మాచారెడ్డి, అక్టోబర్ 13 : పంట పొలంలోకి వచ్చిన కోతులను తరుముతుండగా ప్రమాదశవశాత్తు విద్యుత్ తీగ తగిలి ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం బండరామేశ్వర్పల్లిలో శనివారం చోటుచేసుకున్నది. ఎస్సై అనిల్ తెలిపిన వివరాల ప్రకారం.. బండరామేశ్వర్పల్లి గ్రామానికి చెందిన సినిగిరి రాజేశ్(16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
తమ పొలంలో కోతులు రాకుండా కావలి కోసం వెళ్లాడు. కోతులు రావడంతో వాటిని కర్రతో తరుముతుండగా పంట పొలంలో ఉన్న విద్యుత్ తీగ తగలడంతో షాక్ గురై అక్కడిక్కడే మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. రాజేశ్ తండ్రి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా వైద్యశాలకు తరలించినట్లు పేర్కొన్నారు.