ఖలీల్‌వాడి/బాన్సువాడ, సెప్టెంబర్ 29: ‘స్థానిక’ సమరానికి నగారా మోగింది. ఆశావహుల ఎదురుచూపులకు తెర పడింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సోమవారం షెడ్యూల్ వెలువరించింది. ముందు మండల, జిల్లా పరిషత్, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుంది. మొత్తం ఐదు విడుతల్లో కలిపి పరిషత్, పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయనున్నట్లు ఎస్ఈఐఈ తెలిపింది.
అక్టోబర్ 9న నోటిఫకేషన్ జారీ కానుండగా, షెడ్యూల్ విడుదలతో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సోమవారం షెడ్యూల్ విడుదల చేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రెండు విడుతల్లో మండల, జిల్లా పరిషత్‌లకు, మూడు విడుతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 9న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇప్పటికే ఓటర్ల తుది జాబితా ప్రచురించడం, రిజర్వేషన్లు కూడా ఖరారు కావడంతో ఎన్నికలు నిర్వహించడమే తరువాయి. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. కామారెడ్డి జిల్లాలో 25 జడ్పీటీసీ స్థానాలు, 233 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, నిజామాబాద్ జిల్లాలో 307 ఎంపీటీసీ, 31 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అక్టోబర్ 23న తొలి విడుత, 27న రెండో విడుత ఎన్నికలు జరుగనున్నాయి. వీటి ఫలితాలను నవంబర్ 11న ప్రకటించనున్నారు. ఇక, జీపీ ఎన్నికలు మూడు విడుతల్లో నిర్వహించనున్నారు. అక్టోబర్ 30, నవంబర్ 4, 8న సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించి, అదే రోజే ఫలితాలు విడుదల చేయనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలు ప్రకటించడంతో తక్షణమే ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న రాజకీయ నేతలు, ప్రముఖల విగ్రహాలకు ముసుగు వేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో నిబంధనల ప్రకారమే కార్యకలాపాలు నిర్వహించనున్నారు. కోడ్ ముగిసే వరకూ ఎలక్షన్ కమిషన్ నియమావళిని విధిగా పాటించాల్సి ఉంటుంది. రూ.50 వేలకు మించి నగదును వెంట తీసుకెళ్లడంపై ఆంక్షలు మొదలయ్యాయి. సరైన పత్రాలు లేని నగదును అధికారులు సీజ్ చేసే అవకాశముంది. నవంబర్ 11న మండల, ప్రజా పరిషత్ ఎన్నికలు ఫలితాలతో ముగియనున్నది.
పరిషత్ ఎన్నికలు పూర్తయ్యాక పంచాయతీ పోరుకు తెర లేవనున్నది. కామారెడ్డి జిల్లాలో 532 సర్పంచులు, 4,656 వార్డు స్థానాలుండగా, నిజామాబాద్ జిల్లాలో 545 సర్పంచ్, 5,022 వార్డు స్థానాలు ఉన్నాయి. వీటికి మూడు విడుతల్లో అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. పోలింగ్ నిర్వహించిన రోజు సాయంత్రమే కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.
ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న స్థానిక సమరానికి తెర లేవడంతో ఆశావహుల్లో ఆనందం వెల్లువెత్తుతున్నది. అయితే, ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థుల తలరాతను మార్చే నిర్ణయాధికారం మాత్రం అతివల్లో చేతుల్లోనే ఉన్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఆధిక్యంగా ఉంది. నిజామాబాద్ జిల్లాలో పురుష ఓటర్ల సంఖ్య 3,96,778 మంది కాగా, మహిళలు 4,54,621 ఉన్నారు. ఇక కామారెడ్డి జిల్లాలో 3,07,508 మంది పురుష ఓటర్లు ఉండగా, 3,32,209 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు జిల్లాల్లో అతివల ఆశీస్సులు దక్కిన వారినే విజయం వరించనున్నది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న కొందరి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది!. ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారు పోటీ చేసే అంశంపై అటు ఈసీ నుంచి, ఇటు సర్కారు నుంచి స్పష్టత కరువైంది. అయితే, ఇద్దరికి మించి పిల్లలు ఉన ్నవారు పోటీకి అనర్హులు అనే నిబంధన 1995 నుంచి అమలులో ఉన్నది. ఈ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ఎలాంటీ జీవో జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో పాత నిబంధనల మేరకే ఎన్నికలు నిర్వహించనుండడంతో ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలు ఉన్న వారు పోటీకి అనర్హులేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.