ధరణి తీసేయడం అంటే రెవెన్యూ వ్యవస్థను తిరిగి అస్తవ్యస్థం చేయడమే అవుతుంది. సీఎం కేసీఆర్ దయతో రూపాయి ఖర్చు లేకుండా పాస్ పుస్తకాలు వచ్చాయి. లక్షలాది మంది రైతులకు ఎంతో ధైర్యం వచ్చింది. ఆపదకు సొంత భూమిని అమ్ముకోవాలన్నా.. కొనాలన్నా ఇప్పుడు చాలా తేలిక అయ్యింది. ఇంతమంచి సౌలతును కాంగ్రెసోళ్లు తీసేయడం అంటే మళ్లీ లంచాలకు తెరతీయడమే అవుతుంది. అసలు ధరణిని తీసివేయాలని రైతులెవరైనా చెప్పారా? కాంగ్రెస్ నేతలు వారి స్వలాభం కోసం మాట్లాడడం తప్పా మరేం లేదు.
ధరణి పోర్టల్‌తో తహసీల్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వెంటనే పూర్తవుతుంది. క్రయ, విక్రయదారు వేలిముద్రల ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తయి పట్టా పాస్‌బుక్‌లోకి పేరు నమోదు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని తీసేసి భూమాత పోర్టల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో అయోమయం నెలకొన్నది. కౌలుదారులు, అనుభవదారుల కాలమంటూ మళ్లీ పరిస్థితి మొదటికొస్తుంది. పటేల్, పట్వారీ వ్యవస్థను తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. మళ్లీ భూసమస్యలు తలెత్తుతాయి.
కాంగ్రెస్ వస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామనడం విడ్డూరంగా ఉన్నది. గతంలో రైతులు పడిన కష్టాలు మళ్లీ వస్తాయి. కాంగ్రెస్ తెచ్చే భూమాత పోర్టల్‌తో తగాదాలు, కొట్లాటలు పెరుగుతాయి. రికార్డుల్లో పేర్లు మార్పులు, చేర్పులతో గొడవలు మొదలవుతాయి. ధరణి పోర్టల్ రద్దుతో దళారుల ప్రమేయం పెరుగుతుంది. రైతులకు భూసమస్యలు ఎక్కువతాయి. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చిన తర్వాత భూసమస్యలు తగ్గిపోయాయి. రైతులకు కార్యాలయాల చుట్టూ తిరిగే బాధలుపోయాయి. ధరణి పోర్టల్‌తోనే రైతుల భూములకు రక్షణ ఉంటుంది.
రెంజల్, నవంబర్ 20: కాంగ్రెసోళ్లు భూముల విషయంలో మునుపటి లెక్కనే చేస్తామంటున్నరు. గట్లయితే రైతులకు మళ్లీ గోస తప్పదు. రైతులు జర ఆలోచించాలె. భూముల విషయంలో ధరణే మంచిది. గతంలో రైతుల భూముల గుట్టు మొత్తం పట్వారీల దగ్గరే ఉండేది. కోడి అడిగితే ఇయ్యకుంటే కూడా భూ రికార్డుల్లో పేరు మార్చేటోళ్లు. డబ్బులిస్తే ఒకరి భూమిని ఇంకొకరికి రాస్తుండే. గిసొంటి లెక్కలన్నీ పట్వారీలు చేసేటోళ్లు. కానీ కేసీఆర్ సార్ సీఎం అయ్యాక ధరణి తీసుకువచ్చిండు. ధరణితో పైసాలు మస్త్ తక్కువైనయ్. జాగ ఇప్పుడు పట్టేదార్లు పోయి బొటనవేలు పెట్టనిదే భూమి ఎవ్వరి పేరుమీదకూ మారదు. మాయమాటలు చెప్పే కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే మళ్లీ భూముల విషయంలో గోస పడకతప్పదు.
శక్కర్‌నగర్, నవంబర్ 20: నాకున్న కొంత భూమిని ఇటీవల విక్రయించాను. అయితే, ఇంతకు మునుపు పొలాలు అమ్మాలంటే నెలల తరబడి రిజిస్ట్రేషన్ కార్యాలయం, తహసీల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. పట్టా మార్పిడికి కార్యాలయాల చుట్టూ తిరిగినా పనిఅయ్యేది కాదు. గతంలో అమ్మిన పొలాలకు చెందిన పలువురి యాజమానుల పేర్లు తొందరగా మారకపోతుండె. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నిమిషాల వ్యవధిలో పట్టాతోపాటు ఆన్లైన్లో యజమానుల పేర్లు మారుతున్నాయి. ఇంత మంచి వ్యవస్థ అయిన ‘ధరణి’ని రద్దు చేస్తామనడం శోచనీయం. ప్రశాంతంగా సాగుతున్న ఈ ప్రక్రియను గందరగోళ పరిస్థితిలోకి నెట్టేందుకు చర్యలు చేపట్టడం పద్ధతి కాదు. రైతులు ఇలాంటి విషయాల్లో తీవ్ర ఆందోళనకు గురవుతారు.
