భీమ్‌గల్, జూలై 19: తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మండలంలోని గోన్‌గొప్పుల్ గ్రామంలో ఇందిరమ్మ కాలనీ, రాంసింగ్ తండాకు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో శనివారం నిరసన తెలిపారు. ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో రెండు గంటలపాటు ఆందోళన చేపట్టారు. కార్యదర్శి, ప్రత్యేకాధికారి ఎవరూ స్పందించకపోవడంతో ప్రధాన కూడలి వద్దకు చేరుకొని రాస్తారోకో నిర్వహించారు. దీంతో భీమ్‌గల్, ధర్పల్లి వైపు వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
రాస్తారోకో విషయం తెలుసుకున్న ముగ్గురు మిషన్ భగీరథ ఏఈలు, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి, స్పెషల్ ఆఫీసర్, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తాగునీటి సమస్యను రెండురోజుల్లో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. పాత ట్యాంకులో నీరు నింపితే కూలిపోయే ప్రమాదం ఉన్నదని, దీనికి బాధ్యత తీసుకుంటామని కాలనీవాసులు రాసివ్వాలని అధికారులు కోరగా..దీనికి మహిళలు ససేమిరా అన్నారు. దీంతో తామే బాధ్యత తీసుకుని నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
మోర్తాడ్/భీమ్‌గల్, జూలై 19: గోనుగొప్పుల్లో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కిన విష యం తెలుసుకున్న మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి స్పందించారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈకి ఫోన్‌చేసి నీటిసమస్యను వెంటనే పరిష్కరించాలని సూచించారు. గ్రామంలోని వాటర్‌ట్యాంకు శిథిలావస్థకు చేరుకున్నదని, కొత్త ట్యాంకు నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.