హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు సంగతేమోకానీ, బకాయి నిధులను సైతం విడుదల చేయడం లేదు. గిరిజన సంక్షేమశాఖలో ట్రైకార్ రుణాలకు సంబంధించిన సబ్సిడీ బకాయిలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రైకార్(ట్రైబ్స్ కో ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్) ద్వారా గిరిజనులకు సబ్సిడీ రుణాలను మంజూరు చేసింది. గిరిజన యువతీయువకుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. 30 వేల మందిని లబ్ధిదారులుగా గుర్తించింది. రూ. 265 కోట్లు సబ్సిడీ రుణాలుగా అందివ్వాలని నిర్ణయించింది. చెకులను సిద్ధం చేసి క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖకు పంపగా 45.81 కోట్లు విడుదల చేసింది. ఎన్నికలు రావడంతో మిగిలిన నిధుల విడుదల నిలిచిపోయింది. అధికారంలోకి రాగానే నిధులను మంజూరు చేస్తామని కాంగ్రెస్ సైతం హామీ ఇచ్చింది. రెండున్నరేండ్లు గడుస్తున్నా నేటికీ నిధులు విడుదల చేయలేదు. కొత్త రుణాలనూ మంజూరు చేయడంలేదు. ట్రైకార్లో యాక్షన్ ప్లాన్ అటకెక్కింది. బకాయి నిధుల కోసం ధర్నాలు చేసినా, వినతిపత్రాలు సమర్పించినా, ప్రభుత్వ పెద్దలను కలిసి ఎన్నిసార్లు గోడు వెళ్లబోసుకున్న పట్టించుకోవడం లేదని గిరిజన సంఘా లు, యువత మండిపడుతున్నారు. నిధులు విడుదల చేయకుంటే ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరిస్తున్నారు.
బకాయిల్లేవు.. హామీల అమలూ లేదు
కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. రుణాలు మంజూరు చేస్తామని ప్రకటించింది. ఆచరణలో ఒక్కటీ అమలు కావడం లేదు. ట్రైకార్ సంస్థలో యూనిట్ కాస్ట్ రూ. 50 వేల నుంచి రూ.10 లక్షల వరకు రుణం పొందే అవకాశమున్నది. గతంలో దరఖాస్తు చేసుకుని, ఎంపికైన గిరిజన యువతీయువకులు నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. అనేకసార్లు ప్రభుత్వ పెద్దలను కలిసి విన్నవించాం. కనీస స్పందన కరువైంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలి. పెండింగ్ రూ.219 కోట్లను తక్షణం విడుదల చేయాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడుతాం.
– శ్రీరాంనాయక్, టీజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి