నిర్మల్, మార్చి 19(నమస్తే తెలంగాణ) : ఆశ కార్యకర్తలు అంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చులకనగా చూస్తున్నాయి. ప్రతి 1000 మంది జనాభాకు ఒకరి చొప్పున నియమితులైన వీరికి వేతన స్థిరీకరణ లేకుండాపోయింది. నెలంతా కష్టపడితే రూ.9 వేలు మాత్రమే ఇస్తున్నారు. ఇందులో గర్భిణులను నమోదు చేయకపోతే వేతనాలు నిలిపివేస్తున్నారు. దీంతో ఆశ కార్యకర్తల కుటుంబాలు గడవడం కష్టంగా మారింది. నామమాత్రపు వేతనం ఇస్తున్నా నెల తర్వాత అది కూడా వస్తుందో రాదో తెలియని పరిస్థితితో బతుకులు వెళ్లదీస్తున్నారు.
తమ జాబ్ చార్ట్‌తో సంబంధం లేని పనులు చేయిస్తూ, పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.18 వేల వేతనం చెల్లిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదు. అలాగే కరోనా సమయంలో అందించిన సేవలకు సంబంధించి ఆరు నెలల పారితోషికాన్ని ప్రభుత్వం బకాయి ఉంది. దీంతో పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యల సాధనకు ఆశ వర్కర్లు పోరుబాట పట్టారు.
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 16, 17వ తేదీల్లో కలెక్టరేట్ల ఎదుట ధర్నా, వంటావార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గత సోమ, మంగళవారాల్లో నిర్మల్‌లోని ఆర్డీవో కార్యాలయం ఎదుట రిలే దీక్షలు, ధర్నా, రాస్తారోకో చేపట్టి తమ నిరనను తెలియజేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలపై చర్చించి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 20న మంత్రుల నివాసాల ఎదుట ధర్నా, 28న చలో హైదరాబాద్ కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 18 పీహెచ్‌సీలు, 3 అర్బన్ హెల్త్ సెంటర్లు, 3 బస్తీ దవాఖానలతోపాటు పలు ఉప కేంద్రాల పరిధిలో మొత్తం 550 మంది ఆశ వర్కర్లు పని చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్నతాధికారులు ఏ పని చెబితే ఆ పని చేస్తున్నప్పటికీ తమకు కనీస వేతనం అమలు చేయడం లేదని వాపోతున్నారు.
వాస్తవానికి ఆశ కార్యకర్తలు గర్భిణులను గుర్తించడం, వారికి నెలనెలా టీకాలు వేయించడం, ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించడం, చిన్న పిల్లలకు ప్రతి బుధ, శనివారాల్లో టీకాలు వేయించడం చేయాలి. ప్రతి డిసెంబర్, జనవరిలలో 15 రోజులపాటు లెప్రసీ సర్వే నిర్వహించాలి. ఇందుకు ఒక్కో ఆశ కార్యకర్తకు రూ.950 చెల్లించాలి. కాని గత రెండేళ్లుగా ఏ ఒక్క కార్యకర్తకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో లెప్రసీ సర్వే చేయబోమని స్పష్టం చేస్తున్నారు. గతంలో చేసిన అన్ని సర్వేలకు సంబంధించిన పెండింగ్ పారితోషకాలు చెల్లిస్తేనే అధికారులు అప్పగించిన సర్వేలు చేస్తామని చెబుతున్నారు.
గ్రామాల్లో ఆశ కార్యకర్తలపై అన్ని శాఖల అధికారులు పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లెప్రసీ సర్వేనే కాకుండా ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ఆరోగ్య మ హిళ కార్యక్రమానికి మహిళలకు ఆశ కార్యకర్తలే అవగాహన కల్పించి ఆసుపత్రులకు తీసుకొస్తున్నారు. అలాగే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో జరిగే శుక్రవారం సభకు కూడా వారినే వినియోగించుకుంటున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఆశ కార్యకర్తలకు రూ.800 చొప్పున చెల్లిస్తామని చెప్పిన అధికారులు.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. తమతోపాటు విధులు నిర్వహించిన అన్ని శాఖల ఉద్యోగులకు పారితోషికం చెల్లించి తమకు మాత్రమే చెల్లించకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాల్లోనే కాకుండా ఇతర గ్రామాల్లో డ్యూటీలు వేయడం వల్ల ఆటోల్లో వెళ్లి వ్యయ ప్రయాసాలకోర్చి విధులు నిర్వహించామని, తమకు పారితోషికం చెల్లించలేదని వాపోతున్నారు.
ఆశ కార్యకర్తల బతుకులు భారంగా మారుతున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నప్పటికీ కనీస వేతనం కూడా అందకపోవడంతో వారి జీవితాలు గడవడం కష్టంగా మారుతున్నది. ఏదో ఒకరోజు వేతనాలు పెరుగుతాయని, ఉద్యోగులుగా గుర్తింపబడుతామన్న ఆశతో బతుకు భారమైనప్పటికీ విధులు నిర్వహిస్తున్న ఆశ కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో తీవ్ర నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడుతున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం కల్పిస్తామని, రూ.18 వేలకు వేతనం స్థిరీకరిస్తామని ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే.. రాబోయే రోజుల్లో ఆందోళనలను ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా నాయకురాలు సుజాత హెచ్చరించారు.
ఆశ వర్కర్లకు కనీస వేతనం చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. రెండు నెలలుగా తమ వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తామన్న కనీస వేతనం రూ.18వేలు వెంటనే అమలు చేయాలి. అలాగే తమ జాబ్ చార్ట్‌తో సంబంధం లేకుండా అధికారులు పెట్టే టార్గెట్లతో ఆశా వర్కర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నరు. ప్రతి నెల ఇంతమంది గర్భిణులను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావాలంటూ టార్గెట్ పెడుతుండడంతో మానసిక వేధనకు గురవుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో గర్భిణులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇందుకు అధికారులు తమను బాధ్యులు చేస్తున్నారు. ఇచ్చే అరకొర జీతాన్ని కట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటాం. – బానోత్ సుజాత, ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు, నిర్మల్