డిచ్పల్లి (ఇందల్వాయి), మార్చి 1: నీటి ఎద్దడి తీర్చాలని కోరుతూ ఇందల్వాయి మండలంలోని మెగ్యానాయక్ తండా మహిళలు శనివారం ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తంచేశారు. తండాలోని దేవిగల్లీలో బోరు మోటరు చెడిపోవడంతో పది రోజులుగా తాము నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తంచేశారు.
తాగడానికి నీరు లేక చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని తెలిపారు. నీటి సమస్యను పరిష్కరించాలని పలుమార్లు పంచాయతీ సిబ్బందికి విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. వేసవిలో ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరుమోటరును రిపేరు చేయించి, నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు.