Vishnu Vinyasam | టాలీవుడ్ యంగ్ హీరో, ‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ శ్రీవిష్ణు ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘విష్ణు విన్యాసం’ ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా రన్‌టైమ్ కేవలం 1 గంటా 59 నిమిషాలు మాత్రమే ఉంటుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించడంతో ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సాధారణంగా కామెడీ ఎంటర్టైనర్లకు తక్కువ రన్‌టైమ్ ఉండటం పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని, ఇది ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టించకుండా కథలో లీనమయ్యేలా చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక సినిమా కంటెంట్ విషయానికొస్తే, ఫస్ట్ హాఫ్ మొత్తం యువతను ఆకట్టుకునేలా యూత్‌ఫుల్ ఎంటర్టైన్మెంట్తో సాగుతుందని, సెకండ్ హాఫ్ మాత్రం హృదయానికి హత్తుకునే ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుందని శ్రీవిష్ణు స్వయంగా వెల్లడించారు. ఇప్పటికే ‘సామజవరగమన’, ‘ఓం భీమ్ బుష్’ వంటి బ్లాక్బస్టర్లతో మంచి ఫామ్‌లో ఉన్న శ్రీవిష్ణు, మరోసారి అదే తరహా వినోదాత్మక చిత్రంతో రాబోతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరో విశేషమేమిటంటే, అదే రోజు విడుదల కావాల్సిన ఆయన మరో సినిమా ‘మృత్యుంజయ్’ మార్చి 6కి వాయిదా పడటంతో ‘విష్ణు విన్యాసం’ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద సొంత పోటీ తప్పి సోలో రిలీజ్ దక్కినట్లయింది. వాస్తు పిచ్చి ఉన్న ఓ యువకుడి కథాంశంతో సాగే ఈ వినోదాత్మక చిత్రం శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్ చేరుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.