నిర్మల్, మార్చి 19(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా అప్రకటిత కరెంటు కోతలు అమలవుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కోతలు విధించడం లేదని చెబుతూనే, మరోవైపు మరమ్మతుల పేరిట అధికారులు రోజు ఎక్కడో ఒకచోట 3 నుంచి 5 గంటలపాటు సరఫరాను నిలిపివేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, భైంసా ప్రధాన పట్టణాలతోపాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తుండడంపై ప్రజలు మండిపడుతున్నారు. మరమ్మతుల పేరిట ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రోజు ఏదో ఒక ప్రాంతంలో కరెంటు కోతలు విధిస్తున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ పట్టణంలో 42 వార్డులు ఉండగా, రోజుకు కొన్ని వార్డుల చొప్పున కోతలు విధిస్తూనే, మరో పక్క రిపేర్ల కోసమంటూ ప్రజలను మభ్యపెడుతున్నట్లు చెబుతున్నారు.
ఇలా జిల్లా వ్యాప్తంగా రోజు కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి, ఆయా ప్రాంతాల్లో కోతల సమాచారాన్ని ముందుగానే తెలియజేసేందుకు జిల్లా విద్యుత్ అధికారులు ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఏ రోజు ఏయే ప్రాంతాల్లో కరెంటు సరఫరాను నిలిపివేస్తారో తెలియజేసేలా ఈ గ్రూపుల్లో మెస్సేజ్‌లు పెడుతూ అప్రకటిత కోతలు విధిస్తున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు నిర్మల్ పట్టణంతోపాటు లక్ష్మణచాంద, నిర్మల్ రూరల్ మండలాల్లో మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఒక రోజు ముందే అధికారులు వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చారు.
అధికారులు ఇచ్చిన సమాచారానికి భిన్నంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కరెంటు సరఫరా నిలిచింది. ఏకదాటిగా 4 గంటలపాటు నిర్మల్ పట్టణంలోనే కాకుండా దాదాపు 50 గ్రామాల్లో అప్రకటిత కరెంటు కోతలు విధించారు. దీంతో కరెంటు సరఫరా లేక ఉదయం పూట బోరు బావులు పని చేయకపోవడంతో నీళ్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు మార్చిలోనే ఎండలు మండిపోతుంటే.. ఇంతటి వేడిలో రోజు చేయాల్సిన మరమ్మతులు ఏముంటాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు? ఎండపూట కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఉక్కపోత భరించలేక పిల్లలు, పెద్దలు, ముఖ్యంగా వృద్ధులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెప్పపాటు కూడా కరెంటు పోయేది కాదని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా గంటల తరబడి కరెంటు కోతలు అమలు చేసేవారు. ప్రతి పట్టణంలో ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు ఇలా రోజులో ఆరు గంటలపాటు కరెంటు కోతలు అమలు చేసేవారు. అలాగే పల్లెల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజులో 12 గంటలపాటు సరఫరా నిలిచిపోయేది. దీంతో ప్రజలు ఇన్వర్టర్లను ఏర్పాటు చేసుకునే వారు. అయితే 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీఎం కేసీఆర్ మొట్టమొదటగా విద్యుత్ సమస్యపైనే దృష్టి సారించి అనేక సంస్కరణలు అమలు చేశారు. దీంతో అన్ని వర్గాల ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందింది.
పడేండ్ల కేసీఆర్ పాలనలో కరెంటు కోతలే లేని రాష్ట్రంగా తెలంగాణ అవతరించడంతో ఇన్వర్టర్ల పరిశ్రమలు దాదాపుగా మూతపడ్డాయి. అంతరాయం లేకుండా కరెంటు సరఫరా అవుతుండటంతో తమ ఇండ్లల్లో అప్పటికే ఏర్పాటు చేసుకున్న ఇన్వర్టర్లను ప్రజలు స్వచ్ఛందంగా తొలగించారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో మళ్లీ పాత రోజులే వచ్చాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్వర్టర్ల దుకాణాలు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. ఎప్పుడు కరెంటు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియక ప్రజలు మళ్లీ ఇన్వర్టర్లను కొనుగోలు చేస్తున్నారు.
విద్యుత్‌శాఖ విధిస్తున్న అప్రకటిత కరెంటు కోతలతో చిరు వ్యాపారుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ప్రధాన పట్టణాలతోపాటు, మండల కేంద్రాల్లోని వెల్డింగ్ దుకాణాలు, జిరాక్స్ సెంటర్లు, మోటార్ వైండింగ్ దుకాణాలు కరెంటుపైనే ఆధారపడి నడిచే వ్యాపారాలపై ఈ కరెంటు కోతల ప్రభావం తీవ్రంగా ఉంటున్నది. మరమ్మతుల పేరిట గంటల కొద్ది విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని చిరు వ్యాపారులు చెబుతున్నారు. ఇష్టానుసారంగా కరెంటు కట్ చేస్తుండడంతో సకాలంలో ఆర్డర్లు ఇవ్వలేకపోతున్నామని, నిర్మల్‌లోని శాంతినగర్ చౌరస్తాలో గల వెల్డింగ్ దుకాణం నిర్వాహకుడు నరేశ్ తెలిపాడు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందోనన్న ఆందోళనలో చిరు వ్యాపారులు ఉన్నారు. ఈ అప్రకటిత కోతలపై ఎన్పీడీసీఎల్ నిర్మల్ జిల్లా ఎస్ఈ సుభాష్‌ను ఫోన్లో సంప్రదించేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కరెంటు సక్కగ ఉంటలేదు. ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతదో గ్యారెంటీ లేకుండా అయింది. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా గంటల కొద్ది కరెంటు బంద్ అవుతున్నది. ఈ రోజు పొద్దున ఆరు గంటల నుంచి కరెంటు లేదు. పది దాటిన తర్వాత వచ్చింది. ఇట్లనే రోజు గంట, అరగంట కోతలు పెడ్తున్నరు. ఎండలు పెరగడం, కరెంటు కోతలతో చాలా ఇబ్బంది పడుతున్నం. కేసీఆర్ సారు ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా కరెంటు పోయేది కాదు.
– సరిత, గృహిణి, కొండాపూర్