Hanging | సిరికొండ, జూన్ 22 : ఎంబీఏ విద్య పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు ఉద్యోగం లభించకపోవడం, ఉండడానికి సొంత ఇల్లు కూడా లేకపోవడంతో మానసికంగా బాధపడుతూ ఓ యువకుడు మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని గడ్కోల్ గ్రామానికి చెందిన దోమ్మటి నితిన్ గౌడ్ (27) తమ గ్రామంలో సొంత ఇల్లు లేకపోవడం, అలాగే ఎంబీఏ విద్య పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు ఉద్యోగం లభించకపోవడంతో మానసికంగా బాధపడుతూ ఉండేవాడని స్థానికులు తెలిపారు. కాగా సోమవారం లోంక గుడి కి వెళ్తున్నానని ఇంటి నుండి తన ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. అనంతరం లోంక తండా దాటిన తర్వాత రోడ్డుపై తన బైకు నిలిపి సమీప అటవీ ప్రాంతంలో టేకు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై రామకృష్ణ తెలిపారు.