కోటగిరి నవంబర్ 20: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌తో అవినీతికి తావు లేకుండా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. రెవెన్యూ వ్యవస్థలో వీఆర్వోలను తొలగించి ధరణి అనే పోర్టల్‌ను సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు. సులభమైన ఆన్లైన్ పద్ధతిలో స్లాట్ బుక్ చేసుకొని పదే పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి రావడానికి అనేక మాయమాటలు చెబుతూ ధరణి పోర్టల్ స్థానంలో భూమాత తీసుకొస్తామని చెప్పడం సిగ్గుచేటు.
కోటగిరి నవంబర్ 20: గత ప్రభుత్వాల హయాంలో లంచాలు ఇవ్వనిదే.. పట్టా మార్పిడి అయ్యేది కావు. దాని నుంచి రైతులకు విముక్తి కల్పించేందుకు సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారు. మళ్లీ కాంగ్రెస్ వస్తే ధరణిని తీసేసి పాత పద్ధతి మాదిరిగా పటేల్, పట్వారీల వ్యవస్థను తీసుకొస్తాం అంటున్నది. దీంతో అంతా దాచుకోవడం, దోచుకోవడమే అవుతుంది. రికార్డుల్లో భూ యజమాని పేరు మాత్రమే ఉండాలి. అలాగైతేనే అతనికి స్వేచ్ఛ.. భూమికి భద్రత. భూమి ఒకరిదైతే రికార్డుల్లో మరో కాలం పెట్టుడు ఎందుకు? ఇద్దరి మధ్య కిరికిరి పెట్టుడెందుకు..? ధరణిని తీసివేస్తామని రైతుల దగ్గరికి వచ్చి చెప్పండి అప్పుడు తెలుస్తుంది.
సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ పెట్టి రైతులకు ఖర్చు లేకుండా పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చారు. కాంగ్రెస్ మళ్లీ ధరణి తీసివేసి భూమాత పోర్టల్ పెడతామని చెబుతున్నది. ఇందులో కౌలుదారులు, అనుభవదారుల కాలంలో పెడతామని చెప్పడం సరికాదు. కౌలుదారులను అనుభవదారుల కాలంలో పెడితే రైతుబంధు డబ్బులు మొత్తం కౌలుదారులకు వెళ్తాయి. ప్రస్తుతం భూమి హక్కు రైతులకు ఉన్నప్పటికీ భూమాత పోర్టల్‌తో రైతులకు భద్రత లేకుండా పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతాంగానికి నష్టం జరిగే పరిస్థితి ఏర్పడుతుంది.
శక్కర్‌నగర్, నవంబర్ 20: ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలు రైతులను ఇబ్బందులకు గురిచేసేలా ఉన్నాయి. రైతులకు ఎంతో సౌలభ్యంగా మారిన ‘ధరణి’ పోర్టల్‌ను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చెప్పడం వారి మూర్ఖపు ఆలోచనలకు నిదర్శనం. గతంలో మాదిరి మధ్యవర్తిత్వం, రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ, దస్తావేజులేఖరుల చుట్టూ తిరిగే పనిలేకుండా పోయింది. భూముల క్రయవిక్రయాల్లో అమ్మకందారులు, కొనుగోలుదారులకు పూర్తిస్థాయిలో పట్టాల మార్పిడితోపాటు పూర్తి హక్కులు క్షణాల్లో పొందుతున్నాం. ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్లు, భూములకు చెందిన వివరాలను నిక్షిప్తం చేయడంతో ఏండ్ల కాలంగా ఉన్న పెండింగ్ సమస్యలకు పరిష్కారం కేవలం ‘ధరణి’తో లభించింది. ఇలాంటి ‘ధరణి’ని రద్దు చేస్తామని చెప్పడం కాంగ్రెస్ నేతల అనాలోచిత చర్యలకు నిదర్శనం.