సిరికొండ, మార్చి 28: యాసంగి సాగు భారంగా మారింది. సాగునీరందక పంటలు ఎండిపోతుండడం రైతులను కలిచివేస్తున్నది. బోరుబావుల మీద ఆధారపడిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పొలాల్లో వేసిన బోర్లు వట్టిపోతున్నాయి. దీంతో సాగుచేసిన పంటలు సగానికి సగం ఎండిపోగా ప్రస్తుతం చివరి తడులకు వచ్చేసరికి వాటిని కూడా కాపాడుకోలేని దీనస్థితి ఏర్పడింది. ఇప్పటికే మండలంలోని చాలా ప్రాంతాల్లో భూగర్భజల వనరులు పడిపోయి నీరందక పంటలు ఎండిపోయాయి.
ఉన్న కొద్దిమేర పంటలనైనా దక్కించుకోవాలన్న తపనతో సాగునీటి కోసం నానా కష్టాలు పడుతున్నారు. రూ.లక్షలు ఖర్చుచేసి ఐదు నుంచి ఆరు వందల ఫీట్ల వరకు బోర్లు తవ్విస్తున్నా.. చుక్క నీరు పడడం లేదు. కండ్ల ఎదుటే పచ్చని పంట పొలాలు ఎండిపోతుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు రైతులు ఖర్చుకు సైతం లెక్క చేయకుండా వాటర్ ట్యాంకులతో నీళ్లు లభించే సుదూర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి పొలాలకు చివరి తడులు అందిస్తూ పంటను గట్టుకు ఎక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఎండిన పంట పశువుల పాలవుతున్నది. ప్రభుత్వం ఎండిన పంటలకు పరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న వరి పందిమడుగు గ్రామానికి చెందిన మలావత్ మహిపాల్ చెందినది. తనకున్న మూడెకరాల్లో వరి సాగు చేయగా.. 20 రోజుల నుంచి బోరుబావుల్లో నీరు సరిగా రావడం లేదు. దీంతో పంట ఎండిపోతున్నది. రూ.60వేల వరకు అప్పు చేసి మూడు బోరుబావులు తవ్వించినా చుక్కనీరు రాలేదు. ఎండిన వరిపైరు పశువులకు మేతగా మారింది.
పక్క చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు మలావత్ ప్రవీణ్. పందిమడుగు గ్రామానికి చెందిన ఆయన ఏడు ఎకరాల్లో సన్నరకం వరిని సాగు చేశారు. రెండు తడులు అందిస్తే పంట చేతికొచ్చేదశలో నీరందక పూర్తిగా ఎండిపోయింది. రూ.లక్షలు ఖర్చు చేసి నాలుగు బోర్లు తవ్వించినా.. ఫలితం లేకుండా పోయింది. సాగుకు పెట్టుబడి, పంటను కాపాడుకోవడానికి తవ్వించిన బోరు బావుల ఖర్చుతో అప్పుల పాలైనట్లు ఆందోళన చెందుతున్నాడు.