నిజామాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమార్కులు బరి తెగించారు. అడ్డూ అదుపు లేకుండా ఏడాది కాలంగా సహజ వనరులను దోపిడీ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలెవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రజాపాలనలో దోపిడీకి చరమగీతం పాడుతామని ఘనంగా ప్రకటనలు చేసినప్పటికీ అవేవి ఆచరణలో కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఇన్చార్జీ మంత్రిగా జూపల్లి కృష్ణారావును నియమితులయ్యారు.
ఏడాది కాలంగా ఈ ప్రాంతానికి మంత్రి లేకపోవడంతో ఇన్చార్జీ మంత్రి ఒక్కరే అన్నింటికీ పెద్ద దిక్కుగా కొనసాగుతున్నారు. ఇందులో భాగంగా తన తొలి పర్యటనలో మంజీరా పరివాహక ప్రాంతాల్లో జూపల్లి పర్యటించారు. ఇసుక అక్రమాలను చూస్తూ ఊరుకోబోమంటూ ఘనంగా ప్రకటించారు. గతంలో దోపిడీ జరిగిందంటూ వ్యాఖ్యానాలు చేస్తూనే, భవిష్యత్తులో ప్రజలకు ఉపయుక్తమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడంతటా ఇసుక అక్రమ వ్యాపారం మూడు టిప్పర్లు, ఆరు ట్రాక్టర్లు అన్నట్లుగా నడుస్తున్నది. వాగులు, వంకలు, నదులు ఇలా ఏదీ తేడా లేకుండా ఇసుకను కాంగ్రెస్ పార్టీ నేతల అండదండలతో ఇసుకాసురులు కొల్లగొడుతున్నారు. కట్టడి చేయాల్సిన యంత్రాంగం చేష్ట్టలుడిగి చూస్తూ ఉండిపోతున్నది. నిజామాబాద్ జిల్లా పర్యటనకు ఆదివారం వస్తున్న ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు.. భూగర్భ వనరుల దోపిడీని అరికట్టాలని ఉమ్మడి జిల్లా ప్రజలు వేడుకుంటున్నారు.
వాగులు గుల్లా..
మంజీరా నదితోపాటు వాగులను సైతం కాంగ్రెస్ నేతలు కొల్లగొడుతున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో కప్పల వాగు, పెద్ద వాగులో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. జాతీయ రహదారి మీదుగానే వందల ట్రాక్టర్లు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన బాల్కొండ నియోజకవర్గంలోనే ఇసుక వ్యాపారం జోరుగా సాగుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడు కరువయ్యారు. టీజీఎండీసీ చైర్మన్ హోదాలో అనిల్ ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
సర్కారు ఆధీనంలో ఇసుక వ్యాపారం అధికారికంగా నిర్వహిస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని గుర్తు చేస్తున్నారు. అలాంటి ఆలోచనలకు బీజం వేయాలని కాంగ్రెస్ పార్టీలోని మరో వర్గం సైతం విన్నవిస్తున్నది. ఇలాంటి దోపిడీ వల్ల ప్రజల్లోనూ పార్టీకి చెడ్డ పేరు వస్తున్నదని ఆ పార్టీ శ్రేణులే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బోధన్ నియోజకవర్గంలోనూ ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా నడుస్తున్నది. గోదావరి నదికి వరదను మోసుకొచ్చే వాగుల నుంచి పెద్ద ఎత్తున ఇసుక కొల్లగొడుతున్నారు. మంజీరా పరీవాహకంలో జరుగుతున్న దోపిడీకి దీటుగా వాగుల్లోనూ ఇసుక తరలింపు నడుస్తున్నది. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రి జూపల్లి ఇసుక అక్రమ దందాపై సమీక్ష చేసి సహజ సంపద దోపిడీని అరికట్టి, సర్కారుకు వచ్చే ఆదాయ మార్గాలను కాపాడాలని ఉమ్మడి జిల్లా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
అంతా జీరో దందానే..
బీఆర్ఎస్ హయాంలో ఇసుక దోపి డీ జరిగిందంటూ గతంలో కాంగ్రెస్ పెద్దలు వ్యాఖ్యానించారు. కానీ ఆ సమయంలో అధికారికంగా టీజీఎండీసీ ద్వారా క్వారీలను నిర్వహించారు. క్వారీల్లో ప్రతి లోడ్‌కు నిర్ణీత రుసుమును సర్కారుకు చెల్లించారు. నిరంతర తనిఖీలతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు నాటి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కానీ ఇప్పుడు క్వారీలు మూసేశారు. మంజీరాలో కొత్తగా ఎలాంటి అనుమతులను ఇవ్వడం లేదు. అధికారికంగా అనుమతులు లేకున్నప్పటికీ ఇసుక తవ్వకాలు ఆగలేదు. ఏడాది కాలం గా అక్రమ వ్యాపారం జోరుగా కొనసాగుతున్నది. మంజీరా నదిలో రాత్రి, పగలు తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వేస్తున్నారు.
నదీ గర్భం నుంచి ఇసుకను తోడుతున్న అక్రమార్కులు ప్రభుత్వానికి పైసా కట్టడం లేదు. ఫలితంగా సర్కారు ఆదాయానికి భారీగా గండి పడుతున్నది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నోరు మెదపడం లేదు. గత సర్కారుపై లేనిపోని ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు కండ్ల ముందరే జీరో దందా నడుస్తున్నప్పటికీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఇసుక అక్రమ వ్యాపారం జరుగుతుండడంతో యంత్రాంగం చేష్టలూడిగి చూస్తున్నది. గతంలో అధికారికంగా క్వారీలు నిర్వహించినప్పుడు స్థానిక గ్రామ పంచాయతీలకు సైతం అందులో నుంచి వాటాగా నిధులు సమకూరేవి. కానీ ఇప్పుడు అక్రమార్కుల దోపిడీతో గ్రామాల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోంది. మొత్తం సొమ్మంతా కాంగ్రెస్ అనుచరుల జేబుల్లోకే వెళ్తుండడం విశేషం.