నేడు తెలంగాణ రాష్ట్రం అంధకారాన్ని చీల్చుకొని కాంతులు విరజిమ్ముతూ విద్యుత్తు రంగంలో దేశంలోనే అగ్రభాగాన నిలబడింది. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకు నిరంతరం 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నది. కేవలం పదేండ్లలో కేసీఆర్ నాయకత్వంలో ఇంతటి అనితర సాధ్యమైన కార్యాన్ని సాధించింది తెలంగాణ. అందుకే ఇంతటి ఘనకీర్తి తెలంగాణ సొంతం కావడం జీర్ణించుకోలేక అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నాయి ప్రజా పక్షాన లేని ప్రతిపక్ష పార్టీలు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కరెంటుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి ఎక్కువ నిధులు కేటాయించారు. ఎందుకంటే తెలంగాణ రాష్ర్టానికి కరెంటు గుండెకాయ లాంటిది. భౌగోళిక స్వరూపం దృష్ట్యా ప్రధానంగా ఎత్తిపోతలపై ఆధారపడే ప్రాంతం. అత్యధికంగా వ్యవసాయ మోటర్లు ఉన్న రాష్ట్రం. అదే విధంగా హైదరాబాద్ లాంటి ప్రపంచస్థాయి నగర అవసరాలు తీర్చవలసిన అవసరం కూడా ఉన్నది. ఈరోజు తెలంగాణలో రైతుల కు, పరిశ్రమలకు నిరంతరం 24 గంటల విద్యుత్తు అందుతుందంటే దానివెనుక కేసీఆర్ పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, దార్శనికత ప్రధానమైనవి.
తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 2,126 మెగావాట్లు. ఇది దేశ తలసరి విద్యుత్ వినియోగంతో పోల్చితే 75 శాతం అధికం. అంటే తెలంగాణ రాష్ర్టాభివృద్ధిలో దేశంతో పోల్చితే రెండింతలు ముందున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న అన్ని అభివృద్ధి సూచికలపై తలసరి విద్యుత్తు వినియోగ ప్రభావం బలంగా ఉంటుంది. ప్రపంచం ముందు ఈరోజు తెలంగాణ దగదగ మెరుస్తుందంటే దాని వెనుక ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయి. వాటిని అధిగమించి తెలంగాణ దేశానికి దివిటిగా మారింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో విద్యుత్తు పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. వ్యవసాయానికి కేవలం 2,3 గంటల కరెంటు అందుబాటులోఉండేది. దీంతో పంటలు ఎండిపోయి రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడేవారు. లో వోల్టేజీ కారణంగా మోటర్లు కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్లు నిత్యం పేలిపోయే వి. పారిశ్రామిక రంగానికి సంబంధించి వారానికి రెండు రోజులు పవర్ హాలిడే విధించేవారు. ఫలితంగా అనేక పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి. తెలంగాణ ప్రాంతంలో అన్ని వర్గాల వారికి ఇన్వర్టర్లు తప్పనిసరి అయ్యేవి.
2014, జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్తు సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ప్రత్యేక దృష్టిసారించింది. తెలంగాణ విద్యుత్తు రంగ విజయగాథ వెనుక ఒక స్పష్టమైన ప్రణాళిక ఉన్నది. రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం నుం చి తక్షణం గట్టెక్కడానికి, రాష్ర్టాన్ని శాశ్వతంగా మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలతో సీఎం కేసీఆర్ ముందుకుసాగారు.
మొట్టమొదట ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్తు ఒప్పం దం చేసుకొని పీజీసీఎల్ సహకారంతో హైదరాబాద్‌కు కొత్త లైన్ నిర్మాణం చేయించారు. దేశంలో ఎక్కడ విద్యుత్తు అందుబాటులో ఉంటే అక్కడ కొనుగోలు చేసి తెలంగాణ ప్రజల, రైతుల కష్టాలు తీర్చింది తెలంగాణ ప్రభుత్వం. ఆ తర్వాత అన్ని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను రికార్డు సమయంలో పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభింపజేశారు. అందులో జూరాల 120 మెగావాట్లు, పులిచింతల 240 మెగావా ట్లు, భద్రాద్రి 1080 మెగావాట్లు, కాకతీయ 600 మెగావాట్లు, కేటీపీఎస్ 7వ దశ ద్వారా 800 మెగావాట్లు, భూపాలపల్లి, జైపూర్ 1800 మెగావాట్లు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు ప్రధానమైనవి. ఇక యాదాద్రిలో రూ.35,000 కోట్ల తో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం ద్వారా 4000 మెగావాట్లు విద్యుత్తు అందుబాటులోకి రానున్నది.
కేసీఆర్ నిరంతర కృషి ఫలితంగా స్థాపిత విద్యుత్తు 7,778 మెగావాట్ల నుంచి 18,500 మెగావాట్లకు చేరుకున్నది. త్వరలో 2500 మెగావాట్లకు చేరుకోనున్నది. పదేండ్ల వయ స్సు లేని ఒక చిన్న రాష్ట్రం సాధించిన అపూర్వ ఘనత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిననాటి నుంచి ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం దాదాపు రూ.38,000 కోట్లు విద్యుత్తు రంగంపై ఖర్చు చేయడం గొప్ప విషయం. ప్రభుత్వం ఏటా వార్షిక బడ్జెట్లో విద్యుత్తు రంగానికి అంతకంతకు నిధులు పెం చుతూ వస్తున్నది. 2023కు గాను రూ.12.727 కోట్లు విద్యుత్తు రంగానికి తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. ఇది గతేడాదితో పోల్చితే రూ.1500 కోట్లు అధికం.
తెలంగాణ రాష్ట్రం ఇంత వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం విద్యుత్తు రంగం అని గ్రహించి కాంగ్రెస్, బీజేపీలు కుట్రలకు తెరలేపాయి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు 24 గంటలు నిరంతర విద్యుత్తు అవసరం లేదని వ్యాఖ్యానించడం ద్వారా కాంగ్రెస్ రైతు వ్యతిరేకి అని అర్థమవుతున్నది.
నిరంతర నాణ్యమైన విద్యుత్తు ద్వారా ఈ రోజు తెలంగాణలో 2 కోట్ల ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. కులవృత్తులకు ఉచిత విద్యుత్తు అందుతున్నది. అలాంటిది కాంగ్రెస్ పార్టీ విద్యుత్తు వద్దు అనడమంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యవసాయం చేసుకొనే అగ్రవర్ణ పేదలకు వ్యతిరేకమని స్పష్టమవుతున్నది.
మరోపక్క బీజేపీ దేశవ్యాప్తంగా విద్యుత్తును ప్రైవేటుపరం చేసి కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తున్నది. ఉమ్మడి జాబితాలోని విద్యుత్తు రంగాన్ని రాష్ర్టాలతో సంబంధం లేకుండా పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్నది. ప్రైవేట్‌పరం చేయడం ద్వారా ఉచిత విద్యుత్తు లేకుండా కుట్రలు చేస్తున్నది బీజేపీ. కనుక తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు సాగాలంటే కుట్రదారులను ఇటు రాష్ట్రంలోను, అటు కేంద్రంలోను అధికారంలోకి రాకుండా చూడాలి.
-రాగి శ్రీనివాస్ రెడ్డి
99850 98432