హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రస్థాయి ఉత్తమ వార్తా ఫొటోగ్రఫీ పోటీలు 2026లో ‘నమస్తే తెలంగాణ’ ఫొటోగ్రాఫర్లు సత్తా చాటారు. 187వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురసరించుకుని తెలంగాణ రాష్ట్ర ఫొటోజర్నలిస్టుల సంఘం(టీఎస్‌పీజేఏ) పోటీలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుంచి దాదాపు 102 ఎంట్రీల ద్వారా 306 ఛాయాచిత్రాలు వచ్చాయి. ‘నమస్తే తెలంగాణ’ ఫొటోగ్రాఫర్లు గోపీకృష్ణ, జీ శ్రావణ్‌కుమార్ బతుకు చిత్రాన్ని కండ్లకు కట్టేలా తీసిన ఫొటోలకు కన్సోలేషన్ బహుమతులు దక్కాయి. ప్రముఖ సంపాదకులు దేవులపల్లి అమర్, తెలంగాణకు చెందిన ఛాయాగ్రాహకుడు, నటుడు కొమ్మిడి విశ్వేందర్ రెడ్డి, ఏపీకి చెందిన ప్రముఖ ఛాయాగ్రాహకులు కమలాసుధాకర్రెడ్డితో కూడిన జ్యూరీ సభ్యులు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేశారు. ఫొటో జర్నలిస్టుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసి, వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రతిఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనుమళ్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి కేఎన్ హరి తెలిపారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో ఆదివారం వారు విజేతల వివరాలను వెల్లడించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతోపాటు పది మందికి కన్సోలేషన్ బహుమతులు ప్రకటించారు. ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో రాష్ట్ర స్థాయి ఉత్తమ వార్తా చిత్రాల ప్రదర్శన ప్రారంభిస్తామని, త్వరలోనే విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని గంగాధర్, హరి వెల్లడించారు.