మేడ్చల్, మార్చి19 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అక్రమ మైనింగ్ జోరుగా సాగుతున్నది. జిల్లాలో 16 క్రషర్లకు ప్రభుత్వ అనుమతి ఉంది. అయితే క్రషర్ల యజమానులు గనులకు అనుమతి పొందిన దానికంటే ఎక్కువ రెట్లు తవ్వకాలు జరుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పెద్ద గుంతలు లోతుగా తవ్వి రాయిలు తీస్తున్నారు. దీంతో ఈ గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయి. దీనికి తోడు క్రషర్ యజమానులు ప్రభుత్వానికి రాయల్టీలు సైతం ఎగ్గొడుతున్నట్లు విమర్శలున్నాయి.
అంతేకాక టిప్పర్లలో పరిమితికి మించి రవాణా చేస్తుండటంతో అధికలోడ్ వల్ల పరిసర ప్రాంతాల రహదారులు చెడిపోతున్నాయి. క్రషర్ల తవ్వకాలతో పాటు మట్టి, ఇసుక తవ్వకాలను మైనింగ్ అధికారులు నిరోధించడంలో విఫలమవుతున్నారనే విమర్శులున్నాయి. మేడ్చల్, కీసర, శామీర్‌పేట్, మూడుచింతలపల్లి మండలాలలో అనుమతులు లేకుండా మట్టి, ఇసుక తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. శామీర్‌పేట్ మండలం బొమ్మరాసిపేట్ గ్రామ సమీపంలో మట్టి గుట్టలను అక్రమార్కులు తవ్వి ఇతర ప్రాంతాలకు తరలించి ప్రభుత్వానికి రాయల్టీ ఎగవేస్తున్నారు. జిల్లాలోని చిన్న చిన్న వాగుల నుంచి సైతం ఇసుకను తవ్వి సొమ్ముచేసుకుంటున్నారు.
అధికారుల పర్యవేక్షణ లోపం..
జిల్లాలో అక్రమ మైనింగ్‌లపై అధికారుల పర్యవేక్షణ లోపం కారణంతో పరిస్థితి అక్రమమార్కుల ఇష్టారాజ్యంగా మారింది. అయితే తెరచాటున మైనింగ్ అధికారులు కూడా అక్రమార్కులకే సహకారం అందిస్తున్నట్లు విమర్శలూ లేకపోలేదు. అయితే దీనికి విరుద్ధంగా అక్రమ మైనింగ్‌లపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని బడానేతలు ప్రకటనలు మాత్రం గుప్పిస్తున్నారు. అక్రమ మైనింగ్‌లు విషయమై స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రాత్రి వేళల్లో టిప్పర్లలో పరిమితికి మించి రవాణా చేస్తున్న క్రమంలో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక ఇటుక బట్టీలకు అక్రమ మట్టిని వినియోగిస్తున్నారు. ప్రభుత్వ భూములు ఉన్నచోట మట్టిని తవ్వి ఇటుకలను తయారు చేస్తున్నారు. ఇటుకల తయారీకి తప్పనిసరిగా మైనింగ్ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇటుకలు తయారు చేసేవారు ఎలాంటి అనుమతులు తీసుకోవడం లేదు.
చర్యలు తీసుకుంటా: అధికారులు
జిల్లాలోని క్రషర్లలో అనుమతులకు మించి తవ్వకాలు జరిపినట్లయితే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇచ్చిన అనుమతుల మేరకు పరిశీలించి నిబంధనలకు విరుద్దంగా తవ్వకాలు జరిపితే నోటీసులు జారీచేస్తామని తెలిపారు.