నంగునూరు, మార్చి 19 : ఆయిల్‌పామ్ తోటల పెంపకంతో రైతుల మంచి ఆదాయం పొందవచ్చిన, ఈ తోటల సాగుతో అనేక లాభాలు ఉన్నాయని, తాను స్వయంగా సాగుచేసి ఆ ఫలితాలు సాధించినట్లు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో గురువారం రైతుమేళా కార్యక్రమాన్ని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు, ఎంపీ రఘునందన్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉద్యానవన, పట్టుపరిశ్రమ, మత్స్య, విత్తనాభివృద్ధి సంస్థ, చేనేత & జౌళి శాఖలతో పాటు వివిధ వ్యవసాయ ఉత్పత్తుల సంస్థలు, విజయ డైరీ, వ్యవసాయ యాంత్రీకరణ సంస్థల స్టాళ్లను ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటల సాగు చేసి అధిక ఆదాయం పొందవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం రైతులకు ఎకరాకు రూ. 4200 సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు. తోటల పెంపకానికి ఆయిల్‌ఫెడ్ అధికారుల వద్ద రైతులు నమోదు చేసుకోవాలని సూచించారు. మనదేశం పామాయిల్ దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు.
రైతులకు ప్రభుత్వం సహకారం : స్పీకర్
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ… పామాయిల్ కంపెనీ ఏర్పాటు చేయాలనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలలు నిజమయ్యాయని అన్నారు. రైతులు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

Harishrao
రైతులకు కీలక ఆదాయ వనరు
తెలంగాణ రైతులకు ఆయిల్‌పామ్ తోటల పెంపకం కీలక ఆదాయ వనరుగా మారిందని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. అకాల వర్షాలు, కోతుల బెడద, దొంగల భయం లేకుండా ఆయిల్ పామ్ భరోసానిస్తోందని, ఎకరానికి రూ.51 వేల వరకు సబ్సిడీ లభిస్తున్న ఏకైక పంట ఇదేనని అన్నారు. ఇందులో అంతర పంటలు సాగుచేసుకోవచ్చని, మొదటి మూడేండ్లు రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 3 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల పెంపకం జరుగుతున్నదని, రాబోయే మూడేండ్లలో మరింత విస్తరణకు కృషి చేస్తున్నామని చెప్పారు. నర్మెట్ట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ చరిత్రాత్మక ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని, ఇకడ బయట నుంచి విద్యుత్ తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇకడే 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. అవసరమైతే ప్రభుత్వానికి విద్యుత్ సరఫరా చేయగలరని తెలిపారు. ఇక్కడే రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు.
రైతు ఉత్సవాలను సద్వినియోగం చేసుకోవాలి
150 స్టాళ్లతో నిర్వహిస్తున్న రైతు ఉత్సవాలను, రైతుమేళాను అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. 22న సీఎం నర్మెట రానున్నారని తెలిపారు. నర్మెట ఫ్యాక్టరీ ద్వారా గంటకు 120 టన్నుల క్రషింగ్ చేసే సామర్థ్యం ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. అనంతరం మంత్రి శ్రీహరి, ఎంపీ రఘునందన్ , ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు.
ఆదర్శ రైతు భాగ్యలక్ష్మికి సన్మానం
ఈ సందర్భంగా ఆదర్శ రైతు భాగ్యలక్ష్మి తమ అనుభవాలను పంచుకున్నారు.అనంతరం అతిథులు ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలో తిరి గి ఫ్యాక్టరీ పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, వంటే రు యాదవ రెడ్డి, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేంద్రమోహన్, కలెక్టర్ కె.హైమావతి, మాజీ ఎమ్మెల్సీ రాము లు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి సరూపారాణి, జిల్లా ఉద్యానవన అధికారి సువర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆయిల్ ఫెడ్ అధికారులు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ దూరదృష్టితో ‘ఆయిల్‌పామ్’కు ఊతం
నంగునూరు, మార్చి 19 : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దూరదృష్టి, తీసుకున్న నిర్ణయాలతోనే రాష్ట్రంలో ఆయిల్‌పామ్ తోటల పెంపకానికి ఊతం లభించిందని దు బ్బాక ఎమ్యెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. నర్మెటలో రైతు మేళా ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. పామాయిల్ పంట ప్రాముఖ్యతను ముందుగానే గుర్తించిన కేసీఆర్, సిద్దిపేట జిల్లాలోని నర్మెట ప్రాంతంలో ఫ్యాక్టరీ స్థాపనకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. గతంలో పామాయిల్ అంటే ఖమ్మం జిల్లా అశ్వరావుపేట గుర్తుకు వచ్చేదని, నేడు నర్మెట ప్రాంతం కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందన్నారు. మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టుల ద్వారా గాలిలో తేమ శాతం పెరిగి పామాయిల్ సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. ఈ ప్రాంతంలో పామాయిల్ సాగు విస్తరణకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేశారు.దుబ్బాక నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులకు సంబంధించిన ఉపకాల్వల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.