రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ ఎండగడుతుండడం.. ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ నిజామాబాద్ అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాలతో కలిసి గురువారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో రైతులు కల్లాలు కట్టుకుని లబ్ధి పొందితే వాటిని ఆపే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్త్తూ నిజామాబాద్‌లోని ధర్నా చౌక్‌లో రైతు మహాధర్నా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నామని.. జిల్లాలోని రైతన్నలంతా పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపు నిచ్చారు. దేశానికి నిద్రపోతున్న చౌకీదారులు అవసరం లేదని… కల్లాల నిర్మాణానికి వెచ్చించిన నిధులను తిరిగి చెల్లించాలంటూ లేఖ రాయడంతో కేంద్రంలోని బీజేపీ రైతు వ్యతిరేక సర్కారు అని మరోసారి స్పష్టమైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ స్పందించారు. గతంలోనే చంద్రబాబును ఈ ప్రాంత ప్రజలు తిరస్కరించారన్నారు.
-నిజామాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంతోపాటు ఈ ప్రాంత రైతన్నలపై కుట్రపూరితంగా, కక్షగట్టి వేధిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేంద్ర విధానాలను ఎండగడుతున్నందుకు తెలంగాణ రాష్ట్రంపై మోదీ ప్రభుత్వం కావాలని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు.
దుర్మార్గంగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద తెలంగాణ రైతులు కల్లాలు కట్టుకుని లబ్ధి పొందితే.. వాటిని ఆపే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాతో కలిసి నగరంలోని తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మోదీ రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ శుక్రవారం రైతు మహాధర్నా కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా పాత కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని రైతన్నలందరూ పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కల్లాలపై రైతులు వెచ్చించిన డబ్బులు వాపస్ ఇవ్వండంటూ రాష్ట్ర సర్కారుకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాయడం దుర్మార్గమన్నారు. రూ.151 కోట్లు తిరిగి చెల్లించడంటూ చెప్పడం హేయమన్నారు. రైతులు అని చూడకుండా బీజేపీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రైతుల కోసం రూ. 3లక్షల కోట్లు ఖర్చు
ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా రైతులకు రూ.3లక్షల కోట్లు ప్రయోజనం జరిగిందని మంత్రి తెలిపారు. రైతుబంధు కింద రూ.57వేల కోట్లు, రైతుబీమాకు రూ.4,648కోట్లు, రాష్ట్రమే గ్యారెంటీగా ఉండి బ్యాంకుల్లో అప్పులు చేసి కొనుగోలు కేం ద్రాల ద్వారా ఇప్పటి వరకు రూ.1,07,000కోట్ల వరి ధాన్యం కేసీఆర్ ప్రభుత్వం సేకరించిందని వివరించారు. విద్యుత్ విషయంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.36వేల కోట్లు, ఉచిత విద్యుత్‌కు ప్రతి ఏడాది డిస్కమ్‌లకు రూ.10,500 కోట్లు చెల్లించిందన్నారు. రూ.లక్షన్నర కోట్లతో ప్రాజెక్టులపై వెచ్చించిన మొత్తం కలుపుకుంటే రూ.3లక్షల కోట్లు దాటిందన్నారు.
రైతు కల్లాల కోసం రూ.151కోట్లు ఖర్చు చేస్తే దాన్ని తిరిగి ఇవ్వాలని మోదీ ప్రభుత్వం హుకుం జారీ చేయడం సిగ్గుచేటన్నా రు. ఉపాధి హామీ కింద ఎందుకు వాడుతున్నారని కేంద్రం ప్రశ్నిస్తుండడం మంచిది కాదన్నారు. ఇతర రాష్ర్టాల్లో చేపలు పట్టుకుని ఆరబెట్టుకునేందుకు డబ్బు లు ఇచ్చి ..ఇక్కడ కల్లాలకు ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఉపాధి హామీలో కేంద్రంతోపాటు రాష్ట్రం వాటా కూడా ఉందన్నారు.
అర్వింద్ ఒక డ్రగ్ బానిస: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
తమది ఫైటర్స్ ఫ్యామిలీ అని, బీజేపీది ఛీటర్స్ ఫ్యామిలీ అంటూ బీజేపీపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. కేసీఆర్, కేటీఆర్, కవిత రాక్ స్టార్స్ అని పేర్కొన్నారు. బండి సంజయ్, అర్వింద్ ఫేక్ స్టార్లు, జోక్ స్టార్లు అని విమర్శించారు. బీఆర్ఎస్ అంటేనే భారతీయ రైతు సమితి అని పేర్కొన్నారు. గోల్కొండతోపాటు ఢిల్లీలోని ఎర్రకోట కూడా బీఆర్ఎస్దే అని అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కేసీఆరే అని, ఆయన మన స్వర్ణయుగపు నమూనా అని అభివర్ణించారు.
