నిజామాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అంతరించి పోతున్న చీతాలను పరిరక్షించేందుకు ప్రాజెక్ట్ చీతాను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. నమీబియా దేశం నుంచి ఎనిమిది చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఉంచి సంరక్షణ చర్యలు చేపట్టింది. 1952లో చీతాలు(లార్జ్ వైల్డ్ క్యాట్) అంతరించిపోగా 2022 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వం పునరుద్ధరణకు పూనుకుంది. ఇందుకోసం రూ.వందల కోట్లు వెచ్చిస్తున్నది. సీన్ కట్ చేస్తే.. లార్జ్ వైల్డ్ క్యాట్ జాతుల్లో మరో రకమే లియోపార్డ్. దీనిని తెలంగాణలో చిరుతపులిగా పిలుస్తుంటారు.
విపరీతమైన సంతానోత్పత్తిని కలిగిన చిరుతలకు ప్రస్తుతం తెలంగాణలో రక్షణ కరువైంది. చీతాలను ఇతర దేశాల నుంచి తీసుకువచ్చి రక్షిస్తుండగా, తెలంగాణలోని చిరుతలు చచ్చిపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. అటవీ శాఖ అధికారుల మొద్దు నిద్దురకు తోడు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్లక్ష్యం తోడు కావడంతో.. ఎన్‌హెచ్ 44 చిరుతలకు మృత్యుమార్గంగా మారింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సరిహద్దులోని మంచిప్ప అభయారణ్యంలోని 44వ జాతీయ రహదారి వాటికి డెత్ స్పాట్‌గా పేరొందింది. జింకలు, ఎలుగుబంట్లు, చిరుతలు, ఇతర అరుదైన జంతుజాలం రోడ్డు ప్రమాదాలతో మృత్యువాత పడుతుండడం తీవ్రంగా కలిచి వేస్తున్నది.
తెలంగాణలో 2018లో జంతువుల గణన చేపట్టారు. 2022లో రాష్ట్రంలోని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో జంతు గణన నిర్వహించగా పాద ముద్రల గుర్తింపు ద్వారా చిరుతల సంచారం పెరిగిందని నిర్ధారణకు వచ్చారు. అడవుల్లో కలియ తిరిగిన సంబంధిత సిబ్బందికి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. క్రూర మృగాలతో పాటుగా విభిన్నమైన పక్షిజాతులు సైతం అడవుల్లో దర్శనం ఇస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా చిరుత పులుల సంఖ్య గతం కంటే పెరిగిందని స్పష్టమైంది. దాదాపుగా 55 చిరుత పులులున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎలుగుబంట్లు, నక్కలు, జింకలు, సాంబార్, కొండ గొర్రెలు, దుప్పిలు, నీల్గాయి, తోడేళ్లు, మనుబోతులు, అడవి కుక్కలు, కుందేళ్లు, అడవి పిల్లులు, అడవి పందులు వందల సంఖ్యలో ఉన్నాయి. క్షేత్ర పర్యటనల్లో వీటి జాడ అధికంగా తారస పడుతున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేయడం, హరితహారం రూపంలో మొక్కలను పెంచడం, అడవిని సంరక్షించుకునేందుకు చర్యలు చేపట్టడం ద్వారా మూగ జీవాలకు రక్షణ లభించి క్రమంగా చిరుతల సంతానోత్పత్తి పెరిగింది.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో చిరుతలు రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నాయి. 44వ జాతీయ రహదారి దాటే క్రమంలో రాత్రి వేళల్లోనే ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మూగ జీవాల రక్షణ కోసం ఎన్‌హెచ్ 44పై అండర్ పాస్‌లు నిర్మించాలని, ఫెన్సింగ్ ఏర్పాటు కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖలు రాశాం. కానీ వారి నుంచి స్పందన రాలేదు. ఇకపై జంతువుల ప్రాణాలను కాపాడేందుకు తగు చర్యలు తీసుకుంటాం.
నిజామాబాద్ – కామారెడ్డి జిల్లాల సరిహద్దులోని మంచిప్ప రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వెళ్తున్న 44వ జాతీయ రహదారిపై చిరుతలు(లియోపార్డ్) వరుసగా మృతి చెందుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. మంచిప్ప రిజర్వ్ ఫారెస్ట్, సిర్నాపల్లి అటవీ ప్రాంతాల కలయికను, అలాగే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలను సైతం దగ్గి, చంద్రాయణ్పల్లి వేరు చేస్తుంది. ఇక్కడ విస్తరించిన దట్టమైన అటవీ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగి పోయాయి. అడవులను నరికి వేయడంతో పాటు వన్య ప్రాణులను వేటాడడం తరచూ ఇక్కడ జరుగుతున్నది. జంతువులు రాత్రివేళల్లో జాతీయ రహదారి దాటుతూ ప్రమాదాలకు గురవుతున్నాయి. భారీ వాహనాలను నియంత్రించలేక అడ్డొచ్చిన మూగ జీవాలను వాహనదారులు ఢీకొట్టేసి వెళ్లిపోతున్నారు. ఫలితంగా విలువైన జంతురాశి ప్రమాదంలో పడుతున్నది. 44వ జాతీయ రహదారిపై ఇప్పటివరకు 10 వరకు చిరుతలు రోడ్డు ప్రమాదంలో చనిపోయాయి. వీటికి తోడు జింకలు, ఎలుగుబంట్లు సైతం ప్రాణాలు వదిలాయి. వేటగాళ్ల ఉచ్చుకూ వన్యప్రాణులు బలవుతున్నాయి. ఫలితంగా వాటికి రక్షణ కరువైంది.