతి కూడా అమలు చేసింది. నేడు ఆ ఊసే లేదు. పైగా సీపీఎస్ కింద ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేసిన డబ్బును, ప్రభుత్వం కట్టాల్సిన వాటాను రెండేండ్ల నుంచి దారిమళ్లిస్తున్నారు. దీంతో లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మ్యానిఫెస్టోలో పీఆర్సీ ఇస్తామని, బకాయిలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు మొండిచేయి చూపించడం ధర్మమేనా? రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతోపాటు ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆర్టీసీ కార్మికులు, ఆశా, అంగన్వాడీ వర్కర్లు, 104 సిబ్బంది, హోంగార్డులు, సర్వశిక్షా అభియాన్, కేజీబీవీ ఉద్యోగులకు ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలిచ్చింది. కానీ, ఇప్పుడు వారిని నట్టేట ముంచింది. తాజాగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కారణంగా ఇన్నాళ్లు వారు కష్టపడి చేసిన సర్వీస్ జీవో సర్వీస్‌గా మారుతుండటం ఆయా వర్గాల పాలిట శాపంగా మారింది.
ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రశ్నిస్తే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదు. పాలన గాలికొదిలేసి ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకున్నది తప్ప, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలనే సోయి ఈ ప్రభుత్వానికి లేదు. పోలీసుల విషయమే తీసుకోండి. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష ఉపనేత హరీశ్‌రావు పోలీసుల పక్షాన గళమెత్తి నిలదీస్తేనే ప్రభుత్వంలో కొంచెమైనా చలనం వచ్చింది. అప్పటికప్పుడు హడావుడిగా పెండింగ్‌లో ఉన్న ఐదు సరెండర్ లీవుల్లో రెండింటిని విడుదల చేసింది. దీంతో మిగిలిన సరెండర్ లీవులతో పాటు, ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న వారి టీఏ, డీఏ నిధులను కూడా తక్షణమే విడుదల చేయాలని అసెంబ్లీలో బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఈ జనవరితో కలిపి పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే చెల్లించాలి. కాలయాపన చేయకుండా, కమిటీల పేరుతో సాగదీయకుండా పీఆర్సీని తక్షణమే అమలులోకి తీసుకురావాలి. అలాగే పెండింగ్‌లో ఉన్న సీపీఎఫ్ కాంట్రిబ్యూషన్ చెల్లించి, మ్యానిఫెస్టోలో చెప్పినట్లు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి. ఉద్యోగులకు ఆరోగ్య కార్డ్ ఇస్తామని తేదీలు ప్రకటిస్తూ సాగదీయడం సవతి తల్లి ప్రేమ కాదా? లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలను గౌరవించి, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ఇప్పటికే అనేకసార్లు పెన్షనర్లతోపాటు ఇతర ఉద్యోగ వర్గాలు ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం. ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే రాష్ట్రంలో ఆందోళనలు ఉధృతం కాక తప్పదు.
(వ్యాసకర్త: పూర్వ ఉద్యోగ సంఘాల జాక్ చైర్మన్)
-దేవీప్రసాద్