న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ప్రక్షాళన చేపట్టారు. సుమారు 600 మంది సబ్జెక్ట్ నిపుణులను తొలగించారు. వీరి స్థానంలో బోర్డులోకి కొత్త నిపుణులను నియమిస్తున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆదేశాల ప్రకారం ఈ మార్పులు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్టీఏ రివ్యూ మీటింగ్‌లో మంత్రి జోషి అధికారులకు మార్గనిర్దేశం చేశారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రశ్నాపత్రాల తయారీలో నాలుగు అంచెల విధానాన్ని అమలు చేయనున్నట్లు ఎన్టీఏ డైరెక్టర్ మంత్రి జోషికి వివరించారు. భద్రతను పెంచి, లోపాలను తగ్గించనున్నట్లు తెలిపారు.
రాబోయే మూడు వారాల్లోగా సుమారు 25 మంది అధికారులను ఎన్టీఏలోకి తీసుకోనున్నట్లు డైరెక్టర్ జనరల్ చెప్పారు. ఎన్టీఏ ఆఫీసులను కొత్త ప్రదేశాలకు మార్చనున్నారు. సీఐఎస్ఎఫ్ దళాలను మోహరించే రీతిలో ఆఫీసులను ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల జరిగిన నీట్ యూజీ పేపర్ పరీక్ష లీక్, రద్దు ఘటనల నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి, ఎన్టీఏ డైరెక్టర్‌తో మంత్రి జోషి సమావేశం అయ్యారు.
ప్రస్తుతం ఎన్టీఏ నుంచి 50 మంది సిబ్బందిని తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. కొత్తగా 10 ప్రొఫెషనల్ లీడర్షిప్ పొజిషన్స్ ప్రకటించారు. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, చీప్ ఇన్ఫర్మేషన్ సెక్యూర్టీ ఆఫీసర్, జనరల్ మేనేజర్ టెస్ట్ సెక్యూర్టీ, ఆర్ అండ్ డీ జనరల్ మేనర్ పోస్టులకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సైబర్ సెక్యూర్టీ, సైకోమెట్రిక్స్, క్వశ్చన్ పేపర్ డిజైన్ అంశాలపై ఫోకస్ పెట్టినట్లు మంత్రికి చెప్పారు. కాన్ఫిడెన్షియల్ ఆపరేషన్స్‌కు సంబంధించిన వ్యవస్థను సమూలంగా మార్చాలని మంత్రి ఆదేశించారు.