బీజేపీకి సై అంటే జేజేలు.. నై అంటే జైలు పాలా? ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులను లొంగదీసుకోవడమే బీజేపీ సిద్ధాంతమా? అని ప్రశ్నించారు. బీజేపీ హయాంలో ఈడీ, ఐటీ, సీబీఐలు నమోదు చేసిన కేసుల్లో ఒక్క శాతమైనా నిలిచాయా అని పేర్కొన్నారు. బీజేపీకి సరెండ్ అయిన వారిపై కేసులు లే కుండా చేయలేదా అని గుర్తుచేశారు. ఇదేనా కమలనాథుల నీతి అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలతో బెదిరిస్తే తాము భయపడతామా, తమ జోలికొస్తే ఊరుకోమని, కేసీఆర్ సైగ చేస్తే చాలు బీజేపీని తరిమి కొడతామన్నారు.
కేసీఆర్‌తో గోక్కున్నోడెవడూ బాగుపడ్డట్లు చరిత్రలో లేదంటూ హె చ్చిరించారు. నాలుగు దిక్కులా వెలుగునిచ్చే సూర్యుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. మూడు ఫేజ్‌ల కరెంట్ ముట్టుకుంటే మాడి మసైపోతారన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి రూ.25వేల కోట్లు తెచ్చామని తెలిపారు. బీజేపీ నాయకుల కళ్లకు తాము చేసిన పనులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎంపీ అర్వింద్ జిల్లాకు నయా పైసా తీసుకురాలేదన్నారు. ఆయన డ్రగ్ బాని స అని పేర్కొన్నారు. తొండి సంజయ్. బండి సంజయ్‌లు ఇద్దరూ ఇద్దరే అని, వారుతెలంగాణకు పట్టిన శని అ న్నారు.
రాజకీయాలకు చీడ పురుగులాంటోళ్లు అం టూ మండిపడ్డారు.కేటీఆర్‌ను వెంట్రుకలు ఇస్తవా అంటూ మాటిమాటికి అంటున్నారని గుర్తుచేశారు. కేటీఆర్ వెంట్రుకలతో వారు బోడిగుండ్లకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుంటారా అంటూ ఎద్దేవా చేశారు. చాలెంజ్ చేయాలంటే ఓ రేంజ్ ఉండాలన్నారు. గుజరా త్ బేరగాడికి ఒకరు చెప్పులు మోస్తారని, ఇంకొకరు ని జామాబాద్ సెంటర్లో చెప్పు దెబ్బలు తింటారన్నారు.
బీజేపీది దమన నీతి: అర్బన్ ఎమ్మెల్యే బిగాల
బీఆర్ఎస్ శుక్రవారం తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా పిలుపునిచ్చారు. కల్లాల కోసం కల్లోలం తప్పదన్నారు. ఉపాధి నిధులను వాపస్ చేయాలని కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న కక్షపూరిత వైఖరిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. మద్దతు ధర ఇవ్వబోమని,ధాన్యం కొనబోమని, ఉచిత కరెంట్ ఇవ్వొద్దని, మోటర్లకు మీటర్లు పెట్టాలని అడుగడుగునా రైతులను ఇబ్బందులు పెడుతున్నారంటూ మోదీ సర్కారుపై మండిపడ్డారు. కల్లాలు నిర్మిస్తే తప్పేంటని, చేపలు ఆరబోతకు అనుమతించి దీనికి అనుమతి ఇవ్వరా? అంటూ ప్రశ్నించారు.
సీబీఐ, ఐటీ, ఈడీ పేరుతో 21వేల కేసులు పెడతారా? బీజేపీయేతర రాష్ర్టాల్లోనే 90శాతం కేసులా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లొంగని వారిని లొంగదీసుకునేందుకు ఇదంతా జరుగుతోందన్నారు. బీఆర్ఎస్కు భయపడి బీజేపీ ఈ రకమైన దాడులు చేస్తోందని ఆరోపించారు. వీరి బెదిరింపులకు బెదిరేది లేదన్నారు. దేనికైనా సిద్ధంగా ఉన్నామని, దాడులకు భయపడేదిలేదన్నారు. బీఆర్ఎస్లో ఉన్న వారంతా ప్రాణాలు తెగించి వచ్చినవారేనంటూ తెలిపారు. ఈడీ, బోడీలకు భయపడబోమని, టార్గెట్ రాజకీయాలు తెలంగాణలో జరగవన్నారు. మీడియా సమావేశంలో నగర మేయర్ నీతూ కిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.