ఆదిలాబాద్, మార్చి 16(నమస్తే తెలంగాణ) ; ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు గ్యాస్ తిప్పలు తప్పడం లేదు. మూడో రోజైన సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని తిరుపెల్లిలో గల గ్యాస్ ఏజెన్సీ వద్దకు వినియోగదారులు భారీగా తరలివచ్చారు. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు కార్యాలయం మూసివేసి నో స్టాక్ బోర్డు తగిలించారు. తిరుపెల్లి రోడ్లో గల గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు శుక్రవారం క్యూ కట్టారు. స్టాక్ లేకపోవడంతో శనివారం రమ్మని చెప్పారు. శనివారం ఉదయం కొంతమందికి సిలిండర్లు పంపిణీ చేసిన నిర్వాహకులు బుకింగ్‌ల ప్రకారం రసీదులు రాసిచ్చి మధ్యాహ్నం మూడు గంటలకు రమ్మన్నారు. ఏజెన్సీ సిబ్బంది సూచించిన విధంగా శనివారం సాయంత్రం రసీదులు తీసుకొని ప్రజలు గ్యాస్ ఏజెన్సీ వద్దకు రాగా.. మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి సిలిండర్ల వాహనం రాలేదు. సోమవారం ఉదయం రమ్మని సూచించారు. సోమవారం ఉదయం తమకు రాసిచ్చిన రసీదులు తీసుకొని వినియోగదారులు కార్యాలయానికి రాగా.. మూసివేసి ఉండడం కనిపించింది.
రెండు రోజుల నుంచి తిరుగుతున్నా..
మా గ్రామం యాపల్‌గూడ. ఇక్కడికి పది కిలోమీటర్ల దూరం వరకు ఉంటుం ది. సిలిండర్ అయిపోవడంతో బుక్ చేసుకొని శనివారం తిరుపెల్లి ఏజెన్సీ కార్యాలయానికి వచ్చా. స్టాక్ అయిపో యింది. సోమవారం రమ్మని చెబితే ఈ రోజు ఉదయం ఆటోలో రూ.150 కిరాయి పెట్టుకొని పొద్దన వచ్చిన. మండుటెండలో పొద్దటి నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు ఏజెన్సీ ముందు నిల్చున్న పట్టించుకునే వారు లేరు. ఆఫీ సు మూసివేసి ఉంది. మంగళ వారం స్టాక్ వస్తుంది. ఫోన్ చేసి రమ్మని అంటు న్నారు. కట్టెలపొయ్యి మీద వంట చేసే అలవాటు తప్పంది. సిలిండర్ దొరకక పోవడంతో కట్టెల పొయ్యి మీద వండు తున్నాం. సిలిండర్లకు ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నా మాకు మాత్రం దొరుకుతలేదు. – స్వప్న, యాపల్‌గూడ,
ఆదిలాబాద్ రూరల్ మండలం.
టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే వస్తది అంటున్నరు..
నాకు సింగిల్ సిలిండర్ ఉంది. సిలిండర్ ఖాళీ అవడంతో శుక్రవారం బుక్ చేసుకొని శనివారం పది కిలోమీటర్ల దూరం నుంచి తిరుపెల్లిలోని గ్యాస్ ఏజెన్సీకి వచ్చా. క్యూలైన్లో గంటల కొద్ది నిలబడిన తర్వాత స్టాక్ అయిపోయిందని, సాయంత్రం వరకు వస్తుందని రసీదు రాసి ఇచ్చారు. శనివారం సాయంత్రం ఏడు గంటల వరకు ఉన్నా. సిలిండర్ల స్టాక్ రాకపోవడంతో ఇవ్వలేదు. సోమవారం పొద్దున రమ్మని చెప్పారు. ఉదయం ఆరు గంటలకు ఆటోకు రూ.150 కిరాయి పెట్టుకొని వచ్చా. స్టాక్ లేదని బోర్డు పెట్టి ఆఫీస్ మూసివేశారు. మధ్యాహ్నం 1 గంట అవుతున్నా.. నాకు సిలిండర్ ఇవ్వలేదు. మంగళవారం ఉదయం రమ్మని అంటున్నారు. గ్యాస్ కొరత ఉంటే టోల్ ఫ్రీ నంబరకు ఫోన్ చేయాలని అధికారుల సూచన మేరకు ఫోన్ చేస్తే నా వివరాలు తెలుసుకొని సిలిండర్లు వస్తాయని అంటున్నారు.
– వి. సురేశ్, కుంభఝరి, ఆదిలాబాద్ రూరల్ మండలం.