సిటీబ్యూరో, ఆగస్టు 17 ( నమస్తే తెలంగాణ ) : నగరంలో కాలుష్యం కట్టడి చేయడానికి ఈవీ వాహనాల వినియోగం పెంచాలని ప్రభుత్వం తాజాగా పెట్రో, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు ఒక్కో ఆటోపై 1.50లక్షల సబ్సిడీ ప్రకటించింది. అయితే ఈ ప్రకటన ప్రభుత్వానికి, ఆటో యూనియన్ నాయకుల మధ్య చిచ్చురేపింది. సబ్సిడీ నిర్ణయాన్ని ఆటో యూనియన్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. కాలుష్యం కట్టడి చేయాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉంటే ఇటీవల 40వేల ఆటో పర్మిట్లు ఎందుకు జారీ చేసింది? అందులో 20వేల ఎల్పీజీ ఆటోలను ఎందుకు విక్రయించిందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. రూ. 200 కోట్లతో 18వేల ఆటోలను ఈవీలుగా మారుస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
అయితే ఆ 18వేల ఆటోల్లో అత్యధిక భాగం ఇప్పుడు లేవని ఆటో యూనియన్ నాయకులు చెబుతున్నారు. అందులో కొన్ని ఈఎంఐలు చెల్లించలేక ఫైనాన్సియర్లు లాక్కున్నారని, కొన్ని పూర్తిగా పాడైపోయి ఉన్నాయని పేర్కొన్నారు. మరికొన్ని గ్యాస్ బండ్లుగా ఎప్పుడో కన్వర్ట్ చేసుకున్నారని.. అయితే రవాణా శాఖ లెక్కల ప్రకారం ఆ బండ్లు ఇంకా పెట్రోల్, డీజిల్ ఆటోలుగానే ఉన్నాయని వివరించారు. ఆ బండ్లు కేవలం కాగితాల్లోనే ఉన్నాయని విమర్శించారు. మరోవైపు ఈవీలను ప్రోత్సహించాలనుకుంటే నిబంధనలకు ఎందుకు పెట్టడం అని నిలదీశారు. ఎవరైనా ఈవీ ఆటో కొనుగోలు చేయాలనుకుంటే స్వేచ్ఛగా కొనుగోలు చేసేలా ఉండాలని డిమాండ్ చేశారు. ఇందులో ఫైనాన్సియర్లు, దళారులు అంతా కలిసి ఈవీ వాహనాల కొనుగోలు పెరగకుండా కుట్రకు తెరలేపుతున్నారు.
ఎందుకంటే ఎల్పీజీ గ్యాస్ ఆటోలపైనే వారికి ఆదాయం భారీగా వస్తుంది. దీంతో వాళ్లు ఈవీ మార్కెట్‌ను శాసిస్తున్నారని ఆరోపించారు. ఫైనాన్షియర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈనెల 23న నిరవధిక సమ్మెకు దిగ్గుతున్నట్టు జేఏసీ ప్రకటించింది. ఆటో మీటర్ ఛార్జీలు పెంచాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏడాదికి రూ.12వేలు ఎక్కడా? ఈవీలను ఆర్టీసీకి అనుసంధానం చేస్తే ఎలా? ఆటో డ్రైవర్ల ఉపాధి పోతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉచిత బస్సుతో రాష్ట్రంలో 210 మంది డ్రైవర్లు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓలా, ర్యాపిడో వాహన ఆధారిత యాప్‌ను రద్దు చేసి ప్రభుత్వమే యాప్ తీసుకొని డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.