Kotagiri | కోటగిరి, మే 12 : నిజామాబాద్ జిల్లా పోతంగల్ విశాల సహకార సంఘం పరిధిలోని హెగ్డోలి గ్రామంలో గల విక్రయ కేంద్రానికి రైతుల తాళం వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పుప్పాల శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ తమకు అవసరం లేని నానో యూరియా లిక్విడ్ అంట కడుతున్నారని దీంతో రైతులపై భారం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తీసుకున్న లిక్విడ్ అలాగే మిగిలిపోయి ఉందని, మూడు సంచుల ఎరువులు తీసుకుంటే ఒక లిక్విడ్ బాటిల్ తీసుకోవాలని, కండిషన్ పెట్టడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లిక్విడ్ తీసుకోవడం వల్ల రైతులపై అదనపు భారం పడుతుందని ఇప్పటికే మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వాపోయారు.
రైతులకు అవసరం ఉంటేనే ఇవ్వాలి : ఏవో
రైతుల నిరసన చేసిన అంశం పై పోతంగల్ మండల వ్యవసాయ అధికారిణి నిశిత ను వివరణ కోరగా రైతులకు అవసరం ఉంటేనే ఇవ్వాలని అనవసరంగా నానో యూరియా ఇవ్వకూడదని సహకార సంఘం వాళ్లకు చెప్పామని తెలిపారు. సహకార సంఘం వాళ్లను అడిగితే రైతులు లిక్విడ్ తీసుకోకుంటే స్టాక్ తిరిగి రిటర్న్ చేస్తామని చెప్పారని ఆమె తెలిపారు. నిరసన తెలిపిన వారిలో రైతులు పుప్పాల శ్రావణ్ కుమార్, భరత్, అర్జున్ సురేందర్, ప్రవీణ్, ఆంజనేయులు, వినయ్, అశోక్, రుక్మయ్య తదితరులు పాల్గొన్నారు.