సారంగాపూర్, అక్టోబర్ 23: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. కాంగ్రెస్ ఇస్తామన్న రూ.4 వేల పింఛన్ ఎప్పుడిస్తారని మహిళల నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. బుధవారం నియోజకవర్గంలోని కొత్తపేట గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయనకు మహిళల నుంచి నిరసన సెగ తగిలింది.
కొత్తపేట గ్రామంలో రూ.13లక్షలతో నిర్మించిన సొసైటీ గోదాం ప్రారంభోత్సవంతో పాటు రూ.20 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే గ్రామానికి వచ్చారు. ప్రారంభోత్సవం అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశామన్నారు.
ఈ క్రమంలో మహిళలు ఒక్కసారిగా ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ఇస్తామని చెప్పిన రూ.4 వేల పింఛన్ ఏమైందని నిలదీశారు. గ్యాస్ పైసలు కూడా ఖాతాల్లో పడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.500లకే గ్యాస్ ఇస్తామని చెప్పారని, కానీ ఖాతాల్లో రూ.40 నుంచి రూ.60 మాత్రమే పడుతున్నాయన్నారు. స్పందించిన ఎమ్మెల్యే.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇంటింటికీ కరెంట్ సరఫరా చేస్తున్నామని గుర్తుచేశారు. త్వరలో రూ.4 వేల పింఛన్ ఇస్తామని, ఆందోళన వద్దని భూపతిరెడ్డి మహిళలకు సర్దిచెప్పారు.