కోటగిరి, మార్చి 3 : యాసంగి సాగు కష్టతరంగా మారింది. నిజాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు కింద సాగవుతున్న వరి పంటకు నీళ్లు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు పుష్కలంగా ఉండడం, సాగునీటికి డోకా ఉండదని భావించిన పొతంగల్ మండలం కొల్లూర్ శివారులో రైతులు వరి పంటలను సాగు చేశారు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో చివరి ఆయకట్టు పంటలకు నిజాంసాగర్ కాలువ నీరు అందకపోవడంతో పొట్ట దశలో ఉన్న వరి పంట ఎండిపోతున్నది. కళ్లెదుటే ఎండిపోతున్న పంటను చూసి రైతులు గుండెలు బాదుకుంటున్నారు. సాగునీరు అందించాలని కొల్లూర్ రైతులు పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కొల్లూర్ శివారులో బర్ల గంగారాం, బర్ల నాగేశ్ అనే రైతులు వరి పంటను సాగు చేశారు. కానీ నిజాంసాగర్ కాలువ నీరు విడుదల చేసి పదిరోజులు గడుస్తున్నా, ఇప్పటి వరకు వరి పంటకు ఒక చుక్క నీరు కూడా అందలేదని వాపోయారు. వరి పంట పొట్ట దశలో ఉన్నదని, మందులు చల్లుదామంటే కూడా చుక్క నీరు లేదంటున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరి పంటలకు నీరు అందించి కాపాడాలని రైతులు కోరుతున్నారు.
నాకు ఉన్న ఐదెకరాల్లో వరి పంటను సాగుచేసిన. నిజాంసాగర్ కాలువ నీరు అందక పొలంలో పర్రెలు వచ్చినయ్. కలుపు కూడా తీయడానికి వస్తలేదు. కూలీలు కొడవలితో కలుపు మొక్కలను కోస్తున్నారు. పొలంలో చుక్క నీరు లేక మందులు కూడా చల్లలేదు. నిజాంసాగర్ కాలువపై భాగంగా ఉన్నవారు కిందకి రాకుండా అడ్డు వేసి మా పొలాలకు నీరు రాకుండా చేస్తున్నరు. పొలం నుంచి కాలువ వరకు రూ. 25 వేలు ఖర్చు పెట్టి పైపులు వేసినా, నీరు అందడం లేదు. పొట్ట దశలో ఉన్న వరి పంటకు నీరు అందకుంటే ఎండిపోయేటట్టు ఉన్నది. అప్పులు ఎలా తీర్చాలి..?మా గోడు ఎవరికీ పట్టదా.?
కొల్లూర్ శివారులో రెండున్నర ఎకరాల్లో వరి పంట సాగు చేసిన. కానీ పంటకు ఇప్పటి వరకు చుక్క నీరు కూడా అందలేదు. వరి పొట్ట దశలో ఉన్నది. నీరు అందడం లేదని పలుమార్లు అధికారులకు విన్నవించినా మా గోస ఎవరికీ పట్టడం లేదు. నిజాంసాగర్ కాలువ నీరు వదిలి 10 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు చివరి ఆయకట్టు వరకు అందడం లేదు. మా పంటలకు నీరు అందకుండా కాలువ మూసేశారు.