నాగిరెడ్డిపేట,మే 29: ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రెండు రోజుల్లో తూకం వేయకుంటే రణ రంగం సృష్టిస్తామని స్పష్టం చేశారు. రెండు నెలులు గడుస్తున్నా రైతుల ధాన్యం తూకం వేయడం లేదని, కాంటా చేసినా ధాన్యాన్ని కేంద్రం నుంచి తరలించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండంలోని గోలీలింగాల్,జలాల్పూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు.
రైతుల సమస్యలను అడిగితెలుసుకున్నారు. రైతులు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయాలని ప్రభుత్వం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి కష్టమూ రాకుండా, రైతును రాజులా చూసిందన్నారు. ధాన్యం తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. అకాల వర్షం కారణంగా ధాన్యం బస్తాలు తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అత్యధికంగా వడ్లు పండించే మండలం నాగిరెడ్డిపేట్ అని పేర్కొన్నారు. ప్రజా పాలన పేరుతో రైతులను కాంగ్రెస్ ప్రభత్వం మోసం చేస్తున్నదని మండిపడ్డారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కేవలం సోషల్ మీడియాకే పరిమితమయ్యాడని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించిన దాఖలాలులేవన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలకు సరిపడా లారీలు పంపించి, ధాన్యాన్ని తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. జాజాల వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్ధయ్య, సొసైటీ చైర్మన్ నర్సింహులు, మాజీ చైర్మన్ రాజరెడ్డి, మాజీ జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి,మాజీ ఎంపీటీసీల ఫోరం అద్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ వంశీగౌడ్,నరేశ్, నారాయణ, దుర్గారెడ్డి, ఫరీద్, జయరాజ్ తదితరులు ఉన్నారు.