ధర్పల్లి, నవంబర్ 24 : నిరుపేదలమైన తమకు కూడా డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేయాలని మహిళలు ఆందోళనకు దిగిన ఘటన ధర్పల్లి మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకున్నది. ధర్పల్లి మండల కేంద్రంలోని భీమ్గల్ రోడ్డులో ఉన్న 48 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి హాజరై పలువురికి ఇండ్ల పట్టాలు అందజేశారు.
అయితే సభకు హాజరైన పలువురు మహిళలు తమకు ఇండ్లు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేద మహిళలమైన తమకు కూడా ఇండ్లు ఇవ్వాలని నినాదాలు చేస్తూ సభను అడ్డుకునేందుకు యత్నించారు. అక్కడే ఉన్న మహిళా పోలీసులు వారిని అడ్డుకొని వారించారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అందరికీ ఇవ్వాలని తమకు ఆలోచనా ఉన్నా ఇవ్వలేకపోతున్నామని, ఎలాంటి ఆందోళన చెందవద్దని.. ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో తాగునీటి సౌకర్యం లేదని, సమస్య పరిష్కరించాలని నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.